YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కమలం... ఎవరి పరం...

కమలం... ఎవరి పరం...

విజయవాడ, జనవరి 23, 
ఏపీ బీజేపీలో జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తి కావడంతో రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఎవరికి దక్కుతాయనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. పురందేశ్వరి స్థానంలో మరొకరికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతున్నా ఆమెను కొనసాగించ అవకాశాలు లేకపోలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.బీజేపీ అధ్యక్ష పీఠంపై కన్నెసిన వారిలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ప్రస్తుతం ఏపీ క్యాబినెట్‌లో ఉన్న సత్యకుమార్‌ యాదవ్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం సుజనా చౌదరి కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని భావించినా ఆయన చివరకు పశ్చిమ ఎమ్మెల్యే టిక్కెట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మంత్రి వర్గంలో కూడా చోటు దక్కలేదు. బీజేపీ తరపున సత్య కుమార్‌ యాదవ్‌కు క్యాబినెట్‌లో చోటు దక్కింది.ఏపీలో సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ గత పదేళ్లుగా రకరకాల ప్రయోగాలు చేసింది. తొలుత కాపు సామాజిక వర్గాన్ని దరి చేర్చుకుంటే బీజేపీకి రాజకీయంగా కలిసి వస్తుందని ఆ పార్టీ భావించింది. అందులో భాగంగా సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణలకు అధ్యక్ష బాధ్యతలు దక్కాయి. సామాజిక సమీకరణల్లో బీజేపీ ప్లాన్ పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో చివరకు పురందేశ్వరికి అధ్యక్ష బాధ్యతలు దక్కాయి.పురందేశ్వరి సారథ్యంలోనే సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. గత ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ జట్టు కట్టడంలో పురందేశ్వరి ప్రయత్నాలు కొంత మేరకు ఉన్నాయి. ఆ తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ఎన్నికల్లో పోటి చేయడం, సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ఘన విజయం సాధించడం తెలిసిందే. పురంధేశ్వరి తర్వాత ఆ పార్టీ అధ్యక్ష పగ్గాలు ఎవరికి దక్కుతాయనే చర్చ కొంత కాలంగా బీజేపీలో సాగుతోంది. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం అన్ని జిల్లాల్లో అధ్యక్ష ఎన్నికలు కొలిక్కి రావడంతో రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి దక్కుతాయనే చర్చ మొదలైంది.ప్రస్తుతం పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి 2023 జూలైలో ఈ బాధ్యతలు చేపట్టారు. నెలాఖరులోగా కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. నెలాఖరులోగా ఏపీ కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. పురంధేశ్వరిని కొనసాగిస్తారనే వాదనలు కూడా ఉన్నాయి. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, మంత్రి సత్యకుమార్ యాదవ్‌, డాక్టర్ పార్థసారధి, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్‌తో పాటు రేసులో మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి పేరు కూడాఉంది.ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నిమగ్నమైన ఉన్న ఆ పార్టీ అగ్రనేతలు కొత్త అధ్యక్షుడి నియామకంపై అభిప్రాయాలు తెలపాలని రాష్ట్ర పార్టీ నేతలకు సూచించినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సోము వీర్రాజు వంటి నేతలు కూడా ఢిల్లీలో తన ప్రయత్నాల్లో ఉన్నారు. ఏపీలో సొంతంగా ఎదగాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోన్న బీజేపీ ఈసారి ఎవరికి ఛాన్స్ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Related Posts