YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అన్నమయ్య జిల్లాల్లో పురాతన విగ్రహాలు

అన్నమయ్య జిల్లాల్లో పురాతన విగ్రహాలు

కడప, జనవరి 24, 
అన్నమయ్య జిల్లాలో పొలంలో పురాతన విగ్రహం బయటపడింది. తంబళ్లపల్లె మండలం కోటకొండ పంచాయతీ ఏటగడ్డపల్లె సమీపంలో ఓ రైతు బుధవారం పొలం దున్నుతున్నాడు. ఈ క్రమంలో పొలంలో మహా విష్ణువు విగ్రహం బయటకు వచ్చింది.. దానిపై ఉన్న మట్టిని తొలగించి బయటకు తీశారు. ఈ విషయం తెలియడంతో స్థానికులు భారీగా తరలివచ్చారు.. స్వామివారి విగ్రహాన్ని పూజించి దర్శించుకున్నారు. ఈ విషయం స్థానిక తహసీల్దార్‌, పోలీసులకు తెలియడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. పొలంలో బయటపడిన ఆ విగ్రహాన్ని పరిశీలించారు. ఈ మహా విష్ణువు విగ్రహం దాదాపు మూడు అడుగుల ఎత్తు ఉంది. మహా విష్ణువు విగ్రహం బయటపడిన పొలాన్ని ఎవరూ దున్నకూడదని తహసీల్దార్ రైతులను ఆదేశించారు. అయితే నాలుగు రోజుల క్రితం కూడా ఆ సమీపంలోనే మరో రెండు విగ్రహాలు బయటపడ్డాయి. దీంతో ఆ పొలం ఉన్న ప్రాంతంలో పురాతన ఆలయ అవశేషాలు ఉంటాయని అనుమానిస్తున్నారు. ఈ మేరకు అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు పురావస్తు శాఖ అధికారులను పిలిపించనున్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపడతామని తహసీల్దార్ తెలియజేశారు. పొలంలో బయటపడిన ఈ మహా విష్ణువు విగ్రహం ఏ కాలం నాటిదో పురావస్తు అధికారులు తేల్చాల్సి ఉంది. ఈ విగ్రహం బయటపడిన అంశం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మండలంలోని కోటకొండలోనే నాలుగు రోజుల క్రితం రైతు పొలంలో రెండు పురాతన రాతి దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. మద్దిరాళ్లపల్లెకు చెందిన రంగారావు పొలాన్ని వెంకటేష్‌ అనే రైతు కౌలుకు తీసుకున్నాడు. ఆయన ఆదివారం రోజు ఆ పొలాన్ని ట్రాక్టర్‌తో దున్నించగా.. వెంకటేష్ సోమవారం ఉదయం ఆ పొలం చూసేందుకు వెళ్లాడు. అక్కడ మట్టితో కప్పి రెండు రాళ్లులా కనిపించాయి. వెంటనే ఆ మట్టి తొలగించి చూడగా.. రెండు పురాతన రాతి విగ్రహాలుగా గుర్తించారు. వెంటనే ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తెలిసింది.. వెంటనే అక్కడికి చేరుకుని.. ఆ రెండు రాతి విగ్రహాలను పరిశీలించి ప్రత్యేక పూజలు చేశారు. తాజాగా మరో విగ్రహం కూడా బయటపడింది.

Related Posts