YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోట్లలో కోళ్ల పందేలు

కోట్లలో కోళ్ల పందేలు

ఏలూరు, జనవరి 11, 
సంక్రాంతి వచ్చిదంటే చాలు.. ఆంధ్రాలో కోడి పందాల హడావుడి మొదలైపోతుంది. ముఖ్యంగా.. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో ఈ హంగామా పీక్స్‌లో ఉంటుంది. బరిలోని పందెం కోళ్లది గెలుపు కోసం పోరాటమైతే.. పందెం రాయుళ్లది పరువు కోసం ఆరాటం. వేలాది మంది కవ్వింపులు, కేరింతల మధ్య భీకర యుద్ధమే జరుగుతుంది. ఇదంతా.. పరువు ప్రతిష్టలకు, పౌరుష రోషాలకు సంబంధించిన రణం. అంత హీట్ ఉంటుంది కాబట్టే.. ఈ పందెం పుంజుల పందాల ముందు.. గుర్రపు పందాలు కూడా బలాదూర్ అంటారు.అయితే.. కోడి పందాలంటే.. బరిలో రెండు పుంజులు పోట్లాడటం కాదు. వేల కోట్లు చేతులు మారడం కూడా! ఎస్.. కొబ్బరి తోటల్లో జరిగే ఈ కోళ్ల యుద్ధాన్ని చూసి.. జబ్బలు, తొడలు చరుచుకునే పందెంరాయుళ్లు ఎందరో ఉన్నారు. గల్లా పెట్టెల్లోని.. నోట్ల కట్టలు.. కట్టలు తెంచుకొని బరుల్లోకి వచ్చేస్తాయి. కత్తి కట్టిన కోడి.. అవతలి పుంజును పడగొట్టిన ప్రతిసారీ.. పందెంరాయుళ్ల చేతులు మీసాల్ని మెలేస్తాయి. ప్రతి పందెం రౌండ్‌కి.. నోట్లు వర్షంలా కురుస్తాయి.సంక్రాంతి కోడి పందాలంటే.. పుంజుల పౌరుషాలే కాదు.. చేతులు మారే కోట్ల కట్టలు కూడా! ఓ పందెం దెబ్బకు ఒకరు గరీబుగా మారిపోతే.. మరో పందెంలో.. గరీబే గద్దెనెక్కుతాడు. బరిలో దిగాక కోడి తేడా కొడితే.. జీవితాలే తారుమారైపోతాయి. దెబ్బకు అదృష్ట రేఖ.. దురదృష్టరేఖగా మారిపోతుంది. ఇవన్నీ తెలిసే.. పందెంరాయుళ్లు తొడగట్టి మరీ కొబ్బరితోటళ్లోకి వెళ్తారు. తమ పుంజుని బరిలోకి దించుతారు. కొందరైతే.. ఆస్తుల్ని అమ్ముకొని మరీ పందాలు కాస్తారు. మెడలో పులి గోరు చైన్లు, వేళ్ల నిండా ఉంగరాలు, చేతులకు బ్రాస్‌లెట్లతో వచ్చినోళ్లు కూడా.. చివరికి ఒట్టి చేతులతో వెనుదిరుగుతారు. అయినాసరే.. సంక్రాంతి కోడి పందాలకు ఉండే క్రేజే వేరు. ఆంధ్రాలో అదో సంప్రదాయం. అంతకుమించిన సంబరం. అందుకే.. సంక్రాంతి సమయానికి.. అంతా ఊళ్లలో వాలిపోతారు. పందెం బరుల్లో దిగిపోతారు.ఆంధ్రాలో సంక్రాంతి కోడి పందాల్లో పాల్గొనడం.. అంత చిన్న విషయం ఏమీ కాదు. జేబులో వందో వెయ్యో పెట్టుకొని వెళితే.. అక్కడ పందెం కోడి కాదు కదా.. పందాలు చూస్తూ తినేందుకు చికెన్ పకోడీ కూడా రాదు. పందెంలో పుంజుని దించాలంటే.. ఏకంగా డబ్బు సంచులే తీసుకెళ్లాలి. బరుల్ని ఏర్పాటు చేసే చోటుని బట్టి.. పందెం బీటు మారుతుంటుంది. ఒక్కో కోడి పందెం 5 వేల నుంచి మొదలై.. 5 లక్షలు, 10 లక్షల దాకా ఉంటుంది. కేవలం.. ఆంధ్రా వాళ్లే కాదు.. హైదరాబాద్‌, చెన్నై నుంచి కూడా పందెం రాయుళ్లు డబ్బు సంచులతో వచ్చి మరీ బరుల్లో తొడగొడతారు. వాళ్లకు తగ్గట్లుగా.. అదృష్టం కలిసొచ్చి.. వాళ్ల పుంజు కూడా బరిలో తొడగొడితే.. మరో 2, 3 డబ్బు సంచులతో ఊరెళ్తారు. లేకపోతే.. తెచ్చింది కూడా పోగొట్టుకొని.. వట్టి చేతులతో వెనుదిరుగుతారు.