పార్టీ కోసం కఠినంగా ఉంటా.. నేతలు వింటే వ్యక్తిగతంగా చెబుతా.. వినకపోతే ప్రజల్లోనే చెప్తానంటున్నారట చంద్రబాబు. అమరావతిలో జరిగిన సమన్వయ కమిటీ భేటీలో టీడీపీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారట. 'ఇది ఎన్నికల సమయం కాబట్టి నేతలు చాలా జాగ్రత్తగా పని చేయాలి. ఈ 2019లో టీడీపీ గెలవడం చాలా ముఖ్యం. ప్రతిపక్షాలు చేసే తప్పుడు పనులను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నాం.. ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. నాకు ఏమీ తెలియదులే అనే భావన వదిలేయాలి.. ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటా. అవసరమైతే కఠిన నిర్ణయాలకు కూడా వెనకాడబోను. సాధికార మిత్రలతో, రైతు మిత్రలతో, విద్యార్థులతో ఓ సభ పెట్టాలి. కార్యకర్తలతో ఎక్కువగా మమేకం అయ్యేందుకు ప్రయత్నించాలి. 4 నెలల వ్యవధిలో గ్రామదర్శిని పేరుతో గ్రామాల్లో తిరగాలి' అని బాబు సూచించారని తెలుస్తోంది. ప్రభుత్వం చేసిన పనులపై ప్రచారం విస్తృతంగా ఉండాలి. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రచారంతో ముందుకు సాగాలి. పూర్తిస్థాయిలో రాజకీయాల్లో కొనసాగాలంటే అన్నింటిపై అవగాహన పెంచుకొని.. ముఖ్యంగా సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలి. ఎన్నికల్లో గెలవాలంటే నేతలందరూ కష్టపడాల్సిందే. ఈసారి గెలుపు చాలా ముఖ్యం. ఎన్నికల వరకు ధర్మపోరాట సభలు కొనసాగిద్దాం.. అలాగే ఈనెల ఆఖరులో ఢిల్లీలో ఎంపీలతో సభ ఏర్పాటు చేబోతున్నాం. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. రాబోయే రోజుల్లో నేతలు అప్రమత్తంగా ఉంటూ.. ప్రజల్లోకి వెళ్లాల్సిందే' అన్నారట చంద్రబాబు. సమన్వయ కమిటీ భేటీ సమావేశం తర్వాత మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడారు. 'ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై చర్చించాం. రాబోయే రోజుల్లో కేంద్రంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. ధర్మపోరాట సభ ద్వారా బీజేపీ రాష్ట్రం చేస్తున్న కుట్రల్ని ప్రజలకు వివరిస్తాం. రాజమహేంద్ర వరం వేదికగా ధర్మపోరాట సభను ఏర్పాటు చేస్తాం.. తర్వాత రాయలసీమలో మరొకటి నాలుగో సభను నిర్వహిస్తాం. బీజేపీ, వైసీపీ చేస్తున్న కుట్ర రాజకీయాలను ఎండగడతాం. పవన్ కళ్యాణ్ కూడా సడన్‌గా యూటర్న్ తీసుకొని.. నిరాధారమైన ఆరోపణలు చేయడం దారుణం' అన్నారు కాల్వ.