తూర్పు గోదావరిజిల్లా పిఠాపురంలోని టిటిడి అనుబంధ ఆలయమైన శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 15 నుండి 20వ తేదీ వరకు కుంభాభిషేకం, పున: ప్రాణప్రతిష్ట శ్రీ పంచరత్ర ఆగమం ప్రకారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జూన్ 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు విష్వక్సేనారాధన, పుణ్యహావచనం, వాస్తు హోమం, అంకురార్పణం జరుగనుంది.
ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 16వ తేదీ ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు చతుష్ఠానార్చన, ధ్వజకుంభ ఆరాధన, సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు నిత్యహోమం, నూతన విగ్రహలకు క్షీరాధివాసం జూన్ 17వ తేదీ ఉదయం జలాధివాసం, సాయంత్రం విశేష హోమాలు, నివేదన, జూన్ 18వ తేదీ సాయంత్రం కర్మాంగ స్నపనం, శయ్యాధివాసం నిర్వహించనున్నారు.
జూన్ 19న నూతన ధ్వజస్తంభం ప్రతిష్ట
జూన్ 19వ తేదీ మంగళవారం ఉదయం 11.00 గంటలకు ఆలయంలో నూతన ధ్వజస్తంభంను శాస్త్రోక్తంగా ప్రతిష్టించనున్నారు.
శ్రీవారి విగ్రహ ప్రతిష్ట
అనంతరం ఉదయం 11.30 గంటలకు శ్రీవారి విగ్రహ ప్రతిష్ట (పున: ప్రాణప్రతిష్ట) సాయంత్రం పంచశయ్యాదివాసం జరుగనుంది. జూన్ 20వ తేదీ తెల్లవారుఝామున 3.00 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పున: ప్రతిష్ట, మహాసంప్రోక్షణ అత్యంత వైభవంగా నిర్వహించి, అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు శాంతి కల్యాణం ఘనంగా నిర్వహించనున్నారు.