YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వీఆర్ఎస్ బాటలో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్

వీఆర్ఎస్ బాటలో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్

విశాఖపట్టణం, జనవరి 21, 
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు వీఆర్ఎస్ బాటపట్టారు. ఇప్పటికే 460 మంది ఉద్యోగులు వీఆర్ఎస్‌కు దాఖలు చేసుకున్నారు. ఈనెల 31 వ‌ర‌కు గ‌డువుండ‌టంతో మ‌రికొంత మంది ఉద్యోగులు వీఆర్ఎస్‌కు దాఖ‌లు చేసుకునే అవ‌కాశం ఉంది. దీంతో స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగుల సంఖ్య తగ్గుతోంది.రాష్ట్రంలో టీడీపీ కూట‌మి ప్రభుత్వం, కేంద్రంలో ఎన్‌డీఏ కూట‌మి ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ కాద‌ని చెబుతున్నాయి. స్టీల్‌ప్లాంట్‌కు రూ.11,444 కోట్లు కేటాయించామ‌ని, త‌ద్వారా ప్రైవేటీక‌ర‌ణ ఆగుతుంద‌ని చెబుతున్నాయి. అయితే వీఆర్ఎస్ ప‌థ‌కాన్ని అమ‌లు చేయడంపై పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే దాదాపు ఏడేళ్లుగా పోస్టులు భ‌ర్తీ కాక దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల ఎగ్జిక్యూటివ్‌, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబ‌ర్ నాటికి మ‌రో 1,218 మంది ఉద్యోగులు ప‌ద‌వీ విర‌మ‌ణ పొందుతున్నారు. దీంతో ఆ 1,218 పోస్టులు ఖాళీ కానున్నాయి. 2018 నుంచి ఇప్పటి వ‌ర‌కు పోస్టుల భ‌ర్తీ జ‌ర‌గ‌లేదు. దీంతో 2018 నాటికి ఉద్యోగుల దాదాపుగా 16,000 ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 12,332కి త‌గ్గింది. వీఆర్ఎస్ వ‌ల్ల ఆ సంఖ్య మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉంది.2026 జ‌న‌వ‌రి త‌రువాత కూడా స‌ర్వీసు ఉన్న ఉద్యోగుల‌కు వీఆర్ఎస్ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. ఈనెల‌ 15న ప్రారంభ‌మైన వీఆర్ఎస్‌కు దాఖ‌లు చేసే ప్రక్రియ ఈనెల 31 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇప్పటి వ‌ర‌కు 12,332 మంది ఉద్యోగుల్లో 2,950 ఎగ్జిక్యూటివ్‌, 9,382 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో గ‌త నాలుగు రోజుల్లో 460 మంది వీఆర్ఎస్‌కు దాఖ‌లు చేసుకున్నారు. వీరిలో 208 మంది ఎగ్జిక్యూటివ్‌, 252 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఉన్నారు. ఈ వీఆర్ఎస్ ప‌థ‌కానికి రూ.500 కోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రటించిందని వైజాగ్ స్టీల్ యాజ‌మాన్యం చెబుతోంది.ఈ వీఆర్ఎస్ ప‌థ‌కంతో ఉద్యోగుల త‌గ్గుద‌ల‌కు కార‌ణం అవుతోంది. ఇప్పటికే భ‌ర్తీకాని భారీస్తాయిలో ఖాళీలు, మ‌రోవైపు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెన్యువ‌ల్ చేయ‌క‌పోవ‌డంతో ఉద్యోగుల కొర‌త ఏర్పడుతోంది. ఇప్పటికే 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్లో 800 మందికి రెన్యువ‌ల్ చేయలేదు. దీంతో వారు ప‌నిలో లేరు. ఇలా సిబ్బంది కొర‌త ఏర్పడితే స్టీల్ ఉత్పత్తిపై ప్రభావం ప‌డుతోంది. ప్రస్తుతం రెండు ఫ‌ర్నేస్‌ల ద్వారా మాత్రమే స్టీల్ ఉత్పత్తి చేస్తోన్నారు. మూడో ఫ‌ర్నేస్ ఆగ‌ష్టు నాటికి అందుబాటులోకి వ‌స్తోంద‌ని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ చెబుతున్నారు.