కరీంనగర్, జనవరి 16,
కాగల కార్యం కౌశిక్ రెడ్డి తీర్చుతుంటే.. రేవంత్ రెడ్డి ఎందుకు తొందర పడుతున్నట్టు? ఇప్పటికే చాలా అరెస్టులు జరిగిపోయాయి.. మున్ముందు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఉపయోగం లేదు. భారత రాష్ట్ర సమితికి జరిగిన నష్టం కూడా లేదు. ఇలా అరెస్టు జరుగుతుంటే.. అలా బెయిల్ వచ్చేస్తోంది. అంత వీక్ గా పోలీసులు కేసులు పెడుతున్నప్పుడు.. ప్రభుత్వం ఇంత హంగామా చేయడం నిజంగా ఎందుకని ప్రశ్న సగటు కాంగ్రెస్ కార్యకర్త నుంచి వినిపిస్తోంది.: ప్రస్తుత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేస్తున్న తీరు.. వారు బెయిల్ మీద బయటికి వస్తున్న తీరు ఒకింత హైడ్ అండ్ సీక్ గేమ్ ను తలపిస్తోంది. సహజంగా ఈ పరిణామాన్ని ప్రజల్లో సానుభూతిగా మలచుకోవడానికి భారత రాష్ట్ర సమితి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.. అందువల్లే జనంలోకి అక్రమ కేసులు అంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ఈ కేసులతో తమకు ఏమి కాదని గులాబీ నేతలకు కూడా తెలుసు. కాకపోతే వారికి కావాల్సింది ప్రచారం.. ప్రజల్లో పెంచుకోవలసిన ఇమ్యూనిటీ.. దానివల్లే తాము బలపడతామని వారికి కూడా తెలుసు.. అందువల్లే ప్రభుత్వం పెట్టే ఏ చిన్నపాటి కేసునైనా సరే గులాబీ నేతలు పెద్దగా ప్రచారం చేసుకుంటున్నారు. సొంత మీడియా, సోషల్ మీడియాలో యోధులు లాగా ప్రజెంట్ చేసుకుంటున్నారు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 13 నెలలు దాటిపోయింది. ఈరోజుకు కూడా గులాబీ అగ్ర నేతలు కేటీఆర్, హరీష్ రావు, కవితను ఫిక్స్ చేసే ఒక కేసును కూడా గట్టిగా పెట్టలేకపోయాడు.. ఆరోపణల వరకు మాత్రమే పరిమితమవుతున్న ఆయన.. ఏ కేసులను బలమైన సాక్ష్యాలను బయట పెట్టలేకపోయారు. అందువల్లే లొట్ట పీస్ కేసు అని కేటీఆర్ అంటున్నాడు. ఏం పీక్కుంటావో పీక్కో అంటూ సవాల్ విసురుతున్నాడు. ఉదాహరణకి ఫార్ములా కేసు తీసుకుంటే.. గవర్నర్ ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు. ఇందులో ఏసీబీ, ఈడీ ఎంటర్ అయింది. ఈ కేసు వల్ల కేటీఆర్ కు ఏమీ కాదని.. గ్రీన్ కో విరాళాల గురించి కాంగ్రెస్ సోషల్ మీడియాలో మొత్తుకుంటున్నప్పటికీ.. పెద్దగా అందులో కేటీఆర్ బుక్ అయ్యే అవకాశం లేదు. మహా అయితే కొద్దిరోజులపాటు కేటీఆర్ జైల్లో ఉంటాడు.. అంతే అంతకుమించి ఏమీ ఉండదు. మరోవైపు ఎన్నికల బాండ్లు చట్టబద్ధమైనప్పుడు.. గ్రీన్ కో కంపెనీ పై ప్రభుత్వం తీసుకునే చర్యలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరం.క్యాబినెట్ ఆమోదం లేకుండానే.. సర్కారు సమ్మతి తెలపకుండానే నిధులు ఇచ్చారనే విషయంపై కేసు పెట్టారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ప్రవేశించింది. కానీ విధానపరమైన లోపాలు వేరు.. అవినీతి అనేది వేరు.. ఈ కేసులో అవినీతిని నిరూపించడం చాలా కష్టమని అధికారులు అంటున్నారు.. కవిత మీద ఆమధ్య ఢిల్లీ మద్యం ముడుపుల కేసు నమోదయింది. చివరికి ఆమెకు బెయిల్ వచ్చింది. అయితే అన్ని రోజులు ఆమె జైల్లో ఉండడం రేవంత్ ఘనత కాదు.. కానీ ఆ కేసు తర్వాత.. బెయిల్ మీద వచ్చి విడుదలైన తర్వాత కవిత మరింత బలోపేతమైంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో తిరుగుతోంది. ఇలా కేసులు పెట్టడం ద్వారా గులాబీ నేతల మీద క్షేత్రస్థాయిలో ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది అంటే.. ఈ ప్రశ్నకు సమాధానం లభించడం కష్టమే.ఉదాహరణకు పాడి కౌశిక్ రెడ్డి ఉదంతాన్ని పరిగణలోకి తీసుకుంటే.. పోలీసులు అరెస్టు చేసి హడావిడి చేశారు.. అత్యంత వీక్ గా రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు. ఈ మాత్రం దానికి రచ్చ రచ్చ చేశారు.. బెయిల్ ఇచ్చే కేస్ అయితే.. ఎందుకు అరెస్ట్ చేశారో పోలీసులకే తెలియాలి. కౌశిక్ రెడ్డి దారుణంగానే మాట్లాడుతున్నాడు. దురుసుగా వ్యవహరిస్తున్నాడు. అలాంటి వాళ్ళ జోలికి రేవంత్ వెళ్లకపోవడమే మంచిది. ఐనా కాగల కార్య కౌశిక్ రెడ్డి తీర్చుతుంటే రేవంత్ రెడ్డి తొందరపడటం నిజంగా హాస్యాస్పదం. స్థూలంగా చెప్పాలంటే నేటికి రేవంత్ రెడ్డికి అధికారుల మీద పట్టు దొరకలేదు. ఎప్పటికప్పుడు కేసులు వివరాలు గులాబీ నేతలకు వెళ్లిపోతున్నాయి. ఈ లెక్కన చూస్తే రేవంత్ ఎలాంటి అడుగులు వేసినా.. కష్టమే.. ఎందుకంటే ఇంటిగుట్టు లంకకు చేటు.