నల్గోండ, జనవరి 8,
పిల్లల చదవుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం.. అందరూ చదువుకోవాలన్న ఉద్దేశంతో నిర్బంధ విద్య అమలు చేస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, కళాశాల విద్యార్థులకు కూడా కొన్ని రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నాయి. ఇక పేదలు కూడా ఉన్నత చదవులు చదువోకోవాలని ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తున్నాయి. ఇక యూనివర్సిటీల్లో చదువుకునే పిల్లలకే కేంద్రం యూసీసీ ద్వారా నిధులు అందిస్తోంది. భోజనంతోపాటు, చదువులకు అవసరమైన సౌకర్యాలు కల్సిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వాటాగా సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలోని ఓ యూనివర్సిటీలో విద్యార్థులను ఖైదీలకన్నా అధ్వానంగా చూస్తున్నారు. గొడ్డుకారంతో భోజనం పెడుతున్నారు. విద్యార్థులు ఈ దృశ్యాలను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.నల్గొండలోని మహాత్మాగాంధీ యూనిర్సిటీ యాజమాన్యం విద్యార్థులను ఖైదీల్లా చూస్తోంది. హాస్టళ్లలో ఉండే ఆడ పిల్లలకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం గొడ్డుకారంతో పెడుతున్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయినా యాజమాన్యం స్పందిచండం లేదు. ఖైదీలకు కూడా ఇలా గొడ్డుకారంతో భోజనం పెట్టరని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారంతో భోజనం చేయలేక పస్తులు ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణవేణి హాస్టల్‌లోని విద్యార్థినులు భోజనం నిర్వాహకులతో గొడవకు దిగారు.రోజూ కారంతో టిఫిన్, భోజనం పెట్టడంపై యాజమాన్యం స్పందించకపోవడంతో విద్యార్థినులు నిర్వాహకులను నిలదీశారు. ఇలాంటి అన్నం ఎలా తినాలని ప్రశ్నించారు. మీ పిల్లలకు ఇలాగే పెడతారా అని నిలదీశారు. ప్రభుత్వాలు తమ కోసం కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నా తమకు ఎందుకు ఇలాంటి భోజనం పెడుతున్నారని ప్రశ్నించారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.మహాత్మాగాంధీ యాజమాన్యం తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. విద్యార్థినులను పిల్లల్లా చూసుకోవాల్సిన యాజమాన్యం ఇలా గొడ్డుకారంతో భోజనం పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నారు. నిర్వాహకులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.