కరీంనగర్, జనవరి 11,
ఎక్కడైనా ఈ భూములు మాకొద్దు అంటూ కలెక్టర్ ను కలిసి వాపస్ చేసిన సీన్లు చూశారా…ఇప్పుడు చూపిస్తాం చూడండి..సుంచుల కుమారస్వామి. బీఆర్ఎస్ లోకల్ లీడర్. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి పరిధిలోని సర్వే నంబర్ 464లోని 3 ఎకరాల ప్రభుత్వ భూమి ఈయన సొంతమైంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు సిరిసిల్ల జిల్లాలో ఇలా కబ్జాలు చేసిన వారంతా అరెస్టై జైలుకు వెళ్లారు. దీంతో కేసుల భయం ఎందుకని చెప్పి ఇదిగో ఇలా జిల్లా కలెక్టర్, ఎస్పీని కలిసి ఈ భూమి నాకొద్దు మహా ప్రభో అని సరెండర్ చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా మంది చేసుకున్నట్లే నేను చేసుకున్నా.. ఇప్పుడు వద్దని ఇచ్చేస్తున్నా.. ఇదీ డైలాగ్.ఇదొక్క ఎగ్జాంపులే కాదు.. ఈ నెల 2న తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ మాజీ సర్పంచ్ మిట్టపల్లి పద్మ కూడా 2 ఎకరాల భూమిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు సరెండర్ చేశారు. కేసులు నమోదవుతుండడంతో కబ్జా, అక్రమ పట్టాదారుల్లో భయాలు మొదలయ్యాయి. దీంతో ఎందుకొచ్చిన తంటా అని చెప్పి భూముల్ని వాపస్ చేస్తున్నారు. అదీ మ్యాటర్. ఒకవైపు సిరిసిల్లలో అసైన్డ్ ల్యాండ్స్ ను కబ్జాలు చేసి ధరణి వచ్చాక తమపేర్లపై మార్చుకుని గులాబీ లీడర్లు చేసిన దందాలు బయటికొస్తున్నాయి. చెరువు, అటవీ, అసైన్డ్ ఇలా దేన్నీ వదల్లేదు. ధరణి వచ్చాక ఇంకింత రెచ్చిపోయారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోలను ఆసరాగా చేసుకుని చక్రం తిప్పుకున్నారు. ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నారు. నాడు కేటీఆర్ మంత్రిగా ఉండడంతో అధికారులు కూడా చూస్తూ ఉండిపోయారు. ఏమీ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. కథ మారింది. అందుకే అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. సిరిసిల్ల లాండ్ ఫైల్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.ఇక్కడ అన్నిటికంటే హైలెట్ ఏంటంటే.. కొట్టేసిన భూముల్ని వరుసగా ప్రభుత్వానికి సరెండర్ చేసేందుకు ముందుకొస్తున్నారు. అంటే అక్కడ ఏం జరిగిందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. సిరిసిల్ల జిల్లాలో అసైన్డ్, ప్రభుత్వ భూములను అక్రమంగా పట్టా చేసుకున్న బీఆర్ఎస్ లీడర్ల అరెస్ట్ లు కంటిన్యూ అవుతున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ లీడర్ బొల్లి రామ్మోహన్, అగ్గి రాములు, జిందం దేవదాస్, సురభి నవీన్ రావుపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు ఈనెల 7న తంగళ్లపల్లి మండలం నేరేళ్ల బీఆర్ఎస్ నేత పూడూరి భాస్కర్ ను రిమాండ్ కు తరలించారు. భాస్కర్ మండేపల్లిలో 20 గుంటల అసైన్డ్ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని రెనెన్యూ అధికారులు తేల్చడంతో కటకటాలు లెక్కిస్తున్న పరిస్థితి. అంతే కాదు తంగళ్లపల్లి మండలానికి చెందిన మరో నలుగురు లీడర్లు పరారీలో ఉన్నారని కూడా చెబుతున్నారు.తంగళ్ళపల్లి మండలం తాడూరులోని సర్వే నంబర్ 1148లో సురభి నవీన్ రావు 3 ఎకరాలు, సురభి దేవేందర్ రావు పేరిట 3 ఎకరాలు మొత్తం 11 ఎకరాలు కబ్జా అయ్యాయని నిర్ధారించారు. కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. 11 ఎకరాలను తిరిగి ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో మార్చారు కలెక్టర్. ఇక బొల్లి రామ్మోహన్ ఈయన సిరిసిల్ల జిల్లాలో సీనియర్ బీఆర్ఎస్ లీడర్. సర్దాపూర్, బద్నేపల్లిలో ఏడు ఎకరాలను మాయ చేసి పట్టా పొందారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.ధరణి వచ్చే టైంలో నాటి బీఆర్ఎస్ సర్కార్ ఓ ఉత్తర్వు ఇచ్చింది. దాని ప్రకారం 2017 డిసెంబర్ 31 కంటే ముందు ఎవరైనా భూమిలేని పేదవారు అసైన్డ్ భూమి కొనుగోలు చేస్తే, వారిని ఆ భూమి నుంచి తొలగించకుండా వారికే అసైన్మెంట్ పట్టా జారీ చేయొచ్చని భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అదే మంచి సమయం అనుకున్న చాలా మంది బీఆర్ఎస్ లీడర్లు.. అసైన్డ్ భూములను చాలా తక్కువ ధరకు పేదల నుంచి రాయించుకుని.. పాస్ బుక్స్ పొందారు. ఇదే జీవోను అడ్డం పెట్టుకుని సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి తమ్ముడు జిందం దేవదాసు లాండ్ పొందారు.