YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తహశీల్దార్ సార్... జరా చూడరాదే సగానికి పైగా కళ్యాణ లక్ష్మీ దరఖాస్తుల పెండింగ్

తహశీల్దార్ సార్... జరా చూడరాదే సగానికి పైగా కళ్యాణ లక్ష్మీ దరఖాస్తుల పెండింగ్

పేద ఆడపడచుల పెళ్లికి ముందే ఆర్థిక సాయం అందించాలన్న ప్రభుత్వ ఉద్దేశం నీరుగారుతోంది. వివాహం జరిగి నెలలు గడిచినా సాయం ఎండమావిగా మారింది. మైనార్టీలకు షాదీ ముబారక్‌, ఇతర వర్గాలకు కల్యాణలక్ష్మీ పథకం అమలు చేస్తుండగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీ, ఈబీసీలు వందల మంది డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నారు.గతంలో కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాల లబ్ధిదారులకు ఆయా శాఖల నుంచి నేరుగా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో వేసేవారు. ఈ పద్ధతిలో అక్రమాలు చోటుచేసుకోవడంతో పథక ఉద్దేశం పక్కదారి పట్టింది. దీంతో పర్యవేక్షణ తీరును పకడ్బందీ చేస్తూ రెవెన్యూ విభాగానికి కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రజలతో నేరుగా రెవెన్యూ శాఖకు సత్సంబంధాలుండటం, గ్రామ, పట్టణాల వారీగా అర్హులను సులభంగా గుర్తిస్తారన్నది ప్రభుత్వ ఉద్దేశం.. వీరితో పాటు ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేశారు. తహసీల్దార్‌ పరిశీలన అనంతరం ఎమ్మెల్యే ఆమోదముద్ర తదుపరి ఆర్డీవో కార్యాలయంలో జరిగే ప్రక్రియ లాంఛనమే. కానీ తహసీల్దార్‌ స్థాయిలోనే పేరుకుపోతున్నాయి. జిల్లాలో వేల మంది లబ్ధిదారులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలతో సాంత్వన కలుగుతుందనుకుంటే ఎదరుచూపులే మిగులుతున్నాయి. పథక ఆరంభంలో రూ.51116 చెక్కు ఇవ్వగా క్రమేణా రూ.75,116కు పెంచారు. ఇటీవల కాలంలో రూ.100116కు పెంచగా పేదింట కొండంత అండగా ఉంటుందనుకుంటే యంత్రాంగ నిర్లక్ష్యం ఆశలపై నీళ్లు చల్లుతోంది. భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం క్రమంలో ప్రభుత్వం మినహాయిపు నివ్వడంతో దాన్ని బూచీగా చూపి లబ్ధిదారులకు చుక్కలు చూపుతున్నారు. ఎల్‌ఆర్‌యుపీకి ముందు వచ్చిన దరఖాస్తులు కూడా ఉండటం విశేషం.. పలు దరఖాస్తులకు ఆమోదముద్ర పడినప్పటికీ లబ్ధిదారుల ఖాతాలో జమకావడం లేదు. మరికొన్ని ఇంకా తహసీల్దార్ల పరిశీలనలో మూలుగుతున్నాయి. తొలుత ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో పేద ఆడపిల్లల వివాహానికి ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, మైనార్టీ కుటుంబాలకు షాదీముబారక్‌ పేరిట ప్రత్యేక పథకాలు ప్రారంభించింది. 2016 ఏప్రిల్‌ నుంచి బీసీ, ఈబీసీలకు వర్తింపజేసిన విషయం తెలిసిందే. కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5లక్షలు ఉన్నవారు అర్హులు. అయితే గతంలో వివాహమయ్యాక డబ్బులిచ్చేవారు. కొంతకాలం కిందట నెల రోజులు ముందు దరఖాస్తు చేసినా వివాహం వరకు అందించేలా నిబంధనలు సవరించారు. అయినా సకాలంలో అందడం లేదు. జిల్లాలో కరీంనగర్‌, హుజూరాబాద్‌ రెవెన్యూ డివిజన్లుండగా 2451 దరఖాస్తులు రాగా 1361 పెండింగ్‌లో ఉండటం పనితీరుకు తార్కాణం. వివాహానికి ముందే డబ్బులు అందిస్తేనే పేద కుటుంబానికి భరోసా కలుగుతుంది. అయితే ఎవరైనా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద దరఖాస్తు చేసుకోవాలంటే తొలుత మీసేవ కేంద్రం ద్వారా అన్ని ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలి. కుల ధ్రువీకరణ, ఆదాయ, నివాస, కులపెద్ద, గ్రామ కార్యదర్శి గానీ పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరణ, బ్యాంకు ఖాతా పత్రాలతో సహా పెళ్లి రిజిస్ట్రేషన్‌ (బీసీలకు మాత్రమే) పత్రాలను జత చేయాలి. దరఖాస్తు చేసుకున్న నిజ ధ్రువీకరణ జిరాక్స్‌ ప్రతులతోపాటు వధూవరుల పెళ్లి చిత్రాన్ని నేరుగా తహసీల్దార్‌ కార్యాలయంలో అందజేయాలి. తహసీల్దార్‌ వాటి పరిశీలన జరిపి ఆయా నియోజకవర్గ శాసనసభ్యుల అమోదానికి జాబితాను పంపిస్తారు. ఎమ్మెల్యే ఆమోదం తర్వాత ఆ జాబితాను ఆన్‌లైన్‌లో ఆర్డీవో ఆమోదంతో లబ్ధిదారు ఖాతాలో జమ చేస్తారు. చెక్కును ఎమ్మెల్యేల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తారు. ఇంత సులువుగా ప్రక్రియ జరగాల్సి ఉండగా ఆడపడచులకు పెళ్లిరోజున ఇచ్చిన చెక్కుల దాఖలాలు వేళ్లపై లెక్కించొచ్చు. దరఖాస్తు చేయడం.. నెలల తరబడి పడిగాపులు కాయడం పరిపాటేనా.. ఇకనైనా ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా..?

Related Posts