తిరుపతి, జనవరి 15,
సంక్రాంతి సంబరాల్లో ఏపీ ప్రజలు ఉండగా, కూటమిలో కొత్త నినాదం వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న నినాదం ఊపందుకుంది. ఈ డిమాండ్ చేసింది కూడా ఎవరో కాదు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో గల మహాసేన రాజేష్. ఇది తానొక్కడి నిర్ణయం కాదని, టీడీపీ క్యాడర్ అంతా కోరుకుంటున్నట్లు మహాసేన రాజేష్ చెప్పడం విశేషం.తెలుగుదేశం పార్టీలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో కొనసాగుతున్నారు మహాసేన రాజేష్. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన మహాసేన రాజేష్, పలుమార్లు వివాదాస్పద కామెంట్లు చేసి సైతం వార్తల్లో నిలిచారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నేరుగా మాజీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. అటువంటి మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం కీలక పదవిలో ఉన్నారని చెప్పవచ్చు. తాజాగా మహాసేన రాజేష్ చేసిన కామెంట్స్ ఏపీలో హాట్ టాపిక్ గా నిలిచాయి. అది కూడా తాను చెప్పిన విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు పునరాలోచించాలని కూడా కోరారుమహాసేన రాజేష్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు యువగళం పాదయాత్ర నిర్వహించిన మంత్రి నారా లోకేష్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఉన్నత చదువులు చదివిన రాజకీయ నాయకుడిగా పేరుగాంచిన నారా లోకేష్ కు ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత లేదని మహాసేన రాజేష్ అభిప్రాయపడ్డారు. ఏపీ కేబినెట్ లో చోటు ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎం అయ్యే అన్ని అర్హతలు నారా లోకేష్ కు ఉన్నాయన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న నారా లోకేష్ పార్టీ కోసం ఎనలేని కృషి చేశారని, అందుకే 134 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయంటూ రాజేష్ పేర్కొన్నారు.ఏదైనా సమావేశాలు జరిగిన సమయంలో నారా లోకేష్ ప్రాధాన్యత లేకుండా సభావేదికపై దూరంగా కూర్చోవడం తమను ఎంతో బాధిస్తుందని, డిప్యూటీ సీఎం హోదా ఇచ్చిన ఎడల తమ కోరిక నెరవేరినట్లుగా భావిస్తామంటూ కుండబద్దలు కొట్టారు మహాసేన రాజేష్. ఎవరో ఏదో అనుకుంటారని, ఏవో రాజకీయ సమీకరణాలు అంటూ నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వకపోవడం తగదని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు గుర్తించాలని రాజేష్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా గల టీడీపీ క్యాడర్ మొత్తం లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఆకాంక్షతో ఉన్నట్లు, తమ కోరిక నెరవేర్చాలని రాజేష్ డిమాండ్ చేశారు. ఇక ఈ డిమాండ్ కు కూటమి ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.