శ్రీకాకుళం, జనవరి 24,
రాజకీయాల్లోవారసత్వం అనేది సర్వసాధారణం అయింది. తన తరువాత తన వారసులు పొలిటికల్ గా రాణించాలని ప్రతి నాయకుడు కోరుకుంటారు. తాను యాక్టివ్ గా ఉన్నప్పుడే వారసులకు ఒక మార్గం చూపాలని ఎక్కువ మంది భావిస్తారు. ఈ ఎన్నికల్లో చాలామంది టీడీపీ సీనియర్లు పక్కకు తప్పుకున్నారు. తమ వారసులకు ఛాన్స్ ఇచ్చారు. టిడిపి ఆవిర్భావం నుంచి పనిచేసిన అశోక్ గజపతిరాజు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. తన బదులు కుమార్తె అదితి గజపతి రాజుకు అసెంబ్లీ టికెట్ ఇప్పించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. యనమల రామకృష్ణుడు ది అదే పరిస్థితి. ఈసారి ఆయన పక్కకు తప్పుకున్నారు. కుమార్తె దివ్య కు టికెట్ ఇప్పించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అయితే దాదాపు సీనియర్లంతా ఇదే పని చేశారు. కానీ ఇప్పుడు టిడిపి నేతలు వైపు చూసి వైసిపి నేతలు బాధపడుతున్నారు. తాము అధికారంలో ఉండగానే తమ వారసులకు సరైన మార్గం చూపలేకపోయాం అన్న బాధ వారిని వెంటాడుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ నేతల్లో ఈ పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్లు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం ఇటువంటి మనస్థాపంతోనే గడుపుతున్నారు. తాము రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండగానే పిల్లలిద్దరిని సెట్ చేయాలని భావించారు. కానీ ఇద్దరు నేతల ప్రయత్నాలు ఫలించలేదు.అయితే ఈ ఇద్దరు నేతల సమకాలీకుడు కింజరాపు ఎర్రం నాయుడు. ఆయన అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు కుమారుడు రామ్మోహన్ నాయుడు. ఇలా వచ్చాడో లేదో బుల్లెట్ లా దూసుకుపోయాడు. హ్యాట్రిక్ విజయంతో.. చిన్న వయసులోనే కేంద్రమంత్రి అయ్యాడు. అత్యున్నత పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. జాతీయస్థాయిలో సైతం గుర్తింపు సాధించాడు. రాజకీయంగా రాటు తేలాడు. జిల్లా పై పూర్తిస్థాయి పట్టు సాధించాడు. తమ సహచర నేత ఎర్రం నాయుడు వారసుడు అలా రాణిస్తే.. తమ వారసులు ఇంకా రాజకీయ అరంగేట్రం చేయలేకపోయారని బాధ అటు ధర్మాన ప్రసాదరావు తో పాటు తమ్మినేని సీతారాం లో ఉంది.రాజకీయ వారసుడిగా కుమారుడు రామ్ మనోహర్ నాయుడు ని ప్రమోట్ చేయాలని ధర్మాన ప్రసాదరావుఎప్పటినుంచో ఆలోచన చేస్తున్నారు. సరైన సమయంలో రంగంలోకి దించాలని చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో తనకు బదులు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు కు అవకాశం ఇవ్వాలని జగన్ ను కోరారు ధర్మాన ప్రసాదరావు. కానీ జగన్ అంగీకరించలేదు. ఈ ఎన్నికల్లో ఉద్యోగులు ఉపాధ్యాయులు అధికంగా ఉండే శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మూడోసారి పోటీ చేశారు ధర్మాన. దారుణ పరాజయం చవిచూశారు. అయితే తన కుమారుడిని బరిలో దించి ఉంటే.. తొలిసారి భారీ అపజయం ఎదురయ్యేదని ఆయన బాధపడ్డారు. కుమారుడి రాజకీయ జీవితం కోసం ఆయన ప్రణాళిక వేస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీలో ఉండడం ఆయనకు ఇష్టం లేదు. అలాగని ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. కుమారుడి రాజకీయ భవిష్యత్తు సైతం తీర్చిదిద్దలేకపోయాను అన్న బెంగ ఆయనను వెంటాడుతోంది.మరోవైపు స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాజయం చవి చూశారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. అప్పటినుంచి 1999 వరకు ఆమదాల వలస నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందుతూ వచ్చారు. అటు తరువాత తమ్మినేని సీతారాంకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. మధ్యలో ప్రజారాజ్యం పార్టీకి వెళ్లి చేతులు కాల్చుకున్నారు. అయితే 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో గెలిచి స్పీకర్ అయ్యారు. పదవిలో ఉండగానే తన కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ను ప్రమోట్ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు వైసిపి టిక్కెట్ ఇవ్వాలని అధినేత జగన్ ను కోరారు. కానీ జగన్ సమతించలేదు. మరోసారి పోటీ చేసిన తమ్మినేని కి ఘోర పరాజయం ఎదురయింది. అయితే నియోజకవర్గ వైసిపి బాధ్యతలు తన కుమారుడికి ఇవ్వాలని తమ్మినేని కోరారు. అందుకు జగన్ అంగీకరించలేదు. ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్న చింతాడ రవికుమార్ కు వైసీపీ ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు జగన్. దీంతో కుమారుడు రాజకీయ భవిష్యత్తుకు దోహదపడలేకపోయాను అన్న బెంగ తమ్మినేని సీతారాంకు వెంటాడుతోంది. మొత్తానికైతే సిక్కోలులో ఇద్దరు వైసీపీ నేతల వారసుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.