YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నల్గోండ కాంగ్రెస్ లో కొత్త వర్సెస్ పాత...

నల్గోండ కాంగ్రెస్ లో కొత్త వర్సెస్ పాత...

నల్గోండ, జనవరి 23, 
నల్గొండ కాంగ్రెస్‌లో కొత్త, పాతల పంచాయితీ నడుస్తోంది. ముఖ్యంగా నకిరేకల్‌ నియోజకవర్గంలో భర్తీ చేసిన నామినేటెడ్‌ పోస్టుల విషయంలో..ఎమ్మెల్యే వేముల వీరేశం వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నట్లుగా మారాయట పాలిటిక్స్‌. నకిరేకల్‌ సెగ్మెంట్‌లోని మార్కెట్‌ కమిటీల నియామకంలో తమ వర్గానికి, సీనియర్‌ నేతలకు అన్యాయం జరిగిందని భావిస్తోందట కోమటిరెడ్డి టీమ్‌.వేముల వీరేశంతో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలకు నామినేటెడ్‌ పోస్టులు కట్టబెట్టారని..ఆ నేతలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంటంటూ లోకల్‌ లీడర్లు గళమెత్తున్నారట. దీంతో ఎమ్మెల్యే వేముల వీరేశం వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నట్లుగా మారిపోయిందట సీన్.మొన్నటి వరకు అంతా బానే కనిపించినా..నకిరేకల్‌ నియోజకవర్గంలో అసలు కథ ఇప్పుడే షురూ అయిందన్న టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో అధికార పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందని..పాత, కొత్త కాంగ్రెస్ పార్టీ అంటూ క్యాడర్‌ కూడా రెండు వర్గాలుగా విడిపోయారనే చర్చ జరుగుతోంది. ఇక నామినేటెడ్ పోస్ట్‌ల ఇష్యూ మరింత చిచ్చురేపిందట. నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని నార్కట్‌పల్లి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత మండలం.ఒకప్పుడు నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న చిట్యాల, నార్కట్‌పల్లి మండలాలు 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నకిరేకల్ సెగ్మెంట్‌లో కలిశాయి. దీంతో నకిరేకల్‌ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బలమైన క్యాడర్, అనుచరవర్గం ఉంది. అందుకే ఎన్నికలకు ముందు వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరేందుకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సుముఖత కోసం చాలా రోజులు ఆగాల్సి వచ్చిందంటుంటారు. అయితే అధికారంలోకి వస్తే తమ హవానే నడుస్తుందని భావించిన కోమటిరెడ్డి వర్గం..అడుగడుగునా ఇబ్బందులే ఎదురవుతున్నాయని ఫీలవుతుందట.కోమటిరెడ్డి వర్గం అసంతృప్తికి ఇటీవల నియమించిన చిట్యాల, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీల కొత్త కార్యవర్గమేనట. చిట్యాల, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, సభ్యుల్లో మొదటి నుంచి పార్టీ జెండా మోసినోళ్ల పేరు ఒక్కటి లేదట. బయట నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారట. చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నియమించిన నర్రా మోహన్ రెడ్డిది టీడీపీ, బీఆర్ఎస్ బ్యాక్ గ్రౌండ్. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి కాంగ్రెస్‌లోకి వచ్చారు.అక్కడ ఇదే పోస్ట్‌పై సీనియర్ నేత పోకల దేవదాసుతో పాటు చాలా మంది సీనియర్లు గంపెడాశలు పెట్టుకున్నారట. అటు కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రధాన అనుచరుడు చిన్న వెంకట్ రెడ్డి కూడా తన వర్గానికే మార్కెట్ ఛైర్మన్ పదవి ఇప్పించుకునేందుకు లాబీయింగ్ చేసినా..భంగపాటే ఎదురైందట. ఇక నియోజకవర్గ కేంద్రమైన నకిరేకల్‌లోనూ సేమ్ సీన్. అక్కడ కూడా కొత్త మార్కెట్ ఛైర్మన్‌గా గుత్తా మంజులా రెడ్డిని నియమించారు. ఈమె కూడా ఎన్నికల ముందు వేముల వీరేశంతో కలిసి బీఆర్ఎస్ నుంచి వచ్చారు.ఒక నామినేటెడ్ పోస్ట్‌ల విషయంలోనే కాదు..మంత్రి కోమటిరెడ్డి అనుచరుడు అంటే చాలు..సదరు నేతను దూరం పెడుతున్నారట ఎమ్మెల్యే వేముల వీరేశం. తనతో పాటు పార్టీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని గుస్సా అవుతున్నారు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు. కనీసం అధికారిక కార్యక్రమాలకు కూడా సమాచారం ఇవ్వడం లేదట.అసలు పార్టీలో ప్రాధాన్యత, గౌరవం లేదని..పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇంత అవమానం ఎదుర్కోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఎన్నోసార్లు చెప్పుకుంటూ బాధ పడ్డారట క్యాడర్‌, లీడర్లు. వేముల వీరేశం చేరికను వ్యతిరేకిస్తే విన్నారా..వద్దూ వద్దూ అంటే కావాలని తెచ్చి పెట్టుకున్నారు..ఇప్పుడు చేయడానికేమీ లేదని తన అనుచరులపై గరం గరం అవుతున్నారట మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. దాంతో మింగలేక కక్కలేక..అలా అని పార్టీని వీడలేక అయోమయంలో పడిపోయారట కోమటిరెడ్డి వర్గం నేతలు.ఇక నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొనే కార్యక్రమాలకు ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు ఎవరూ హాజరుకావడం లేదట. కోమటిరెడ్డిని కలవడానికి కానీ..కార్యక్రమాలకు కానీ ఎవ్వరూ వెళ్లొద్దని మౌఖిక ఆదేశాలు వెళ్లాయట. ఈ మాట ఎవరూ ఇచ్చారంటే..అందరి వేళ్ళు ఎమ్మెల్యే వేముల వీరేశం వైపే చూపిస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇటీవల నకిరేకల్‌ నియోజకవర్గ పరిధిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తనయుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలకు స్వయంగా మంత్రి హాజరైనా..ఎమ్మెల్యే వీరేశం కానీ.. ఆయన అనుచరులు కానీ అందులో పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎమ్మెల్యే వీరేశం మాత్రం తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని..అంతా బానే ఉందని చెప్పుకొస్తున్నారు. నకిరేకల్ కాంగ్రెస్‌లో కొత్త, పాతల పంచాయితీ ఎక్కడ వరకు దారితీస్తుందో వేచి చూడాలి మరి.

Related Posts