YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆగని ప్రైవేట్ బస్సుల దందా

ఆగని ప్రైవేట్ బస్సుల దందా

హైదరాబాద్, జనవరి 11, 
సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా.. అయితే మీ జేబు నిండుగా ఉండేలా చూసుకోండి. లేదంటే అంతే.. అవును మరి ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉంది. పల్లెబాట పడుతోన్న జనాలను ప్రైవేట్ ట్రావెల్స్ దండుకుంటున్నాయి. సంక్రాంతి పండక్కి సాధారణంగానే ఫుల్ రష్ ఉంటుంది. ఇదే అదనుగా చేసుకున్న ప్రైవేటు ఆపరేటర్లు టిక్కెట్ ధరలను అమాంతం పెంచేశాయి. ఇది చూసిన ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఇలా ఇష్టారీతిన టిక్కెట్ ఛార్జీలు పెంచుతున్నా రవాణా శాఖ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.ఆర్టీసీ బస్సుల కంటే దాదాపు మూడింతలు ఎక్కువగా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు టిక్కెట్ ధరలను వసూలు చేస్తున్నాయి. గతంలో రూ.1000, 12వందలు ఉన్న టిక్కెట్ ధర ఇప్పుడు రూ.3వేలకు పైమాటే. రాజమండ్రికి వెళ్లే ప్రయాణికులకు రూ.3,500 - 4వేలు, భీమవరం వెళ్లే వారికి రూ.3 -4వేలు వసూలు చేస్తున్నారు. ఇక కుటుంబం మొత్తం వెళ్లాలంటే కేవలం టిక్కెట్ ల కోసమే దాదాపు రూ.20వేల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లేందుకు నానా కష్టాలు పడుతున్నారు. టిక్కెట్ ధరను పదులు, వందలు కాకుండా ఒక్కసారిగా వేలల్లో పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రకటించారు. రద్దీ పెరిగినట్టు అయితే ఇంకా బస్సుల సంఖ్య పెంచుతామని, మరిన్ని బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ సమయంలోనే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అధిక ఛార్జీలు వసూలు చేస్తే ప్రయాణికులు.. అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. తమ ప్రభుత్వం ప్రయాణికుల భద్రత, సంక్షేమనికే ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పారు.మరో పక్క రెండు తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. తెలంగాణలో 6432 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు టీజీఆర్టీసీ ఇప్పటికే ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్ లో 7,200 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. అందుకు సంబంధించిన అనేక ఏర్పాట్లను కూడా ఈ రాష్ట్రాలు పూర్తి చేశాయి.మరోపక్క సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడుస్తోన్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో అదనపు కోచ్ లను జోడించింది. ఇప్పటివరకు 16 కోచ్ లు రాకపోకలు సాగిస్తుండగా.. ఇప్పుడు అదనంగా మరో 4 కోచ్ లను అందుబాటులోకి తెచ్చినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దీని వల్ల 1,128గా ఉన్న సీటింగ్ కెపాసిటీ 1,414కు పెరగడంతో ప్రయాణికులకు సౌకర్యంగా ఉండనుంది.
ఆర్టీసీ బస్సుల్లో నిలువు దోపిడీ
 సంక్రాంతి స్పెషల్ బస్సుల పేరుతో.. అడ్డగోలుగా టికెట్ రేట్లను పెంచేసి.. ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.ఈ మేరకు సోషల్ మీడియాల్లో బస్సు టికెట్లను ప్రయాణికులు షేర్ చేస్తే.. సంక్రాంతి పండగ పూట ఆర్టీసీ బాదుడు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో.. సంక్రాంతికి స్పెషల్ బస్సుల పేరుతో ఆర్టీసీ దోపిడీ చేస్తోందంటూ వనపర్తికి చెందిన ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితమే కానీ.. పురుషుల దగ్గర మాత్రం కండక్టర్లు ఎక్స్‌ట్రా ఛార్జీలు వసూలు చేస్తూ జేబులు గుల్ల చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. వనపర్తి నుంచి మహబూబ్ నగర్‌కు సాధారణంగా ఛార్జీ రూ.100 ఉంటే.. ఇప్పుడు రూ.140 వసూలు చేస్తున్నారని.. అందుకు సాక్ష్యంగా తన టికెట్‌ను ఫొటో తీసి మరీ పోస్ట్ చేశాడు. మహిళల ఛార్జీలు కూడా పురుషుల దగ్గర వసూలు చేస్తున్నారంటూ మండిపడుతూ ట్వీట్ చేశాడు.మరోవైపు.. ఈ దారిదోపిడి సాధారణ ప్రయాణికుల దగ్గరే కాదు.. దివ్యాంగుల దగ్గర కూడా చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజా పాలనలో పండుగ పేరుతో ఆర్టీసీ టికెట్ రేట్లు అంతకంత పెంచి దోపిడీ చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. సాధారణ రోజుల్లో వికలాంగులకు హాఫ్ టికెట్ ఉంటే.. పండుగ పేరుతో వారికి కూడా ఫుల్ టికెట్ తీసుకుంటూ దోపిడీ చేస్తున్నారంటూ తెలంగాణ ఆర్టీసీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కడ్తల్‌కు సాధారణ రోజుల్లో రూ.70 ఉంటే పండుగ స్పెషల్ బస్సులు అని రూ.120.. అదే కల్వకుర్తికి సాధారణ రోజుల్లో రూ.140 ఉంటే పండుగ స్పెషల్ బస్సులు అని రూ.220 వసూలు చేస్తున్నారంటూ.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా గోడు వెల్లబోసుకుంటున్నారు. కొన్ని బస్సుల్లో అయితే.. దాదాపు 50 నుంచి 80 శాతం మేర అధికంగా వసూలు చేస్తుండటం గమనార్హం. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే.. గతంలోనూ పలు పండగల విషయంలో ఇలాగే ఆర్టీసీలో అడ్డగోలుగా ఛార్జీలు పెంచేస్తున్నారంటూ ప్రయాణికులు గగ్గోలు పెడితే.. తమకు చట్టప్రకారం పెంచే హక్కు ఉందంటూ ఉన్నతాధికారులు ప్రజలకు ఏమాత్రం అర్థకాని లాజిక్‌లు చెప్తూ తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. కాగా.. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేస్తారనటంలో ఏలాంటి అనుమానమూ లేదు.

Related Posts