కొన్నాళ్ల క్రితం వరకు.. ఏపీలో కోడి పందాలంటే.. వేలు, లక్షల్లోనే జరిగేవి. కానీ.. ఇప్పుడు లక్షల్లో పందెం కాయడం కామనైపోయింది. కొన్ని చోట్ల.. అరుదైన పుంజులపై కోటి రూపాయల పందెం కూడా నడుస్తోంది. ఈ స్థాయిలో పందాలు నిర్వహిస్తున్నారు కాబట్టే.. వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయ్. ఇదంతా.. జస్ట్ వారం గ్యాప్‌లోనే. సాధారణంగానే.. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందాలపై దాదాపు 3 వేల కోట్లకు పైనే చేతులు మారతాయనే లెక్కలున్నాయ్. ఈసారి.. ఆ బెట్టింగ్‌లు 6 వేల కోట్ల దాకా వెళ్లొచ్చనే అంచనాలున్నాయి.కొన్ని క్షణాల్లోనే తేలిపోయే కోడి పందాల కోసం.. కోట్లు తగలేయడమేంటి? వేల కోట్ల పందాలు కాయడమేంటనే వాదనలు వినిపిస్తుండొచ్చు. కానీ.. అక్కడ సీన్ మరోలా ఉంటుంది. కోడి పందాల్లో పాల్గొనడం దగ్గర్నుంచి.. పందెంలో పుంజుని గెలిపించుకోవడం దాకా.. ప్రతి సీన్ ప్రతిష్ఠాత్మకమే. అందుకే.. లక్షలు, కోట్లలోకి వెళ్లిపోతాయ్ పందాలు. చివరికి.. విదేశాల్లో సెటిలైనోళ్లు కూడా సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చి పందాలు కాస్తుంటారంటే.. పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కేవలం కొన్ని నిమిషాల్లోనే.. లక్షలు ఆవిరైపోతున్నా అస్సలు తగ్గరు. బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయ్యే దాకా.. బరి నుంచి కదలరు.ఇప్పటికే.. ఏపీలో కోళ్ల పందాల కోసం భారీ స్థాయిలో బరులు సిద్ధమైపోయాయి. పందెం కోళ్లు కూడా సంక్రాంతి సమరానికి సై అంటే సై అంటున్నాయి. వేల కోట్ల రూపాయలు.. చేతులు మారేందుకు రెడీగా ఉన్నాయి. ఈసారి ఒక్కో జిల్లాలో కనీసం 600 కోట్లకు పైనే పందాలు జరుగుతాయనే అంచనాలున్నాయి. ఇంతకుముందుతో పోలిస్తే.. ఈసారి కోడి పందాలు జోరుగా సాగే అవకాశం ఉందంటున్నారు.సంక్రాంతికి వారం ముందు నుంచే.. కోడి పందాల హడావుడి మొదలైపోతుంది. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో కోడి పందాల హీట్‌ పీక్‌కు చేరుతుంది. వందల కోట్ల రూపాయలు చేతులు మారేది కూడా ఈ 3 రోజుల్లోనే. పండగ రోజుల్లో.. ఒక్కో బరి దగ్గర ఏర్పాట్లకే దాదాపుగా 30 లక్షల దాకా ఖర్చవుతుంది. అంటే.. అక్కడ ఏ స్థాయిలో పందాలు నిర్వహిస్తారో లెక్కేసుకోవచ్చు. ఈ ఖర్చుని కూడా పందెం రాయుళ్ల నుంచే వసూలు చేస్తారు నిర్వాహకులు. ఒక్కో పందెం నుంచి పది పర్సెంట్ కమీషన్ తీసుకుంటారు.అంటే.. 10 లక్షల పందెం కాస్తే.. లక్ష రూపాయలు బరి నిర్వాహకులకు ఇచ్చేయాల్సిందే. కేవలం.. కోడి పందాలు మాత్రమే కాదు.. ఈ బరుల చుట్టూ గుండాట, పేకాట, మట్కా లాంటి జూదాలు కూడా నడుస్తుంటాయి. అక్కడే.. పందెం రాయుళ్లకు కావాల్సిన ఫుడ్, ఆల్కహాల్‌తో పాటు కావాల్సినవన్నీ దొరికేస్తాయి. ఇవన్నీ నిర్వహించుకునేందుకు.. మొత్తంగా 20 లక్షల నుంచి కోటి దాకా వసూలు చేస్తారనే టాక్ ఉంది. ఇక్కడ.. బరి నిర్వాహకుల్ని కాదని.. ఎవరూ ఏమీ చేయలేరు. అందుకే.. వేరే ఆప్షన్ లేకుండా వారు అడిగినంత ఇచ్చేస్తారు.