భారత్‌లో ఐపీఎల్‌కు ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. నెల రోజులకు పైగా జరిగే ఈ ఐపీఎల్ సంబరాన్ని కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే తరహాలో పడవ పోటీలు రాబోతున్నాయి. కేరళ రాష్ట్రం పడవ పోటీలకు పెట్టింది పేరు. ఏటా అక్కడ స్నేక్ బోట్ రేస్‌లు నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ తరహాలో స్నేక్ బోట్ రేస్ టోర్నమెంట్ నిర్వహించాలని కేరళ టూరిజం శాఖ నిర్ణయించింది. ఆగస్టు నుంచి ఈ పోటీలు ప్రారంభంకానున్నాయి. ‘కేరళ బోట్ రేస్ లీగ్ (కేబీఆర్ఎల్)’ పేరిట ఈ పడవ పోటీలను నిర్వహించనున్నారు. అలప్పుజలోని పున్నమడక్కాయల్‌లో జరిగే నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్, కొల్లాంలో జరిగే ప్రెసిడెంట్స్ ట్రోఫీ బోట్ రేస్‌లను ఈ లీగ్ కిందకు తీసుకురానున్నారు. కేరళ బోట్ రేస్ లీగ్ ఈ ఏడాది ఆగస్టు 11న ప్రారంభమై నవంబర్ 1న ముగుస్తుంది. కేరళ టూరిజం మంత్రి కొడకంపల్లి సురేంద్రన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్‌ను క్వాలిఫయర్ రేస్‌గా పరిగణించనున్నారు. ఇందులో అర్హత సాధించిన జట్లు కేరళ బోట్ రేస్ లీగ్‌లో పాల్గొంటాయి. ఈ లీగ్‌లో మొత్తం 12 మ్యాచ్‌లు ఉంటాయి. నెహ్రూ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన తొమ్మిది స్నేక్ బోట్ పెర్ఫార్మర్లను లీగ్‌కు ఎంపిక చేస్తారు. పున్నమాడ, పులింకున్ను, కైనకరి, కరువట్ట, మావెలిక్కర, కయాంకుళం, పిరవోం, పూతొట్ట, కొట్టాపురం, తళతంగడి, కలాల్డా, కొల్లాం వేదికలుగా ఈ పోటీలు జరగనున్నాయి. ఈ లీగ్‌కు అర్హత సాధించిన తొమ్మి జట్లకు ప్రతి వేదిక నుంచి బోనస్‌గా రూ.4 లక్షలు అందజేస్తారు. ప్రతి లీగ్ మ్యాచ్‌లో తొలి ముగ్గురు విజేతలకు రూ.1 లక్ష నుంచి రూ. 5 లక్షల ఇస్తారు. ఇక మొత్తం లీగ్ విజేతలకు రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షలు నగదు బహుమతి అందుతుంది. కాగా, ఈ లీగ్ వల్ల రాష్ట్రంలోని సంప్రదాయ పడవ పోటీలకు ఎలాంటి నష్టం వాటిల్లదని కేరళ టూరిజం శాఖ స్పష్టం చేసింది. మూలం, నీరేట్టుపురం, అరాన్ముల, పాయిపట్టు, ఇతర ప్రాంతాల్లో జరిగే పోటీలను లీగ్ కిందకు తీసుకురాలేదని వెల్లడించింది. ఆ పోటీలన్నీ ఎప్పటిలానే జరుగుతాయని ప్రకటించింది.