ఒంగోలు, జనవరి 21,
ఏపీలో నామినేటెడ్ పదవులు మళ్లీ తెరపైకి వచ్చాయి. నామినేటెడ్ పదవులను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ క్యాడర్ కూడ అదే తరహాలో త్వరగా పదవులను భర్తీ చేయాలని కోరుకుంటున్నారు. ఈ దశలో సీఎం చంద్రబాబు తన నివాసంలో పార్టీ ప్రధాన నాయకులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అసలు చర్చ ఎలా సాగిందంటే..రాష్ట్రంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం కావడంతో పార్టీ క్యాడర్ ఉత్సాహంగా ఉంది. అంతేకాదు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు కూడ ఆయా జిల్లాల అద్యక్షులను, మంత్రులను, ఎమ్మెల్యేలను, నాయకులను, కార్యకర్తలను అభినందిస్తూ ట్వీట్ కూడ చేశారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు 1,00,52,598 దాటడం ఎంతో గర్వకారణమని, రాజకీయ పార్టీల సభ్యత్వ నమోదులో ఇదో గొప్ప రికార్డుగా చంద్రబాబు అన్నారుకార్యకర్తల కష్టమే ఈ ఫలితం. కోటి మంది పసుపు సైన్యంతో పార్టీని తీర్చిదిద్దిన కార్యకర్తే పార్టీకి అధినేత. కార్యకర్తల పార్టీగా దినదిన ప్రవర్థమానమై తెలుగుదేశం వర్థిల్లుతోందని, ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న నారా లోకేష్ ను ప్రత్యేకంగా చంద్రబాబు అభినందించారు.అయితే ఏపీ కేబినెట్ భేటీ అనంతరం ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ మంత్రులు, ఎంపీలు, జోనల్ కోఆర్డినేటర్లతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. 7 నెలల పాలనా వ్యవహారాలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ది పనులు, పెట్టుబడులు, పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం, మెంబర్‌షిప్ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజా స్పందన వంటి అంశాలపై నేతలతో చర్చించారు. అలాగే నామినేటెడ్ పదవుల భర్తీపై సైతం సుధీర్ఘ చర్చ సాగింది.సాధ్యమైనంత త్వరగా వాటిని భర్తీ చేస్తామని, పార్టీని నమ్ముకున్న ఏ ఒక్కరికీ అన్యాయం జరగదంటూ చంద్రబాబు హామీ ఇచ్చారట. మంత్రులు, ఎంపీలు ఎప్పటికప్పుడు కార్యకర్తలను సమన్వయం చేసుకునే దిశగా కార్యాచరణ తయారీకి కూడ సిద్దం కావాలని చంద్రబాబు సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు జనంలోకి తీసుకువెళ్లే విధంగా మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కాగా త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తుండగా, ఆశావాహుల్లో మళ్లీ ఆశలు పుంజుకున్నాయి. అంతేకాకుండా జనసేన పార్టీలో సైతం నామినేటెడ్ పదవులు ఆశించేవారు కూడ తమ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.