పందెంరాయుళ్లలో వీఐపీలు, సెలబ్రిటీలు కూడా ఉంటారు. కోడి పందాలు జోరుగా నడిచే జిల్లాల్లో వాళ్లు మకాం వేస్తారు. వీరి కోసం.. ప్రత్యేకంగా పెద్ద బరులు నిర్వహిస్తారు. అక్కడ ఫుడ్, అకామిడేషన్‌ అంతా వేరే లెవెల్లో ఉంటుంది. అందులోకి.. ఎవరిని పడితే వాళ్లకు ఎంట్రీ ఉండదు. కేవలం వీఐపీలు, వీవీఐపీలకు మాత్రమే అక్కడకు వెళ్లేందుకు.. కోడి పందాలు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ కోళ్ల పందాల క్రేజ్.. తెలంగాణకు కూడా పాకింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి.. బరుల్లోకి దిగుతున్నారు. కొందరు.. హైదరాబాద్ చుట్టుపక్కల పందెం కోళ్లని పెంచి.. వాటిని కోనసీమకు తీసుకెళ్లి.. పందాలు వేస్తున్నారు. అక్కడ స్థానికంగా ఉండే వారి పేర్ల మీద.. తమ పుంజుల్ని దించుతున్నారు కొందరు బడా బాబులు.బరిలోకి దిగగానే పందెం రాయుళ్లంతా ఓ ట్రాన్స్‌లోకి వెళ్లిపోతారు. ఆ సమయంలో.. ఆస్తులు పోతున్నా లెక్కలు చేయరు. ఈ పందాలు కూడా వేల నుంచి మొదలై.. లక్షల దాకా వెళ్లిపోతుంది. పందెంలో ఓడితే పోయేది కోడి మాత్రమే కాదు.. పరువు కూడా! అందుకోసమే.. పుంజుని బరిలో దించాక పందెంరాయుళ్లు వెనకా ముందు ఏమీ చూసుకోరు. డబ్బులు తీస్తూనే ఉంటారు. అవసరమైతే ఆస్తి పత్రాలు కూడా పందెంలో పెట్టేస్తారు. అందుకోసమే.. ఇన్ని వేల కోట్లు చేతులు మారతాయి. ఇదంతా.. భారీ మొత్తాల్లో ఉండే వ్యవహారం కావడంతో.. ఆన్ లైన్ పేమెంట్లు కూడా అదే స్థాయిలో జరుగుతాయి. పండగ అయిపోయిన తర్వాత కానీ తెలియదు.. ఎంత వచ్చింది? ఎంత పోయింది? అనేది! సంక్రాంతి అయిపోయిన 3 రోజుల తర్వాత దిగుతుంది కోళ్ల పందాల మత్తు.ఇప్పుడంటే.. డబ్బులు పెట్టి కోళ్లపై పందాలు కాస్తున్నారు గానీ.. వందల ఏళ్ల క్రితం ఇదంతా కేవలం వినోదానికి మాత్రమే అన్నట్లుగా ఉండేది. అయితే.. చరిత్రలో కోళ్ల పందాలనే యుద్ధాలుగా భావించేవారు. పల్నాడు, బొబ్బిలి, విజయనగర రాజుల మధ్య కూడా కోడి పందాలు ప్రతిష్టాత్మకంగా సాగాయి. అప్పట్లో.. పందెం కోడి ఓడితే.. పరువు పోయినట్లు ఫీలయ్యేవాళ్లు. బరిలో పుంజు మెడ తెగి పడితే.. తమ తల కొట్టేసినట్లు భావించేవాళ్లు. అలా.. ఈ కోడి పందాలు.. ఏపీలో సంప్రదాయంగా మారిపోయాయి. అయితే.. వాళ్లు వినోదం కోసం, మనుషులతో చేసే యుద్ధాలను నివారించేందుకు మొదలుపెట్టిన ట్రెండ్.. ఇప్పుడు జూదంగా మారిపోయింది.నిజానికి.. ఏపీలో కోడి పందాల వెనుక పెద్ద ఆర్థిక వ్యవస్థే నడుస్తుంది. కోళ్ల పెంపకం నుంచి మొదలుకొని వాటికి ట్రైనింగ్, ఫుడ్, బరుల ఏర్పాటు.. ఇలా ఈ పందాల చుట్టూ జరిగే వ్యాపారం అంతా కలిపి.. వేల కోట్లు దాటుతోంది. కేవలం.. ఆంధ్రా ప్రజలే కాదు.. ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్లతో పందెం బరులన్నీ సందడి సందడిగా మారతాయి. హోటల్ రూమ్స్ కూడా కొన్ని నెలల ముందు నుంచే బుక్ అయిపోతాయి. కోడి పందాల బరుల చుట్టూ.. జాతర వాతావరణం ఉంటుంది. ఈ ప్రదేశాల్లో పుడ్ బిజినెస్‌కు కూడా ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇలా.. ఆంధ్రాలో ఒక్క సంక్రాంతి సీజన్‌లోనే.. కోళ్ల పందాల రూపంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారిపోతాయి.

Related Posts