నల్గోండ, జనవరి 21,
సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తన వైఖరితో మరోసారి చర్చనీయాంశంగా మారారు. నియోజకవర్గంలోని తన క్యాంప్ కార్యాలయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూల్చేసుకున్నారు. తానే స్వయంగా కూల్చేసుకోవటంపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇంతకూ క్యాంప్ కార్యాలయాన్ని కూల్చేసేంత అవసరం ఏమొచ్చిందనే కదా.. ఇప్పుడు డౌటనుమానం. అందుకు పెద్ద కారణమే ఉందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. క్యాంప్ కార్యలయాన్ని పూర్తిగా కూల్చేయలేదు. పాక్షికంగా కూల్చేసి.. మళ్లీ నిర్మాణాన్ని కూడా మొదలుపెట్టటం గమనార్హం.అయితే.. క్యాంప్ కార్యాలయంలో కొంత భాగం కూల్చేసి.. మళ్లీ నిర్మించటం వెనుక వాస్తు సబంధమైన కారణాలున్నాయన్న టాక్ నడుస్తోంది. వాస్తు దోషం ఉందని పండింతులు సూచించటం వల్లే.. కూల్చేసి మళ్లీ వాస్తు ప్రకారం నిర్మిస్తున్నట్టు సమాచారం. వాస్తు దోషం ఉండటం వల్లే తనకు రాజకీయంగా కలిసి రావట్లేదని.. ఎదుగుదల కూడా ఉండట్లేదన్నది కూడా రాజగోపాల్ రెడ్డి నమ్ముతున్నట్టు కూడా తెలుస్తోంది. అందుకే తనకు మంత్రి పదవి దక్కట్లేదన్నది కూడా రాజగోపాల్ రెడ్డి భావన అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే.. క్యాంప్ ఆఫీసులో మార్పులు చేస్తున్నట్టు సమాచారం.అయితే... కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి.. రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి ఆశిస్తున్నట్టు గత కొంత కాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీ పార్టీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఎలక్షన్ సమయంలోనే తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. పార్టీలో చేరే సమయంలోనే.. మంత్రి పదవికి సంబంధించిన విషయంలో కండీషన్ పెట్టారని.. అందుకు అధిష్ఠానం ఓకే అంటేనే చేరారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే.. ప్రభుత్వం ఏర్పడిన సమయంలో.. అసెంబ్లీ సమావేశాల్లోనూ.. ప్రతిపక్ష నేతలైన కేటీఆర్, హరీష్ రావు కూడా.. "నువ్వెంత మాట్లాడినా నీకు మంత్రి పదవి ఇవ్వరులే.." అంటూ ఎద్దేవా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే.. త్వరలోనే రేవంత్ రెడ్డి సర్కార్ కేబినెట్ విస్తరణ జరపనున్నట్టు తెలుస్తోంది. మొదటిసారి తన సోదరుడైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వటంతో.. ఒకే ఇంట్లో ఇద్దరికి పదవులు ఇచ్చారన్న అపవాదు వస్తుందని అధిష్ఠానం వెనకడుగు వేయగా.. ఈసారి మంత్రివర్గ విస్తరణలో మాత్రం కచ్చితంగా మంతి పదవి కావాలని రాజగోపాల్ రెడ్డి ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. అయితే.. తనకు హోంమంత్రి పదవి కావాలని బహిరంగంగానే పలుమార్లు తన మనసులోని మాట బయపెట్టారు. కానీ.. సొంత పార్టీ నేతలే ఆయనకు మంత్రి పదవి ఇవ్వొద్దని అడ్డుపడుతున్నట్టు సమాచారం.ఈ పరిణామాలన్నింటికీ.. వాస్తు దోషం కూడా ఓ కారణంగా భావిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. క్యాంప్ కార్యాలయంలో మార్పులు చేస్తున్నట్టు సమాచారం. మరి.. ఈ మార్పులు కలిసొచ్చి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రి పదవి వరిస్తుందో లేదో చూడాలి.