YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లీడర్లు కావలెను.. సాగర తీరంలో వైసీపీ వెతుకులాట

లీడర్లు కావలెను.. సాగర తీరంలో వైసీపీ వెతుకులాట

విశాఖపట్టణం, జనవరి 9, 
రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన భీమిలి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి భీమిలిలో వైసీపీని నడిపించే నాయకుడు లేరు. అలాగే విశాఖ ఈస్ట్‌లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంవీవీ సత్యనారాయణ పార్టీని వీడలేదు. అలాగని యాక్టివ్‌గా లేరు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వ్యాపార, వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. అలాగే గాజువాక నియోజకవర్గంలో పోటీ చేసిన ఓడిన గుడివాడ అమర్‌..నియోజకవర్గాన్ని వదిలేశారు. అంతకుముందు ఇంచార్జ్‌గా ఉన్న తిప్పల నాగిరెడ్డి వయోభారంతో యాక్టివ్ కాలేకపోతున్నారు.అనకాపల్లి నియోజకవర్గంలో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగిన అనూహ్య పరిణామాలతో మలసాల భరత్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన పత్తా లేకుండా పోయారు. దీంతో అనకాపల్లి శ్రేణులకు నాయకుడు లేక క్యాడర్ అనాథలా మారింది. అలాగే పాయకరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన గొల్ల బాబూరావు రాజ్యసభకు వెళ్లిపోయారు.ఎన్నికల్లో రాజాం నుంచి వచ్చి పోటీ చేసిన కంబాల జోగులు ఓటమి తర్వాత అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. స్థానికేతరుడు కావడంతో అప్పుడప్పుడు వస్తుపోతున్నారు తప్ప శ్రేణులకు అండగా ఉండటం లేదనే వాదన ఉంది. ఇక యలమంచిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి కన్నబాబు రాజు ఓడిపోయారు. ఆయనకు వయోభారంతో యాక్టివ్‌గా లేరు. నియోజకవర్గంలో తనకు పట్టున్నందున తన కుమారుడు సుకుమార వర్మకు పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు.ఇలా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇలా అరడజను నియోజకవర్గాలకు వైసీపీని నడిపించే నాథుడు కరువయ్యాడు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు, ఇబ్బందులకు గురవుతున్నారు. కూటమి నేతలకు తాము టార్గెట్ మారిన నేపథ్యంలో సమస్యలు చెప్పుకునేందుకు..తమకు కనీసం నాయకుడు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఓ వైపు రెడ్ బుక్ పేరుతో స్థానికంగా ఉన్న కూటమి నేతలు టార్గెట్‌ చేస్తుండటంతో తమకు మానసిక స్థైర్యం ఇచ్చే నాయకుడు లేకపోవడంతో అల్లాడుతున్నారు. ముఖ్యంగా యలమంచిలి, పాయకరావుపేట, విశాఖ ఈస్ట్, భీమిలి నియోజకవర్గాల్లోని కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో ఉన్నారట.ఎన్నికల్లో ఓడినప్పటికీ కాస్తో కూస్తో పట్టున్న ప్రాంతాల్లో కూడా లోకల్ లీడర్లకు అండ కరువైంది. గ్రామాల్లోనూ, స్థానికంగా వైసీపీ వర్గీయులుగా ముద్రపడినవారు ధైర్యంగా ఏ అంశానికి బయటకు రాలేకపోతున్నారు. ఏదైనా జరిగితే ఎవరు చూసుకుంటారనే భయం వెంటాడుతోందట. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమే ఇటీవల వైసీపీ చేపట్టిన నిరసనలు.కరెంట్ చార్జీలు పెంపు, అన్నదాతకు అండగా వైసీపీ అంటూ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చిన కార్యక్రమాలు సక్సెస్‌ కాకపోవడానికి నియోజకవర్గ స్థాయిలో నాయకుడు లేకపోవడమే అంటున్నారు. ఒక ఇంచార్జ్‌ అంటూ ఉంటే కష్టమో..నష్టమో ఆయన వెంట నడిచే అవకాశం ఉంటుంది. ఏ దిక్కూ లేకపోతే ఎక్కడికి పోతామంటూ క్యాడర్ నిట్టూర్చుతున్నారు.పార్టీ అధినేత జగన్ విశాఖ జిల్లాలో పలు నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను నియమించారు. కానీ ఈ అరడజను స్థానాలపై దృష్టి పెట్టడం లేదంటున్నారు కార్యకర్తలు. అంతేగాక ఇటీవల వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమావేశాలు పెట్టి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరుతున్నా..నాయకుడు లేకుంటే తాము ఏం చేస్తామని ఎదురు ప్రశ్నిస్తున్నారట.పోనీ నియోజకవర్గ స్థాయిలో నాయకుడు లేకున్నా జిల్లాస్థాయిలోనైనా సరే ఎవరైనా ఉన్నారంటే అదీ కూడా గగనంగా మారిందట. పొరుగు జిల్లాకు చెంది  విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బొత్ససత్యనారాయణను అతికష్టం మీద కలుసుకుని బాధలు చెప్పుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.అయితే వైసీపీకి నియోజకవర్గాల్లో నాయకులు లేని దుస్థితిపై రాజకీయవర్గాల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. అస్సలు నియోజకవర్గ స్థాయిలో పార్టీని నడిపించే సమర్థత ఉన్న నేతలు లేక జగన్ వదిలేశారా..? ఇప్పుడే ఇంచార్జ్‌లను నియామకం అవసరం లేదని ఖాళీగా ఉంచేశారా అన్న చర్చ జరుగుతోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో వైసీపీ అధినేత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో..

Related Posts