న్యూయార్క్ జనవరి 16
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫేర్‌వెల్ ప్రసంగం చేశారు. అమెరికాలో సంపన్నుల ఆధిపత్యం పెరుగుతోందని వార్నింగ్ ఇచ్చారు. అది ప్రమాదకరంగా మారుతోందన్నారు. దశాబ్ధాల రాజకీయ కెరీర్‌కు స్వస్తి పలుకుతూ.. బైడెన్ మీడియాతో మాట్లాడారు. అత్యంత సంపన్నమైన, శక్తివంతమైన, ప్రభావంతమైన వ్యక్తుల చేతుల్లో అధికారం ఉన్నదని, ఇది యావత్తు ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారుతోందని, మన ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు భంగం కలుగుతోందని బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. 82 ఏళ్ల బైడెన్ శ్వేతసౌధం నుంచి చివరి టీవీ ప్రసంగం చేశారు. వాతావరణ మార్పులు, సోషల్ మీడియా దుష్ ప్రచారంపై వార్నింగ్ ఇచ్చారు.తన సింగిల్ టర్మ్ పాలనలో సాధించిన ఘనతల గురించి ఆయన వివరించారు. ఉద్యోగాల కల్పన, మౌళికసదుపాయాలపై ఖర్చు, ఆరోగ్య పరిరక్షణ, కోవిడ్ నుంచి బయటపడడం, మళ్లీ దేశాన్ని నెంబర్ వన్ స్థానంలో ఎలా నిలిపారన్న అంశాలను ఆయన తన ప్రసంగంలో చెప్పారు. తాము చేసిన పని ఫలితాలు అందాలంటే ఇంకా సమయం పడుతుందన్నారు. మేం విత్తనాలు నాటామని, అవి పెరుగుతాయని, కొన్ని దశాబ్ధాల పాటు ఆ పుష్పాలు వికసిస్తాయన్నారు.అమెరికా ప్రజలపై సమాచార దాడి జరుగుతోందని, తప్పుడు సమాచారం ప్రచారం ఎక్కువగా ఉందని, దీంతో అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు. మెటా లాంటి సోషల్ మీడియా కంపెనీలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సోషల్ మీడియాలో ఫ్యాక్ట్ చెకింగ్ జరగడం లేదన్నారు. అబద్ధాలతో నిజాన్ని కప్పిపుచ్చుతున్నారన్నారు.