YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వేడెక్కిన ఉత్తర తెలంగాణ రాజకీయాలు

వేడెక్కిన ఉత్తర తెలంగాణ రాజకీయాలు

అదిలాబాద్, జనవరి 15, 
ఉత్తర తెలంగాణలో త్వరలో పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఉత్తర తెలంగాణలో విజయంపై బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది.ఉత్తర తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయ హీటెక్కుతుంది. బీజేపీ అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుంది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా అని మల్లగుల్లాలు పడుతుంది. కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఉమ్మడి నాలుగు జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం మార్చితో ముగుస్తుంది.‌ అయితే మార్చిలోగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సవాల్ విసిరింది. బీజేపీ అభ్యర్థుల ప్రకటనతో కమలనాథులతో పాటు కాంగ్రెస్ బీఆర్ఎస్ లో కదలిక మొదలై ఎన్నికల రాజకీయంపై ఆసక్తికరమైన చర్చ సాగుతుంది.ఉత్తర తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల, టీచర్ ల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. గత కొంతకాలంగా సుదీర్ఘ కసరత్తు చేస్తూ వచ్చిన బీజేపీ నాయకత్వం ఎట్టకేలకు అభ్యర్థిత్వాలను ప్రకటించింది. కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేత అంజిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పెద్దపల్లి జిల్లాకు చెందిన విద్యాసంస్థ అధినేత మల్క కొమురయ్య అభ్యర్థిత్వం ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. పండుగ ముందే అభ్యర్థులను ఖరారు చేసి పార్టీ శ్రేణుల్లో జోష్ ను నింపే ప్రయత్నం చేసింది. ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో రెండు స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఇక్కడ అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీకి గట్టి పట్టు ఉండటం.. పట్టణ ప్రాంతాలు అధికంగా ఉండటం తమకు కలిసివస్తుందని బీజేపీ భావిస్తున్నది. ఈ క్రమంలోనూ వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. రెడ్డి సామాజికవర్గం నుంచి ఒకరికి... బీసీ సామాజికవర్గం నుంచి మరొకరికి అవకాశం కల్పించడం ద్వారా సమతూకం పాటించేలా బీజేపీ నిర్ణయం తీసుకున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.2019 నుంచి రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ పట్టును పెంచుకుంటూ వస్తుంది. కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ లోక్ సభ నియోజకవర్గాల్లో ప్రస్తుతం బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తుంది. బీజేపీ ఎమ్మెల్యే స్థానాలు కూడా అధికంగా ఈ ప్రాంతంలో ఉండటం తమకు అనుకూలమని బీజేపీ అంచనా వేస్తూ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరించి ప్రకటన చేసిందని తెలుస్తోంది.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మెదక్ జిల్లా సీనియర్ నేత సి. అంజిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మెదక్ జిల్లా రామచంద్రపురం ప్రాంతానికి చెందిన అంజిరెడ్డి వ్యాపారవేత్త, ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షునిగా పని చేశారు. అంజిరెడ్డి సతీమణి శ్రీమతి గోదావరి ప్రస్తుతం బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అంజిరెడ్డి గత దశాబ్దాలుగా ఎస్ ఆర్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. పేదలకు విద్యావకాశాలను పెంపొందించడంతో పాటు గ్రామాల్లో తాగునీటిని అందించడానికి తన ట్రస్ట్ ద్వారా అంజిరెడ్డి పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సుపరిచితులైన అంజిరెడ్డి అభ్యర్థిత్వం ఖరారు తమకు కలిసి వస్తుందనే ఆలోచనతోనే బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా నేత రఘునాథరావు, కరీంనగర్ జిల్లా సీనియర్ నేత పొల్సాని సుగుణాకర్ రావు కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే అంజిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే విషయంలో పార్టీ నాయకత్వం అన్ని కోణాల్లో ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిత్వం ఖరారులో బీజేపీ నాయకత్వం అనూహ్య నిర్ణయం తీసుకున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పెద్దపల్లి ప్రాంతానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త మల్క కొమురయ్యను ఎంపిక చేయడం వెనుక బీసీ సామాజిక వర్గమే కారణమని చెబుతున్నారు. మల్క కొమరయ్య స్వస్థలం పెద్దపల్లి, విద్యారంగ అభివృద్ధి కోసం తనవంతు కృషిగా పాఠశాలలను స్థాపించారు. నాణ్యమైన విద్యను ప్రోత్సహించడంలో గణనీయమైన కృషి చేశారని పార్టీ భావిస్తోంది. పెద్దపల్లి, నిర్మల్, హైదరాబాద్ లో విద్యాసంస్థలను స్థాపించారు. ప్రస్తుతం పల్లవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ హైదరాబాద్ చైర్మన్ గా ఉన్నారు. అకడమిక్ అడ్మినిస్ట్రేటర్, అధ్యాపకుడిగా గుర్తింపు ఉన్నది. తనకున్న అపారమైన అనుభవంతో తెలంగాణలో విద్యా నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో ఉన్నారు. