YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మార్చిలో నాగబాబుకు పదవీ యోగం..?

మార్చిలో నాగబాబుకు పదవీ యోగం..?

విజయవాడ, జనవరి 17,
ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ మార్చి నెలలో జరిగే అవకాశముంది. జనసేన పార్టీ నేత కొణిదల నాగబాబును తొలుత ఎమ్మెల్సీగా చేయనున్నారు. అనంతరం ఆయనను చంద్రబాబు తన కేబినెట్ లోకి తీసుకోనున్నారు. ఇది ఫిక్సయినట్లు ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. నాగబాబు మంత్రి వర్గంలో చోటు ఖాయమైంది కాబట్టి ఆయనకు ఇచ్చే పదవిపైనా అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ఆయనకు టూరిజంతో పాటు సినిమాటోగ్రఫీ వంటి శాఖను అప్పగిస్తారని పెద్దయెత్తున ప్రచారం జరిగింది. అయితే సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకు అప్పగించేందుకు పవన్ కల్యాణ్ సుముఖంగా లేరని తెలిసింది. తమ కుటుంబం మొత్తం సినీ ఇండ్రస్ట్రీలో ఉండటంతో ఆయనకు సినీమాటోగ్రఫీ శాఖను అప్పగించకూడదని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న తమ కుటుంబానికి అదే శాఖ తీసుకుంటే వచ్చే ప్రశంసలకన్నా విమర్శలే ఎక్కువ వస్తాయని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంతో పాటు ఇప్పటికే టూరిజం, సినిమాటోగ్రఫీశాఖ మంత్రిగా తన పార్టీకే చెందిన కందుల దుర్గేష్ ఉన్నందున ఆయనను తప్పించి నాగబాబుకు అప్పగించాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం కూడా పవన్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ రెండు కీలకమైన, సున్నితమైన శాఖలు కావడంతో వాటిని డీల్ చేయడంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా అది తమ కుటుంబంపైన కూడా ప్రభావం చూపే అవకాశముంటుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు తెలిసింది అందుకే మరో కీలకమైన శాఖను అప్పగించాలని పవన్ కల్యాణ్ చంద్రబాబును కోరనున్నారని తెలిసింది. ఇందుకోసం పవన్ కల్యాణ్ ముఖ్యనేతలతో కూడా ఇప్పటకే మంతనాలు జరిపినట్లు సమాచారం. తొలిసారి మంత్రి పదవి దక్కనుండటంతో కీలకమైన శాఖ కాకుండా నాగబాబుకు నామమాత్రపు శాఖను కట్టబెట్టాలని, కొద్దిగా శాఖపై పట్టుసంపాదించుకున్న తర్వాత ముఖ్యమైన శాఖలను కేటాయించాలని కోరితే బాగుంటుందని కూడా కొందరు సూచించినట్లు తెలిసింది. దీతో ఆయనకు ఏ శాఖ ఇవ్వాలన్న దానిపై ఇప్పటి వరకూ ఒక నిర్ణయానికి రాలేదు. అదే సమయంలో ఒకటి, రెండు శాఖలను నాగబాబుకు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నారని తెలిసింది. అందులో యువజన సర్వీసుల శాఖ ఒకటిగా ఉందని తెలిసింది. ఆ శాఖను ఇప్పటికే కడప జిల్లాకు చెందిన రామ్ ప్రసాద్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఆయనకు రవాణా శాఖతో పాటు యువజనసర్వీసుల శాఖ కూడా ఉండటంతో నాగబాబుకు యువజన సర్వీసుల శాఖతో పాటుగా మత్స్యకారుల సంక్షేమ శాఖను అప్పగించాలన్న యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారని చెబుతున్నారు. ఈ రెండు శాఖల కారణంగా యువతతో పాటు కోస్తా తీరంలో ఉన్న మత్స్యకారులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించగలిగితే జనసేన కూడా తీర ప్రాంతంలో పట్టుపెంచుకునేందుకు వీలుంటుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మొత్తం మీద నాగాబాబుకు మార్చి నెల చివరి వారంలో మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి

Related Posts