తంగళ్లపల్లి మండలం సారంపెల్లి శివారులోని 164/3లో 3 ఎకరాలు కొన్నాడు. ప్రభుత్వ రూల్స్ ప్రకారం.. అసైన్డ్ ల్యాండ్ కొనాలంటే ఆ వ్యక్తి స్థానికుడై ఉండాలి. భూమి లేని పేద రైతు అయి ఉండాలి. అదే భూమిపై ఆధారపడితేనే రీఅసైన్ చేయాలి. కానీ జిందం దేవదాసు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్న బడా కాంట్రాక్టర్. అప్పట్లోనే అతడికి నోటీసులు ఇచ్చి కేసు నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ అప్పటి తహసీల్దార్ పట్టించుకోకుండా పాస్‌బుక్ జారీ చేశారు. ఎందుకంటే నాటి ప్రభుత్వంలో బలమైన లీడర్లుగా చెలామణి అవడమే. అంతే కాదు నాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లకు వచ్చినప్పుడల్లా వెంట ఉండే వారు కావడంతో అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు.ప్రభుత్వ భూములను పట్టా చేయించుకున్నవారిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాన అనుచరుడు, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేరు కూడా ఉంది. ఆయన భార్య పేరిట ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురంలోని 119/4 సర్వే నంబర్ లో 3.20 ఎకరాల భూమికి లావుణీ పట్టా జారీ అయింది. వెంకటాపురంలో సర్కార్ భూమిని అసైన్డ్ చేయడానికి అర్హులైన పేదలు, కూలీలు ఎంతో మంది ఉన్నా.. ఎల్లారెడ్డిపేటలో ఉండే బీఆర్ఎస్ లీడర్, ఆర్థికంగా బలంగా ఉన్న ఆగయ్య కుటుంబానికి లావుణీ పట్టా మంజూరు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో గత నెలలో ఈ భూమిని ప్రభుత్వ భూమిగా ధరణి రికార్డుల్లో మార్చేశారు. అదీ మ్యాటర్. సో ఇవన్నీ దొరికినవే. ఇంకా దొరకనివి, దొరకాల్సినవి ఎన్నో ఉన్నాయి.సిరిసిల్ల జిల్లాలో జరిగిన భూ భాగోతాలపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎంక్వైరీ చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదే జిల్లాలో దాదాపు 300 నుంచి 500 ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా పట్టాలు చేయించుకున్నారంటున్నారు. ఇంకా తవ్వి తీస్తే మొత్తం 2 వేల ఎకరాల దాకా బయటపడుతుందంటున్నారు. ఇప్పటికే సిరిసిల్ల జిల్లా పెద్దూర్, సర్ధాపూర్, తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లె, అంకుషాపూర్, తాడూర్, లక్ష్మీపూర్, పాపయ్యపల్లె, ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామాల్లో భూముల హాంఫట్ కథలు బయటికొచ్చాయి.ఇదే మ్యాటర్ పై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. సిరిసిల్ల జిల్లాలో పేదల పేరుతో బీఆర్ఎస్ లీడర్లు 2 వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేశారన్నారు. ఈ భూములను ఉద్దేశపూర్వకంగానే వందల మంది పేర్లపై అసైన్డ్ భూమిగా నమోదు చేశారని చెప్పారు. సీసీఎల్‌ఏ ఆఫీస్ నుంచి ప్రత్యేక టీములను సిరిసిల్ల లాండ్ స్కామ్స్ పై ఎంక్వైరీకి పంపిస్తున్నారు.సిద్దిపేటలో దళితులు, పేదలు ఉన్న 484 ఎకరాల ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిషేధిత జాబితాలో చేర్చిందన్నారు మంత్రి పొంగులేటి. 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో జరిగిన భూ అక్రమాలు, లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి సర్కారు భూములు స్వాధీనం చేసుకుంటామని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇందుకోసం మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన సంస్థల్ని ఎంపిక చేయబోతున్నారు.గత ప్రభుత్వ హయాంలో పలు భూములకు సంబంధించి కోర్టుల నుంచి ఆదేశాలు లేకున్నా ఉన్నట్లు సృష్టించి భూములు స్వాధీనం చేసుకున్న వాటిపైనా నజర్ పెడుతున్నారు. మాజీ సైనికుల పేరుతోనూ నకిలీ ఎన్‌ఓసీలతో స్థలాలు మాయం చేశారన్నారు. సో ఈ భూమి మాకొద్దు అని వాపస్ ఇస్తున్నారంటే గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో అంతా అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారుసిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ మంత్రిగా ఉన్న టైంలోనే వేల ఎకరాల్లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను ఈనెల 4న పరిశీలించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల ప్రభుత్వంలో రెవెన్యూ వ్యవస్థను నాశనం చేశారన్నారు. ధరణి పోర్టల్ తీసుకొచ్చి అనుచరులకు వేల ఎకరాల అసైన్డ్ భూములను పట్టాలు చేశారని ఆరోపించారు. కేటీఆర్ హయాంలో పదేళ్లలో ప్రభుత్వ భూములకు పట్టాలు ఇచ్చారని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు సిట్ ఏర్పాటు చేయాలన్నారు.