విజయవాడ, జనవరి 21,
మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలని టీడీపీ నేతల నుంచి వస్తోన్న డిమాండ్లపై పార్టీ అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఈ అంశంపై ఎవరూ మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయొద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని ప్రకటించింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని ప్రకటనలో పేర్కొంది.సీఎం చంద్రబాబు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు పర్యటనలో...కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మద్దతు పలికారు. లోకేశ్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అనంతరం పలువురు నేతలు ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగ వ్యాఖ్యలు చేశారు.టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా బహిరంగ ప్రకటన చేస్తుండడంతో అధిష్ఠానం అలర్ట్ అయ్యింది. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారు చెప్పడం సరికాదని టీడీపీ అధిష్ఠానం భావించింది. ఇలాంటి సున్నితమైన అంశాలపై కూటమి నేతలు కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకుంటారని స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని పార్టీ నేతలను ఆదేశించింది.టీడీపీ నేతల డిమాండ్లకు జనసేన నేతలు కౌంటర్ గా స్పందించారు. పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని జనసేన నేతలు స్వరం పెంచారు. తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ ఈ అంశంపై స్పందించారు. తమ దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని చంద్రబాబుతో కలిపి నలుగురు అనుకుంటున్నామన్నారు. లోకేశ్ ను డిప్యూటీ పదవిలో చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పులేదని అన్నారు. అలాగే తాము పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నామని చెప్పారు."పవన్ కల్యాణ్ ను సీఎం చూడాలని బడుగు బలహీన వర్గాలు కోరుకుంటున్నాయి. సీఎం, డిప్యూటీ సీఎం పదవుల విషయంలో ఎన్నికల ముందు అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ఎన్నికలకు వెళ్లారో అదే కొనగిస్తే మంచిది. అనవసరంగా వైసీపీ నేతల మాటలకు ఊపిరి పోయకండి. వైసీపీలో కొంతమంది జేబులో మైకులు వేసుకుని తిరుగుతున్నారు. వాళ్లకు అవకాశం ఇవ్వవద్దు. పేర్ని నాని, రోజా జేబులో మైకులు వేసుకొని తిరుగుతున్నారు" - జనసేన నేత కిరణ్ రాయల్వివాదం ముదురుతుండడంతో టీడీపీ అధిష్టానం కల్పించుకుంది. డిప్యూటీ సీఎం వ్యవహారంపై ఎవరూ బహిరంగ ప్రకటన చేయొద్దని సూచించింది. ఏదైన ఉంటే కూటమి పార్టీలు కూర్చొని మాట్లాడుకుంటాయని పేర్కొంది. వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీపై రుద్దవద్దని కోరింది. టీడీపీ అధిష్ఠానం ప్రకటనతో డిప్యూటీ సీఎం వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.
ఫ్యూచర్ సీఎం అంటూ భరత్ కామెంట్స్
ఏపీలో పదవుల కోసం కొట్లాట మొదలైంది. డిప్యూటీ సీఎం హోదా కోసం మొదలైన ఫైట్...ఇప్పుడు సీఎం స్థాయికి చేరింది. లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందే అంటూ టీడీపీ నేతలు, మంత్రులు గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. పార్టీలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా లోకేశ్ భవిష్యత్ సీఎం అంటూ ప్రకటించేస్తున్నారు. వ్యక్తిగత ప్రకటనలను పార్టీపై రుద్దొద్దని అధిష్టానం ప్రకటన వచ్చిన గంటల వ్యవధిలోనే మంత్రి టీజీ భరత్ సంచలన ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ బృందంతో దావోస్ వెళ్లిన మంత్రి టీజీ భరత్ లోకేశే భవిష్యత్ సీఎం అంటూ ప్రకటన చేశారు. దీంతో ఇప్పుడు లోకేశ్ డిప్యూటీ సీఎం చర్చ నుంచి సీఎంకు టర్న్ అయ్యింది.దావోస్ లో తెలుగు పారిశ్రామికవేత్తల సదస్సుల్లో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ...ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా భవిష్యత్ ముఖ్యమంత్రి లోకేశ్ అంటూ కుండబద్దలు కొట్టారు. "175 ఎమ్మెల్యేలు, 25 మంది లోక్ సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీల్లో స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి చదివిన వాళ్లు ఎవరూ లేరు ఒక్క లోకేశ్ తప్ప. లోకేశ్ చాలా ఉన్నత చదువులు చదివారు. ఆయనకు ఎప్పుడు ఏం చేయాలో పూర్తిగా తెలుసు. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా టీడీపీకి ఫ్యూచర్ లోకేశ్. కాబేయే ముఖ్యమంత్రి లోకేశ్" అని మంత్రి టీజీ భరత్ అన్నారు.