YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సామినేని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు...

సామినేని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు...

విజయవాడ, జనవరి 9, 
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వైసిపిలో కొత్త తలనొప్పి మొదలైందట. ఎన్నికల ఫలితాల తరువాత ఆ పార్టీని నడిపించే నాయకుడు లేక నియోజకవర్గం నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఏరి కోరి మరీ వైసీపీ బాధ్యతలు అప్పగించిన ఉదయభాను పార్టీని వీడడంతో.. చివరికి నియోజకవర్గంలో నడిపించే నాయకుడు లేక.. కొత్త నాయకుడు రాకపోతాడా? అంటూ ఎదురు చూపులు చూస్తున్నారు.ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అలాంటి నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఒక్కసారి రెపరెపలాడించి.. ఆ పార్టీ కి నియోజకవర్గంలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌లకి వీర విధేయుడైన సామినేని ఉదయభాను . కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ పక్షాన చేరిన తర్వాత గత మూడు పర్యాయాలుగా నియోజకవర్గ నాయకుడిగా ఆయనే వైసీపీని నడిపిస్తూ వచ్చారు . 2014 , 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సామినేని ఉదయభాను 2019 ఎన్నికల్లో మాత్రమే వైసీపీ తరపున గెలిచారు.వైసీపీ జెండాను జగ్గయ్యపేట నియోజక వర్గంలో పార్టీ ఎగరేశామన్న ఆనందం ఉదయభానుకి ఒక్కసారే దక్కింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి సామినేని ఉదయభాను పోటీచేసినా టీడీపీ అభ్యర్థి శ్రీరాం తాతయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 2019 సార్వత్రిక ఎన్నికల్లో శ్రీరామ్ తాతయ్యను ఓడించగలిగారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ సామినేని ఉదయభానుకి పరాజయం తప్పలేదు. అంతవరకు బాగానే ఉన్నా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలవ్వగానే ఉదయభాను వైసీపీకి రాజీనామా చేసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరి కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. దాంతో ఇప్పుడు జగ్గయ్యపేట నియోజకవర్గానికి వైసీపీ నాయకుడు ఎవరు అనే చర్చ మొదలైంది.నియోజకవర్గంలో సామినేని ఉదయభాను పార్టీని వీడటంతతో ఇప్పుడు ఆ పార్టీని నడిపించే నాయకుడు నియోజకవర్గంలో లేరని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి ఇవ్వలేదని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో సైతం తిరిగి సీటు కేటాయించే విషయంలో సైతం మీన మేషాలు లెక్కించారని అలకబూనిన సామినేని ఉదయభాను ఎన్నికల ఫలితాలు తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పేసారు. దాంతో నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు, వస్తున్న మార్పులతో నియోజకవర్గానికి కొత్త నాయకుడు రాకపోతారా? అని ఆ పార్టీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి.నియోజకవర్గంలో బలమైన నేతలుగా టీడీపీ నుంచి ఉన్న ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, జనసేన పార్టీలో జాయిన్ అయిన సామినేని ఉదయభాను లాంటి నేతలను ఎదుర్కోవాలంటే జగ్గయ్యపేట లాంటి నియోజకవర్గం లో అన్ని రకాలుగా బలమైన నాయకుడు అవసరమని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఉదయభాను జగ్గయ్యపేటలో కాంగ్రెస్ తరపున రెండు సార్లు, వైసీపీ నుంచి విజయం సాధించారు. శ్రీరాం తాతయ్య టీడీపీ అభ్యర్ధిగా మూడో సారి గెలిచారు. అలాంటి లీడర్లు ఇద్దరు ఇప్పుడు మిత్రపక్షాల్లో ఉండటంతో వైసీపీకి సమర్ధుడైన నేతను వెతకడం కత్తి మీద సామే అంటున్నారు.సామినేని ఉదయభాను పార్టీ మారినా క్యాడర్ మాత్రం వైసీపీని వదలలేదని లీడర్ గురించి క్యాడర్ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని అ పార్టీ శ్రేణులు అంటున్నాయి. అదేమంటే గత ఎన్నికల్లో కూటమి వేవ్‌లో సైతం వైసీపీ 52 వేల ఓట్లు దక్కించుకుని 16 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయిందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి . అంత వరకు బానే ఉన్నా సామినేని ఉదయభాను పార్టీని వీడగానే ఆయన ప్రధాన అనుచరుడు కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ అయిన తన్నీరు నాగేశ్వరావు కు తాత్కాలికంగా జగ్గయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. శ్రీరామ్ తాతయ్య, సామినేని ఉదయభాను లాంటి నేతలను ఎదుర్కోవడానికి ఆయన సరిపోరన్న అభిప్రాయం వ్యక్తం అవుతుందిఅదలా ఉంటే మార్పులు చేర్పులతో జగ్గయ్యపేట నియోజకవర్గం రాజకీయం ఆసక్తిగా మారింది. శ్రీరాం తాతయ్య, సామినేని ఉదయభాను ఒకప్పుడు కాంగ్రెస్‌లో మిత్రులుగానే కొనసాగారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా పని చేశారు. శ్రీరాం తాతయ్య రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో టీడీపీలో చేరారు. సామినేని ఉదయభాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి అనంతరం వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరి అభ్యర్థిగా బరిలోకి తిరిగి రెండుసార్లు ఓటమి చెంది ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఇప్పుడు ఇద్దరూ కూటమి పార్టీల్లోనే ఉండటంతో రాజకీయ మిత్రులయ్యారు. వారిద్దరినీ ఎదుర్కొనేంత బలమైన నాయకుడిని జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎవరున్నారా అని వైసీపీ వెతుక్కునే పనిలో పడింది. ప్రస్తుతం జగ్గయ్యపేట వైసీపీలో కన్ఫ్యూజన్ నెలకొన్న పరిస్థితుల్లో కొత్త నాయకుడికి పగ్గాలు అప్పగించాలని, అన్ని విధాలా సమర్ధుడైన నాయకుడ్ని తెర మీదకు తీసుకు రావాలని వైసీపీ వర్గాలు ఆశిస్తున్నాయి. చూడాలి మరి అత్యంత కీలకమైన జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీకి అంత బలం ఉన్న నాయకుడు ఎవరు దొరుకుతారో?

Related Posts