విజయవాడ, జనవరి 15,
తిరుపతిలో వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం వచ్చి తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. అయితే ఘటన జరిగిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్ తో పాటు పలువురు రాజకీయ నేతలు, మంత్రులు ఘటనా స్దలికి వెళ్లి పరిశీలించడంతో పాటు ఆస్పత్రులకు వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేర్వేరుగా తిరుపతిలో పర్యటించడం చర్చనీయాంశమైంది. ఇక వైసీపీ నేతలు ఈ ఘటనకు సంబంధించి పవన్‌కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.తిరుమల చరిత్రలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. రద్దీ సమయాల్లో తొక్కిసలాటలు జరగడం సాధారణమే అయినప్పటికీ.. తొలిసారిగా, ఆ దశ దాటి భక్తుల మరణాలూ సంభవించాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్న నేపధ్యంలో.. తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్లే మృత్యు వేదికలయ్యాయి. సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు.. తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో ఏకంగా 90 టోకెన్ జారీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి ఇలా గేట్లు తెరవగానే అలా భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో… పలుచోట్ల తొక్కిసలాట జరిగింది.. బైరాగిపట్టెడ కేంద్రం వద్ద పరిస్థితి మరింత విషమించింది. రద్దీలో ఇరుక్కుపోయిన భక్తులు ఊపిరాడక అల్లాడిపోయారు. మహిళలు మరింత విలవిలలాడారు. ఈ విషాదంలో ఆరుగురు మరణించగా.. వారిలో ఐదుగురు మహిళలే. తొక్కిసలాటలో పెద్దసంఖ్యలో భక్తులు గాయపడ్డారు. వారికి తిరుపతిలోని స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాటల్లో గాయపడటం వంటి ఘటనలు జరిగినప్పటికీ.. మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి అంటున్నారుఈ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. డీఎస్పీ రమణ కుమార్ బాధ్యత లేకుండా పని చేశారని .. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, సీఎస్ వో శ్రీధర్ ను తక్షణమే బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగేఘటనపై న్యాయ విచారణ జరిపిస్తాం.టీటీడీ ద్వారా మరణించిన కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మరణించిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగమిస్తామని.. తీవ్ర గాయాలైన తిమ్మక్క, ఈశ్వరమ్మలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బాధలో ఉన్నప్పటికి స్వామి వారి దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులు 35 మందికి శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నష్ట పరిహారం, బాధ్యులపై చర్యలతో పాటు .. ప్రభుత్వం మీద పడిన నిందను తుడిచే ప్రయత్నం చేసినట్లు కనిపించారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రభుత్వం ఈ ఘటనపై ఎంత ఆవేదన చెందుతుందో అన్నట్లు భావోద్వేగంతో మాట్లాడారు. జరిగిన విషాదంపై వేదనతో పాటు.. అధికారుల నిర్లక్ష్యం.. అలక్ష్యంతో పాటు.. ప్రణాళిక లోపాల్ని ఎత్తి చూపారుఅదే సమయంలో డిప్యూటీ సీఎం రాష్ట్ర ప్రభుత్వం తరఫున భక్తులందరికీ క్షమాపణలు చెప్పారు. తప్పు జరిగింది.. బాధ్యత తీసుకుంటామన్నారు. క్షతగాత్రులు, రాష్ట్ర ప్రజలు, వేంకటేశ్వరస్వామి భక్తులు, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరినీ క్షమించమని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోందన్నారుఈ ఘటన జరగకుండా ఉండాల్సిందని, . పోలీసులు ఉండి కూడా ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వీఐపీలపై కాదు.. సామాన్యులపైనా తితిదే దృష్టిపెట్టాలి. మృతుల కుటుంబాల వద్దకు టీటీడీ సభ్యులు వెళ్లి క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. తొక్కిసలాట ఘటనకు టీటీడీ ఈవో, ఏఈవో బాధ్యత తీసుకోవాలన్నారు.అధికారులు చేసిన తప్పులకు తాము తిట్లు తింటున్నామని.. తొక్కిసలాట జరిగితే సహాయక చర్యలు ఎలా ఉండాలన్న దానిపై ప్రణాళిక లేదని పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వ్యక్తులు చేసిన తప్పులు రాష్ట్ర ప్రభుత్వంపై పడుతున్నాయని. భవిష్యత్తులో దుర్ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని.. పోలీసుల్లో కొందరు కావాలని చేశారా? అనే అనుమానాలు కూడా ఉన్నాయని. ఈ అనుమానాలన్నింటిపై విచారణ జరగాల్సి ఉందన్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం 8-9 గంటలు ఎదురు చూసే పరిస్థితి మారాలని సాధ్యమైతే ఒకట్రెండు గంటల్లో దర్శనం జరిగేలా చూడాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారుసనాతన ధర్మాన్ని పాటిస్తూ.. దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందించిన తీరు .. ఆ ధర్మానికి ఆయనెంత విలువిస్తారో మరో సారి స్పష్టం చేసింది. సీఎం, డిప్యూటీ సీఎంలు ఘటనకు సంబంధించి వెంటనే స్పందించినా విపక్షాలు మాత్రం విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నాయి. హుటాహుటిన కొండ మీదకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ దీనికి చంద్రబాబే కారణమని విమర్శించారు.వాస్తవానికి తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్లు ఇవ్వటం గతంలో లేని సంప్రదాయం. వైకుంఠ ద్వార దర్శనాన్ని పది రోజులకు పెంచారు. ఎందుకు పెంచారో తెలియదని, మొదట్నించి ఉన్న సంప్రదాయాన్ని మార్చటం మంచిది కాదని.. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పద్ధతులు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వారి పాలక మండళ్లు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పుడు ఇప్పుడు తన మందీమార్భలంతో కొండ మీదకొచ్చిన జగన్ యథావిధిగా తనదైన శైలిలో స్పందించి వెళ్లి పోయారు. ఇక మిగిలిన వైసీపీ నేతలు చంద్రబాబుతో పాటు పవన్‌కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారిప్పుడు.