విజయవాడ
చంద్రబాబు గారు..మీరు మోడీ కోసం ఎదురు చూస్తుంటే, ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తోందని ఏపీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోంది. తిరుపతి వేదికగా మీ సమక్షంలోనే రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా అన్నారు. 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు కావాలని మీరు అడిగారు. మాటలు కోటలు దాటాయి తప్పిస్తే.. చేతలకు దిక్కులేదని అన్నారు.
రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరు కలిసి ఆటకెక్కించారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన పాపాన పోలేదు. ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టలేదు. పారిశ్రామిక కారిడార్లు స్థాపన జరగలేదు. 10 ఏళ్లు దాటినా పోలవరం నుంచి చుక్క నీరు పారలేదు. కడప స్టీల్ కట్టలేదు. విశాఖ ఉక్కును రక్షించలేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల్లో కనీసం లక్ష ఉద్యోగాలు కూడా రాష్ట్రానికి ఇచ్చింది లేదు. విశాఖకు వస్తున్న ప్రధాని మోడీ గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. విశాఖ వేదికగా ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించండి. విభజన హామీలపై క్లారిటీ ఇప్పించండి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని మోడీతో పలికించండని అన్నారు.