YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆ బిజెపి ఎమ్మెల్యేకు ఏమైంది.. ఢిల్లీ పెద్దల ఆరా

ఆ బిజెపి ఎమ్మెల్యేకు ఏమైంది.. ఢిల్లీ పెద్దల ఆరా

విశాఖపట్టణం, జనవరి 23, 
ఏపీలో బిజెపి బలంగా ఉన్న ప్రాంతం విశాఖ. అక్కడ ఉత్తరాది రాష్ట్రాల వారు ఎక్కువగా ఉంటారు. కేంద్ర సంస్థలు అక్కడ ఎక్కువగా ఉండడంతో ఉత్తరాది వారు వచ్చి పని చేస్తుంటారు. అదే సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తరాంధ్రను అన్ని విధాల అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉంది. మొన్నటికి మొన్న ప్రధాని మోదీ వచ్చి రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంత చేస్తున్నా దానిని ప్రచారం చేయడంలో బిజెపి నేతలు విఫలమవుతున్నారన్న విమర్శ ఉంది. అయితే ప్రచారం చేయడం లేదు సరి కదా.. అడ్డగోలుగా మాట్లాడి అడ్డంగా బుక్ అవుతున్నారు బిజెపి నేతలు. అసలే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ప్యాకేజీ విషయంలో విశాఖ స్టీల్ కార్మికులు పెద్దగా సంతృప్తి గా లేరు. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ విశాఖకు చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కార్మికులను ఉద్దేశించి మీకు దురాశ ఎక్కువ… కేంద్రం మంజూరు చేసిన ప్యాకేజీ నచ్చకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోండి అంటూ కామెంట్స్ చేయడంతో.. కార్మికులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. అక్కడే ఉన్న కూటమి నేతలు సైతం ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.ఇప్పుడు విష్ణుకుమార్ రాజు కామెంట్స్ విపక్షాలకు అస్త్రంగా మారాయి. ముఖ్యంగా వైసిపి నేరుగా విమర్శలు ఎక్కిపెడుతోంది. విష్ణు కుమార్ రాజు వ్యవహార శైలి వైసిపి పై అభ్యంతరకరంగా ఉంటుంది. ఈయనకు తెలుగుదేశం భావజాలం ఎక్కువ. గతంలో టిడిపి తో బిజెపి విభేదించిన సమయంలో సైతం.. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడేవారు. అయితే పొత్తు కుదరడంతో.. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో విశాఖ ఉత్తర నియోజకవర్గ టికెట్ ను పొందగలిగారు. ఎమ్మెల్యే కావడంతో చంద్రబాబు తప్పకుండా తనకు మంత్రి పదవి ఇస్తారని భావించారు. ఇవ్వక పోయేసరికి కాస్త మనస్థాపానికి గురయ్యారు. అయితే ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ అడ్డగోలుగా మాట్లాడుతూ పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారు. విశాఖ ఘటనకు సంబంధించి స్టీల్ కార్మికులపై ఆయన చేసిన కామెంట్స్ ఢిల్లీ వరకు చేరినట్లు సమాచారం.మరోవైపు బిజెపి ఏపీ అధ్యక్ష స్థానాన్ని ఆశిస్తున్నారు విష్ణు కుమార్ రాజు. ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆయన చాలా విషయాల్లో బ్లాస్ట్ అవుతున్నారు. వైసిపి పై విమర్శల వరకు ఓకే. కానీ ఇప్పుడు వ్యవస్థల విషయంలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు బిజెపి వైఖరి పై ఆగ్రహంగా ఉన్నారు. విశాఖలో రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు సరికొత్త ప్రాజెక్టులు, ఆపై విశాఖ స్టీల్ కు కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. దానిని సానుకూలంగా తీసుకొని ప్రజల మధ్యకు వెళ్లాలి తప్ప.. ఇలా ఓపెన్ కామెంట్స్ చేయడం, సవాల్ చేయడం విష్ణుకుమార్ రాజుకు తగదు. దీనిపై హై కమాండ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని ఆరా తీసినట్లు తెలుస్తోంది.విష్ణు కుమార్ రాజు ప్రస్తుతం బిజెపి శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. వాస్తవానికి బిజెపిలో అత్యంత సీనియర్ కూడా ఆయన. 2014లో పొత్తులో భాగంగా విశాఖ నుంచి గెలిచారు విష్ణు కుమార్ రాజు. శాసనసభలో చంద్రబాబు పట్ల అత్యంత విధేయతగా ఉండేవారు. టిడిపికి అనుకూలమైన ప్రకటనలు చేసేవారు. 2019లో టిడిపిని బిజెపి విభేదించినా.. విష్ణు కుమార్ రాజు మాత్రం టిడిపి పై ఎటువంటి విమర్శలు చేసేవారు కాదు. పైగా అదేపనిగా వైసీపీని టార్గెట్ చేసేవారు. జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేసేవారు. అయితే ఏది ఎలాగున్నా విష్ణు కుమార్ రాజు ఆశించినట్టుగా టిడిపి బిజెపి మధ్య పొత్తు కుదిరింది. రాజుగారు ఆశించినట్టే చంద్రబాబు సీఎం అయ్యారు. అయితే తన మంత్రి కోరిక మాత్రం తీరలేదు. పోనీ ఏపీ బీజేపీ చీఫ్ అవుతాం అనుకుంటున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండడం ఆయనకే మైనస్.

Related Posts