YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌ నేతలు, పోలీసుల మధ్య తోపులాట.. బీఆర్‌ఎస్ నాయకుల అరెస్ట్

ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌ నేతలు, పోలీసుల మధ్య తోపులాట.. బీఆర్‌ఎస్ నాయకుల అరెస్ట్

హైదరాబాద్‌ జనవరి 16
బషీర్‌బాగ్‌ ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌   ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈడీ ఆఫీస్‌కు  భారీ ఎత్తున బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కాగా, ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు. గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరిన కేటీఆర్‌.. బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఈ నెల 7న విచారణకు కేటీఆర్‌ హాజరవాల్సి ఉన్నది. అయితే ఏసీబీ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసిన నేపథ్యంలో.. తీర్పు వచ్చేవరకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో 16న విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరయ్యారు.అంతకుముందు.. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ను తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచపటంలో హైదరాబాద్‌ నగరాన్ని నిలపడం మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘ఫార్ములా రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ-మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్‌ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్ని రకాల చిల్లర కేసులు, బురదజల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవు. మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్‌ హైదరాబాద్‌ను పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తాను. ఫార్ములా-ఈ రేసు హైదరాబాద్‌ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపింది. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విజన్‌, నిబద్ధత, హైదరాబాద్‌ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలి. అందుకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నా..రాష్ట్ర ప్రభుత్వం పంపిన రూ.46 కోట్లు ఫార్ములా-ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగింది. కేవలం బ్యాంకు లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉంది. ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు. ప్రతి నయా పైసాకూ లెక్క ఉంది. మరి అలాంటప్పుడు ఇందులో అవినీతి, మనీలాండరింగ్‌ ఎక్కడ ఉంది?. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది. ఎలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్‌ ప్రభుత్వం కోర్టు కేసుల విచారణ పేరుతో ఈ అంశాన్ని లాగుతున్నది. కచ్చితంగా ఈ అంశంలో నిజమే గెలుస్తుంది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు, కోర్టులు కూడా త్వరలో తెలుసుకుంటాయి. అప్పటిదాకా న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.’ అని కేటీఆర్‌ అన్నారు.

Related Posts