YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రయాగ్‌రాజ్‌లో.. 5.5కోట్ల మంది పుణ్యస్నానాలు

ప్రయాగ్‌రాజ్‌లో.. 5.5కోట్ల మంది పుణ్యస్నానాలు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో సంగం నది ఒడ్డున నిర్వహించబడుతున్న మహా కుంభమేళాలో ఈరోజు మూడవ రోజు. జనవరి 13 నుండి ప్రారంభమైన మహా కుంభమేళాలో ప్రతిరోజూ కోట్లాది మంది త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారు.
మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుంచే వివిధ అఖాడాల నుంచి సాధువులు వేలాదిగా తరలివచ్చారు. తొలి రోజున 1.75 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేయగా.. సంక్రాంతి ఒక్కరోజునే మొత్తం 3.5 కోట్ల మంది భక్తులు అమృత స్నానాలు చేశారు. రెండు రోజుల్లోనే 5.5 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే అరుదైన కుంభమేళా కావడంతో దేశవిదేశాల నుంచి భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు భారీగా తరలివస్తున్నారు. 45 రోజుల పాటు జరగనున్న మహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనుంది.
వణికించే చలిని, దట్టమైన పొగమంచునీ లెక్కచేయకుండా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు మూడోరోజున పెద్ద ఎత్తున హాజరయ్యారు భక్తులు. మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా బ్రహ్మముహూర్తంలో "అమృత స్నానం" కోసం తెల్లవారుజామున 3 గంటల సమయంలోనే లక్షలాదిగా భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు పోటెత్తారు. ముందుగా శంభు పంచాయతీ అటల్‌ అఖాడా, పంచాయతీ అఖాడా మహానిర్వాణీకి చెందిన సాధువులు అమృత స్నానాలు ఆచరించారు. తర్వాత వివిధ అఖాడాల నుంచి ఊరేగింపుగా తరలివచ్చిన సాధువులు, నాగసాధువులు, అఘోరాలు పవిత్ర స్నానాలు చేశారు.

Related Posts