నెల్లూరు, జనవరి 21,
వైసీపీ అధినేత వైఎస్ జగన్ జనవరి మూడో వారం నుంచి జిల్లాల పర్యటనలు చేస్తానంటూ ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇంత వరకూ జగన్ దానికి సంబంధించిన అప్ డేట్ ఇవ్వలేదు. జగన్ ఇంకా లండన్ లోనే ఉన్నారు. ఆయన వచ్చి ఎప్పుడు జిల్లాల పర్యటనలు చేస్తారన్న దానిపై నేతలకు కూడా క్లారిటీ లేదు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఎనిమిది నెలలు దాటుతుంది. అయితే ఈ ఎనిమిది నెలల కాలంలో కీలక నేతలు పార్టీని వీడి పోయారు. జగన్ బాగా నమ్మి దగ్గర తీసిన వ్యక్తులే దూరమయ్యారు. బాలినేని శ్రీనివాసులురెడ్డి, సామినేని ఉదయ భాను, కిలారు రోశయ్య ఇలా ఒక్కరేమిటి నిన్నటి నిన్న పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి కూడా పార్టీని వీడారు.. జగన్ తాడేపల్లి ఇంట్లోనో, బెంగళూరులోనో ఉంటే ఇక నేతలు మిగలరన్నది పార్టీ నేతల అభిప్రాయం. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకూ అనేక మంది నేతలు వెళ్లిపోతున్నా వారిని పట్టించుకోలేదు. అవంతి శ్రీనివాసరావు, ఆళ్లనాని, గ్రంధి శ్రీనివాస్ లు పార్టీని వదిలి వెళుతున్నా పట్టించుకోలేదు. తర్వాత నేతలకు తాను అవకాశం ఇవ్వాలని జగన్ భావించి ఉండవచ్చు. కానీ ఆ స్థాయి నేతలు వైసీపీకి ఎంత మేరకు దొరుకుతారన్నది ఇప్పుడు ప్రశ్న. జనంలో లేకుండా ఇంట్లోనో, కార్యాలయంలోనో కూర్చుంటే క్యాడర్ లో ఎలాంటి ధైర్యం ఉండదు. వారు కూడా ఇప్పటికే డీలా పడిపోయారు. నేతలే వెళ్లిపోతుంటే ఇక కార్యకర్తలు బయటకు వచ్చి ఆందోళన కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంటారన్న ప్రశ్నకు అధినేత నుంచి సమాధానం లేదు. జిల్లా నేతలతో సమావేశాలను తాడేపల్లి పార్టీ ఆఫీసులో పెట్టి తాను జనవరి మూడోవారంలో జిల్లాల పర్యటన చేస్తానని ప్రకటించడంతో ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్నారు. జనంలో ఉంటే కొంత పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలు కూడా యాక్టివ్ గా లేరు. ఎవరో ఒకరిద్దరు మినహా నేతలందరూ దాదాపు మౌనంగానే ఉన్నారు. వారందరూ యాక్టివ్ కావాలంటే తిరిగి తమ పార్టీ అధినేత జగన్ జనంలోకి రావడమే పరిష్కారం అని క్యాడర్ భావిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఎనిమిది నెలలు కావస్తున్నా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పడంలో వైసీపీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది వైసీపీ సోషల్ మీడియా సయితం పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఇటు మీడియా మద్దతు లేక, జగన్ జనంలోకి రాక పార్టీ ఎలా బలోపేతం అవుతుందని కొందరు సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. జనవరి మూడో వారంలో వస్తానని ప్రకటించడం ఎందుకు? తర్వాత రాకుండా ఆయన దానిని దాటవేయడం ఎందుకు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన వెంటనే చంద్రబాబు ఒక్కరే జిల్లాల పర్యటనకు వెళ్లారు. అనేక కార్యక్రమాలతో ప్రజల వద్దకు వెళ్లి వారికి ప్రజల వైఫల్యాలను చెప్పగలిగారు. దీంతోనే 2024లో ఆయనకు సక్సెస్ దక్కిందన్నది వాస్తవం. మరి జగన్ కు ఏమయింది? ఎందుకిలా పార్టీని ఇలా గాలికి వదిలేశారన్నది నేతలకే అర్థం కాకుండా ఉంది