గుంటూరు, జనవరి 21,
ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం, సీఎం రచ్చ మొదలైంది. మంత్రి నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ శ్రేణులు కోరుతుంటే...డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను సీఎం చేయాలని జనసేన శ్రేణులు కోరుతున్నాయి. ఆర్నెల్లు ప్రశాంతంగా కొనసాగిన కూటమిలో అగ్గి రాజుకున్నట్లే కనిపిస్తుంది. లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదనను టీడీపీ నేతలు తెరపైకి తెచ్చారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు...టీడీపీ శ్రేణులు ఒక్కొక్కరిగా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదాపై హోం మంత్రి అనిత స్పందిస్తూ... రాసిపెట్టి ఉందేమో.. చూద్దామని అన్నారు. టీడీపీ నేతల డిమాండ్ కు సోషల్ మీడియాలో ఆ పార్టీ శ్రేణులు మద్దతు పలుకుతున్నాయి.లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తుంటే...జనసైనికులు కూడా రంగంలోకి దిగారు. పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని జనసేన నేతలు స్వరం పెంచారు. తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ ఈ అంశంపై స్పందించారు. తమ దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని చంద్రబాబుతో కలిపి నలుగురు అనుకుంటున్నామన్నారు. లోకేశ్ ను డిప్యూటీ పదవిలో చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పులేదని అన్నారు. అలాగే తాము పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నామని చెప్పారు."పవన్ కల్యాణ్ ను సీఎం చూడాలని బడుగు బలహీన వర్గాలు కోరుకుంటున్నాయి. సీఎం, డిప్యూటీ సీఎం పదవుల విషయంలో ఎన్నికల ముందు అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ఎన్నికలకు వెళ్లారో అదే కొనగిస్తే మంచిది. అనవసరంగా వైసీపీ నేతల మాటలకు ఊపిరి పోయకండి. వైసీపీలో కొంతమంది జేబులో మైకులు వేసుకుని తిరుగుతున్నారు. వాళ్లకు అవకాశం ఇవ్వవద్దు. పేర్ని నాని, రోజా జేబులో మైకులు వేసుకొని తిరుగుతున్నారు" - జనసేన నేత కిరణ్ రాయల్పవన్ సీఎం, లోకేశ్ డిప్యూటీ సీఎం చర్చపై సోషల్ మీడియా పోస్టులు పేలుతున్నాయి. టీడీపీ, జనసేన మద్దతుదారులు పోటాపోటీగా పోస్టులు పెడుతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసిన అనంతరం పవన్ కల్యాణ్...జైలు బయటే పొత్తు ప్రకటించిన వీడియోలు షేర్ చేస్తున్నారు. టీడీపీ శ్రేణులు సైతం చంద్రబాబు పొత్తు ధర్మం పాటిస్తున్నారని చెబుతున్నాయి. టీడీపీ నేతలే అగ్గి రాజేశారని జనసేన నేతలు అంటున్నారు. పొత్తు ధర్మం పాటించకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని ఇరుపార్టీలు నేతలు వాదించుకుంటున్నారు.ఇటీవల పరిణామాలు చూస్తుంటే కూటమిలో చీలిక తప్పదేమోనన్న సందేహం కలుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాకినాడ పోర్టు, తిరుపతి తొక్కిసలాట వ్యవహారంలో పవన్ కల్యాణ్ దూకుడుగా వ్యవహరించడంతో...లోకేశ్ ను రంగంలోకి దింపాలని టీడీపీ భావిస్తుంది. కూటమి పార్టీలు జట్టు కట్టే సమయంలో చంద్రబాబు సీఎం, డిప్యూటీ సీఎంగా పవన్ ఒక్కరే ఉండాలన్న ఒప్పందం జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. లోకేశ్ కు డిప్యూటీ సీఎం అంశం తెరపైకి రావడంతో...మూడు పార్టీలు చర్చించుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు.రాజకీయ పార్టీల్లో ఇలాంటి డిమాండ్లు సహజమేనని, తమ నేతను ఉన్నతస్థాయిలో చూడాలని శ్రేణులు భావిస్తుంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ వ్యవహారం చేయిదాటిపోకముందే ఇరు పార్టీల అధినేతలు కల్పించుకుంటే మంచిదని సూచిస్తున్నారు.