హైదరాబాద్, జనవరి 9,
బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ బీజేపీ భారీ షాకిచ్చింది. ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ కనిపించడం లేదంటూ, ఓ పోస్టర్ ను రిలీజ్ చేసిన బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తెలంగాణ ఎన్నికల అనంతరం మాజీ మంత్రి కేసీఆర్ పార్టీ వ్యవహారాలు చూస్తున్నట్లుగా భావించవచ్చు. కానీ ఒక్కసారి మాత్రమే అసెంబ్లీ వైపుకు వచ్చిన కేసీఆర్, మరలా అటువైపు కూడ రాలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మేల్యేలకు దిశానిర్దేశం చేశారు.ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు వస్తారని అందరూ భావించారు కానీ అలా జరగలేదు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపం తెలిపేందుకు స్పీకర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందుకు కూడ కేసీఆర్ గైర్హాజరయ్యారు. ముందుగా బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆరోజు తప్పక వస్తారని కూడ భావించారు. కానీ కేసీఆర్ రాకపోవడంతో, పార్టీ నేతలు కూడ షాక్ కు గురయ్యారట. ఎన్నికల సమయం నుండి కేసీఆర్ కంటే కేటీఆర్ స్పీడ్ పెంచి పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. అంతలోనే ఎమ్మెల్సీ కవితకు కూడ బెయిల్ రావడంతో వీరిద్దరూ, జిల్లాల పర్యటనలు కూడ సాగిస్తున్నారు. తాజాగా ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కేటీఆర్ పై కేసు కూడ నమోదైంది. ప్రస్తుతం ఈ విషయం న్యాయస్థానం వరకు వెళ్ళింది.ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ బయటకు వస్తారని అందరూ భావించారు. అంతేకాదు పలుమార్లు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి కూడ పలుమార్లు బహిరంగ సభ వేదికల ద్వార కోరారు. తమ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని కూడ సీఎం కోరారు. వాటికి కేసీఆర్ నుండి ఎటువంటి స్పందన కనిపించకపోగా, కేటీఆర్ మై హూనా అంటూ స్పందించారు. తాజాగా ఇదే విషయంపై బీజేపీ ఓ ట్వీట్ చేసింది.పదేళ్లు అధికారం అనుభవించిన మాజీ సీఎం కేసీఆర్ కనుబడుట లేదని, ఆయన హోదా ప్రతిపక్ష నేత అంటూ పోస్టర్ ను బీజేపీ విడుదల చేసింది. తెలంగాణను పదేళ్లు దోచుకొని, ప్రజలు ఓడిస్తే ప్రతిపక్షంలో కూడ కూర్చోకుండ కాంగ్రెస్ ను ప్రశ్నించకుండ ఉన్నట్లు పోస్టర్ లో ప్రచురించారు. బీజేపీ సోషల్ మీడియా ద్వార విడుదలైన ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి దీనికి బీఆర్ఎస్ రిప్లై ఎలా ఉంటుందో వేచిచూడాలి.