అయితే మూడు ఫ‌ర్నేసులు ఉత్పత్తిలో పాల్గొనాలంటే, ఎక్కువ మంది ఉద్యోగులు, సిబ్బంది అవ‌స‌రం అవుతారు. ప్రస్తుతం రోజుకు రెండు ఫ‌ర్నేసులు 15 వేల ట‌న్నుల స్టీల్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. వాస్తవానికి రెండు ఫ‌ర్నేసులు సామర్థ్యం రోజుకు 14 వేల టన్నుల స్టీల్ ఉత్పత్తి మాత్రమే. కానీ ఉద్యోగులు, కార్మికులు క‌ష్టంతో అధ‌నంగా మ‌రో 1,000 ట‌న్నుల స్టీల్ ఉత్పత్తి జ‌రుగుతోందని కార్మిక సంఘ నేత ప్రసాద్ తెలిపారు.లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌, ఎల్‌టీసీ, ఎల్ఎల్‌టీసీ, ఎల్‌టీఏలు నిలిపివేయ‌డంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. దీనికి తోడు అధికారుల‌కు ఆరు శాతం పెర్క్స్ తొల‌గించ‌గా, కార్మికుల‌కు హెచ్ఆర్ఏ నిలిపివేశారు. ఉక్కు క్వార్టర్ల నివాసుల‌కు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఇంత ఆర్థిక భార వేసినప్పటికీ జీత‌మైనా స‌రిగా వ‌స్తుందా? అంటే అదీ లేదు. గ‌త నాలుగు నెల‌లుగా యాజ‌మాన్యం ఉద్యోగుల‌కు 250 శాతం జీతం పెండింగ్‌లో పెట్టింది. పీఎఫ్ ట్రస్ట్‌, ఎస్ఏబీఎఫ్ ట్రస్ట్‌, త్రిఫ్ట్ సొసైటీల‌కు సుమారు రూ.1,000 కోట్లు బకాయిలు ప‌డింది.మ‌రోవైపు ఈ ఏడాది నుంచి రిటైర్ అయిన ఉద్యోగుల‌కు చెల్లించాల్సిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ స‌క్ర‌మంగా చెల్లించ‌టం లేదు. ఈ నేప‌థ్యంలో ఉద్యోగుల్లో భ‌యం, అభ‌ద్ర‌తాభావం పెరిగింది. దీంతో వీఆర్ఎస్‌కు దాఖ‌లు చేసుకున్నవారి సంఖ్య పెరుగుతోంది. అయితే మొద‌టి రెండు రోజులు దాఖ‌లు చేసుకున్న వారి సంఖ్యతో పోల్చితే, పున‌రుద్ధ‌ర‌ణ ప్యాకేజీ రూ.11,444 కోట్లు ప్ర‌క‌టించిన త‌రువాత కొద్దిమేర త‌గ్గింది. అంతేత‌ప్ప వీఆర్ఎస్‌కు దాఖ‌లు చేసుకునేవారు మాత్రం ఆగ‌డం లేదు. దీంతో వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లుతుంది.మ‌రోవైపు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.11,444 కోట్లను కూడా ఎలా ఖ‌ర్చు చేస్తార‌నేదానిపై ఉద్యోగుల్లో, కార్మికుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్ఎండీసీకి 1,500 ఎక‌రాల‌ను కుద‌వ‌పెట్టడంతో వ‌చ్చిన సుమారు రూ.2,250 కోట్లు, స్టీల్‌ప్లాంట్ భూమి అమ్మగా వ‌చ్చిన రూ.260 కోట్లను యాజ‌మాన్యం ఏం చేసిందో, ఎలా ఖ‌ర్చు చేసిందో అర్థం కావ‌టం లేద‌ని కార్మిక సంఘం నేత‌లు పేర్కొంటున్నారు. ఈ రూ.11,444 కోట్లు కూడా అలాగే దేనికిప‌డితే దానికి ఖ‌ర్చు చేస్తే, దానివల్ల స్టీల్‌ప్లాంట్‌కు ఉప‌యోగమేమీ ఉండ‌ద‌ని అభిప్రాయ ప‌డుతోన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రక‌టించిన రూ.11,444 కోట్లు ఉప‌స‌మ‌నం మాత్రమేన‌ని, అంతేత‌ప్ప ఇది ప‌రిష్కారం కాద‌ని సీఐటీయూ నేత సీహెచ్ న‌ర్సింగరావు పేర్కొన్నారు. తాము మొద‌టి నుంచి వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గ‌నులు కేటాయించాల‌ని, సెయిల్‌లో విలీనం చేయాల‌ని డిమాండ్ చేస్తోన్నామ‌ని తెలిపారు. ఆ రెండు జ‌ర‌గ‌కుండా ఇంకా ఏదీ చేసినా అది శాశ్వత పరిష్కారం కాద‌ని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రెండు అంశాల‌పై మౌనం దాల్చుతున్నాయి. పైగా ఉద్యోగుల కొర‌త సృష్టించేందుకు వీఆర్ఎస్ పెట్టార‌ని, వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప‌రిర‌క్షించాల‌నుకుంటే వీఆర్ఎస్‌ను ఎందుకు కొన‌సాగిస్తున్నార‌ని ప్రశ్నించారు.

Related Posts