హైదరాబాద్, జనవరి 21,
ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ప్రజాప్రతినిధిగా ఎన్నికయిన పార్టీకి రాజీనామా చేసినా ఇతర పార్టీ సభ్యత‌్వం తీసుకున్నా అనర్హులవుతారు. ఈ చట్టం ప్రకారం ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు అనర్హతా వేటుకు గురయ్యే అర్హత సాధించినట్లే. కానీ అదే చట్టంలో అనర్హతా వేటు ఎవరు వేయాలో నిర్దేశించారు. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని.. మరో విధమైన ఉల్లంఘనకు పాల్పడ్డారని ఎవరైనా ఎమ్మెల్యేపై కోర్టులు అనర్హతా వేటు వేసిన తీర్పులు ఉన్నాయి కానీ ఇలా పార్టీ ఫిరాయింపుల కింద అనర్హతా వేటు వేసిన తీర్పులు గతంలో లేవు. అదే సమయంలో నిర్ణయం తీసుకోవాలని కోర్టులు కూడా ఆదేశించలేవు. సభా వ్యవహారాల్లో స్పీకర్ ను ఆదేశించే అధికారం కోర్టులకు లేదని నిపుణులు చెబుతున్నారు. భారత రాష్ట్ర సమితి తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి పై వేటు వేయించేదాకా పోరాటం చేయాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. అందుకే అన్ని రకాలుగా బీఆర్ఎస్ లీగల్ టీంతో కసరత్తులు చేయించి తాజాగా సుప్రీంకోర్టులో తమ వాదనను బలపరిచేలా రెండు పిటిషన్లు వేయించారు.
10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన 9 నెలలు అవుతున్నా.. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్ పిటిషన్‌లో పేర్కొంది. హైకోర్టు తీర్పు ఇచ్చి 6 నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని కోర్టుకు బీఆర్ఎస్ తెలిపింది. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని పిటిషన్‌లో బీఆర్ఎస్ పేర్కొంది. గతంలో కేశం మేఘా చంద్ర కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోర్టును బీఆర్ఎస్ కోరింది. పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘా చంద్ర కేసులో తీర్పు వచ్చిందని .. ఆ తీర్పునకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని బీఆర్ఎస్ తెలిపింది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ కోరుతోంది. తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్‌కు అనుకూల నిర్ణయం రాకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సింగిల్ బెంచ్ ధర్మాసనం నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కానీ డివిజన్ బెంచ్ మాత్రం స్పీకర్ విచక్షణ మేరకు నిర్ణయం మేరకు నిర్ణయం తీసుకోవాలని కాలపరిమితి లేదని తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా అనర్హతా వేటు వేయిస్తామని కేటీఆర్ అదే పనిగా చెబుతున్నారు. తొందరలోనే పది నియోజకవర్గాల్లోను ఉపఎన్నికలు జరుగుతాయని కేటీఆర్ బాగా నమ్మకంతో చెప్పారు. తెలంగాణలో మాత్రమే కాదు ఏపీ, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కూడా పెద్దఎత్తున ఫిరాయింపులు జరిగాయి. అయితే ఎవరి మీదా అనర్హత వేటుపడింది లేదు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై తొందరగా నిర్ణయం తీసుకోమని స్పీకర్, ఛైర్మన్లకు కోర్టులు సూచనలు ఇస్తాయి కానీ.. ఫలానా చర్య తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన సందర్భం లేదని నిపుణులు చెబుతున్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చారు కానీ టైమ్ ఫ్రేమ్ లేకుండా స్పీకర్‌దే నిర్ణయమని చెప్పడం ద్వారా.. మొత్తం చట్టం ఉద్దేశం నిర్వీర్యమైపోయింది. ఆ కారణంగానే గతంలో బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వంతు. ఈ అంశంపై బీఆర్ఎస్‌కూ స్పష్టత ఉందని .. ఇంకా పార్టీలుమారే ఎమ్మెల్యేలు ఉంటే వారిని ఆపడానికి ఈ ప్రయత్నమని బీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.