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి టికెట్టు ఆశించగా ఈటెల రాజేందర్ కు కేటా మయించడంతో ఆయన విజయం కోసం తనవంతుగా కృషి చేశారు. పార్టీ పెద్దల వద్ద కూడా పరిచయాలు ఉండటం.. విద్యావేత్తగా ముద్రపడి ఉన్న నేపథ్యంలో బలమైన బీసీ సామాజికవర్గానికి చెందిన వారు కూడా. అధిష్టానవర్గం కొమురయ్య అభ్యర్థిత్వానికి సానుకూలంగా స్పందించిందని తెలుస్తోంది.బీజేపీ అభ్యర్థులను ఎంపిక చేయడంతో టిక్కెట్ ఆశించి భంగపడ్డ కమలనాధులు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. టికెట్ తమకే వస్తుందని కరీంనగర్ చెందిన బీజేపీ సీనియర్ నేత పోల్సాని సుగుణాకర్ రావు, మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ ప్రచారం కూడా సాగించారు. తీరా టైమ్ కు టికెట్ రాకపోవడంతో సుకుణాకర్ రావు పార్టీ పెద్దల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 45 ఏళ్లుగా బీజేపీ పార్టీలో కొనసాగుతున్న తనకు బహుమానం ఇదేనా అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.‌ బిజేపి లో ఉండడంతో ప్రాణహాని ఉన్నప్పటికీ భయపడకుండా వెనుకడు వేయకుండా కార్యకర్తలకు తోడుగా ముందుకెళ్ళానని, పార్టీ ఇచ్చిన ఏ కార్యక్రమానైనా విజయవంతంగా చేపట్టానని తెలిపారు.ఇతర పార్టీల నుంచి అవకాశాలు వచ్చిన సైద్దాంతిక నిబద్ధతతో క్రియాశీలకంగా పనిచేస్తున్నానని తెలిపారు. ఇలాంటి సమయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. తనలాంటి వారిని విస్మరించి, పార్టీ బలోపేతమైన తర్వాత చేరిన వారికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడం బాధాకరమని సుగుణాకర్ రావు నిర్వేదం వ్యక్తం చేశారు. గత ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లోను ఇదే వైఖరి అవలంబించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే సంస్కృతిని మళ్లీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సైతం అవలంబించడం దురదృష్టకరమని వాపోయారు. ఈ విధమైన సంస్కృతి పార్టీ శ్రేయస్సు దృష్ట్యా మంచిది కాదని సూచించారు. ఈ విషయంలో అధిష్టానం పునర్ ఆలోచించి తనకు టికెట్ కేటాయించాలని సుగుణాకర్ రావు విజ్ఞప్తి చేశారు. తిరిగి తనకు టికెట్ కేటాయిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి వస్తానని సుగుణాకర్ రావు స్పష్టం చేశారు.గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ముందే ప్రకటించాయి. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలకు కమలం పార్టీ ముందుగా అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సవాల్ విసిరింది. కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసే కసరత్తు చేస్తోంది. పట్టభద్రుల అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందరావు, ప్రసన్న హరికృష్ణ టికెట్ ఆశిస్తుండగా సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మరోమారు తమ అభ్యర్థిగా ఖరారు చేసి పార్టీ అధిష్ఠాన వర్గానికి నివేదించింది. అయితే కాంగ్రెస్ అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోవడంతో జీవన్ రెడ్డి పోటీలో ఉంటారా లేదా అన్నది అనుమానమేనని ప్రచారం జరుగుతోందిపరిణామాలతో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మరింత ఒత్తిడిలో పడింది. బీఆర్ఎస్ నుంచి మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, డాక్టర్ బీఎన్.రావు, ట్రస్మా నాయకుడు యాదగిరి శేఖర్ రావు టికెట్ ఆశిస్తు ప్రచారం సాగిస్తున్నారు. బిఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎటువంటి ఆలోచన చేస్తున్నదో ఇటు పార్టీ నేతలకుగాని.. అటు కార్యకర్తలకు గాని అంతుబట్టడం లేదు. అసలు పోటీలో ఉంటామో లేదో కూడా తెలియకపోవడం పార్టీ వర్గాలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. పార్టీ ముఖ్య నేత కేటీఆర్ కేసుల్లో ఇరుక్కొవడం.. కేసీఆర్ బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచార బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందా అనే దానిపై కూడా ఆ పార్టీలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. కేవలం పోటీకి బీఆర్ఎస్ విముఖత ప్రదర్శిస్తే పార్టీ మనుగడ ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతున్నది. పార్టీ క్యాడర్ కూడా ఇటు కాంగ్రెస్.. అటు బీజేపీ వైపు చీలిపోయే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై బీఆర్ఎస్ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోననే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

Related Posts