వనపర్తి
ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలోని బస్టాం డ్ వద్ద గురువారం సాయంత్రం వన పర్తికి వెళ్లే బస్సు ప్రయాణంలో మహిళలు గొడవ పడ్డారు. చీపుర్లు, కట్టెలతో కొట్టుకునే వరకు వచ్చింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో బస్సుల్లో మహిళల రద్దీ పెరిగింది. బస్సు ల్లో సీట్ల కోసం దొంతికుంట తండా మహిళలు తొందరపడి ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ గంప ఎత్తుకొని దిగుతూ ఒకరినొకరు తోసుకోవడంతో గొడవ జరిగింది. మండల కేంద్రానికి చెందిన మహిళ గిరిజన మహిళపై కట్టెతో దాడి చేసింది. అక్కడే ఉన్న కొంత మంది మహిళలు చీపుర్లతో ఎదురుదాడికి దిగారు...సిగలు పట్టుకొని కొట్టుకున్నారు...దీంతో గొడవ మరింత పెద్దది కావడంతో అక్కడే ఉన్న ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఉచిత ప్రయాణ పథకంతో బస్సుల్లో మహిళల రద్దీ ఎక్కువయ్యిందని, అందుకు తగినట్లు బస్సుల సంఖ్యను పెంచలేదని, అందువల్లే తరచూ గొడవలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. సీట్లు సరిపోకపోవడంతో మహిళలతో పాటు, పురుషులు కూడా ఇబ్బంది పడ్తున్నారని చర్చించుకున్నారు. మహిళలు గొడవకు సంబంధించిన వీడియోలు వాట్సాప్ గ్రూపులో వైరల్ కావడం మండలంలో చర్చనీయాంశంగా మారింది... చివరకు స్థానికులు వారిని శాంతింపచేశారు.