విశాఖపట్టణం, జనవరి 21,
కూటమి ప్రభుత్వం పింఛన్లపైఫోకస్ చేసింది. ప్రభుత్వం 14 రకాల సామాజిక పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే 3000 రూపాయల పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన మొత్తాన్ని అందించారు. మూడు నెలల బకాయి తో పాటు చెల్లించారు. మరోవైపు కొత్త పింఛన్ల జారీకి సంబంధించి ప్రక్రియ ప్రారంభించారు. అయితే ఇప్పటికే అందిస్తున్న పింఛన్లలో భారీగా బోగస్ ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా వికలాంగుల పింఛన్లకు సంబంధించి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వికలాంగ పింఛన్లు పొందారు అన్నది ప్రధాన ఆరోపణ. దానిపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. బోగస్ పింఛన్లు తొలగించి కొత్త వాటిని అందించేందుకు కసరత్తు చేస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల కు సంబంధించి దివ్యాంగ పింఛన్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇందులో చాలామంది తప్పుడు వైకల్య ధ్రువపత్రాలు పెట్టి పింఛన్లు పొందుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీంతో విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రయోగాత్మకంగా కొన్ని సచివాలయాల పరిధిలో తనిఖీలు చేపట్టింది. దివ్యాంగ పింఛన్లలో భారీగా బోగస్ ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. అందుకే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగ పింఛన్లకు సంబంధించి తనిఖీ జరుగుతోంది. బోగస్ అని తేలితే వెనువెంటనే తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం తనిఖీలు జరుగుతుండడంతో బోగస్ లబ్ధిదారుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోందిసాధారణంగా దివ్యాంగ పింఛన్లకు సంబంధించి.. మూడు విభాగాలుగా విభజించారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ మంచానికి పరిమితమైన వారికి ప్రభుత్వం 15000 రూపాయలు కింద పింఛన్ మొత్తాన్ని అందిస్తోంది. ప్రస్తుతం వీరిని ముగ్గురు వైద్యులతో కూడిన బృందం పరిశీలిస్తోంది. అక్కడికక్కడే వారి ఆరోగ్య వివరాలను నమోదు చేసే ప్రక్రియ సైతం కొనసాగుతోంది. అయితే చాలామంది అర్హత లేని వారికి సైతం 15 వేల రూపాయల చొప్పున పింఛన్ అందుతున్నట్లు గుర్తిస్తున్నారు. ఇంకోవైపు తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న వారికి పదివేల రూపాయలు చొప్పున అందిస్తున్నారు. దీనిలో ఎక్కువ మంది అనర్హులు ఉన్నట్లు తాజాగా చేస్తున్న తనిఖీల్లో బయటపడుతోందిఇంకోవైపు వైకల్యంతో బాధపడుతున్న సాధారణ మనుషులకు 6000 రూపాయలు చొప్పున పింఛన్ అందిస్తున్నారు. అయితే ఇందులో సైతం ఎక్కువమంది బోగస్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరికీ సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గతం మాదిరిగా గుంప గుత్తిగా కాకుండా.. నిర్దిష్టమైన కొంతమందికి ముందుగానే సమాచారం ఇస్తున్నారు. వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అయితే వీరిలో సైతం భారీగా బోగస్ లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రత్యేక నమోదు ప్రక్రియ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారుఅయితే పింఛన్ల తనిఖీప్రక్రియ మరో రెండు నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. అప్పటివరకు కొత్త పింఛన్లకు సంబంధించి జారీ ఉండకపోవచ్చు. బహుశా మార్చి నెలలో భారీగా ఉన్న ఈ బోగస్ పింఛన్ల తొలగింపు చేపట్టవచ్చు. ఇందుకు సంబంధించి అనర్హుల జాబితా కూడా ప్రకటించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. 18 లక్షల వరకు ఉన్న ఈ పింఛన్లలో సగానికి సగం బోగస్ అని ప్రచారం జరుగుతోంది. మరి ఈ తొలగింపు జాబితాలో ఎంతమంది ఉంటారో తెలియాలి