తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట, ఆరుగురు భక్తులు మరణించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోవడం, పదుల సంఖ్యలో భక్తులు గాయపడడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రెస్‌మీట్‌లో విరూపాక్షి ఇంకా ఏమన్నారంటే...
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు ఆరుగురు భక్తులు మరణించడం బాధాకరం, వారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున నివాళులర్పిస్తున్నాం, ఎంతో భక్తిశ్రద్దలతో ఉండాల్సిన టీటీడీ ఛైర్మన్‌కు మీడియా పిచ్చి, రాజకీయ పిచ్చి, టీటీడీ ఛైర్మన్‌గా ఆయన పూర్తిగా విఫలమయ్యారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, కూటమి ప్రభుత్వంలో పూర్తిగా టీటీడీని రాజకీయ వేదికగా మార్చారు, పవిత్రమైన తిరుపతిలో ఇంత అపవిత్రం జరిగింది, గతంలో వైయస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఏ రోజూ ఏ తప్పు జరగలేదు
తిరుపతి తొక్కిసలాట మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు, సీఎం చంద్రబాబు వహిస్తారా లేక, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ లేక, టీటీడీ ఛైర్మన్ వహిస్తారా, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటుంటారు, మరి ఇప్పుడు ఏమయ్యారు, పూర్తిగా పరిపాలనా వైఫల్యం వల్లే ఈ తప్పిదం జరిగింది. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌పై పెట్టిన శ్రద్ద ప్రజల సమస్యలపై పెట్టలేదు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దారుణంగా మాట్లాడుతున్నారు, ఈ మరణాలపై వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం
పవన్‌కళ్యాణ్ రెచ్చగొట్టే ప్రకటనల వల్ల ఇద్దరు యువకులు అన్యాయంగా బలయ్యారు, డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం, సాక్షాత్తూ దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చిన రోజే ఈ దుర్ఘటన జరిగింది, చంద్రబాబు తన పరిపాలనలో నన్ను మించిన వారు లేరంటారు, మీ పాలనా వైఫల్యం కాదా ఇది, తిరుపతి తొక్కిసలాటలకు ఎవరు బాధ్యత వహిస్తారు, సమాధానం చెప్పండి
హిందూ ధర్మం అన్న వారంతా ఏమయ్యారు, టీటీడీ బోర్డు సభ్యులు, అధికారులు ఏం చేస్తున్నారు, బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలి, సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీ ఛైర్మన్ ముగ్గురిలో నైతిక బాధ్యతగా ఎవరు రాజీనామా చేస్తారో చెప్పాలని ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేశారు.