హైదరాబాద్, జనవరి 24,
కాషాయ పార్టీలో నయా జోష్ తీసుకొచ్చేందుకు యువ నాయకులే ప్రధాన ఎజెండాగా.. పార్టీపెద్దలు.. పావులు కదుపుతున్నారనే టాక్ నడుస్తోంది. పరివారులు వేస్తున్న పాచికలు ఎంతవరకూ సక్సెస్ అవుతాయనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. తెలంగాణ బీజేపీ నేతలు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారట. పార్టీ బలోపేతం సహా వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్యూచర్ ప్లాన్‌లో అధిష్టానం నిమగ్నమైందనే టాక్ నడుస్తోంది. స్థానిక సంస్థలు, GHMC ఎన్నికలే టార్గెట్‌గా బీజేపీ అగ్రనేతలు.. ప్రణాళికలు రచిస్తున్నారట. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం పార్టీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొంతవరకు ఓటు బ్యాంకును పెంచుకోగలిగిందని.. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనే యోచనలో టీబీజేపీ ఉందట. అందుకే.. రెట్టింపు ఉత్సాహం, ప్రణాళికలతో స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం.ఎన్నికల్లో సత్తా చాటితే పార్టీని గ్రౌండ్ లెవల్ కు తీసుకెళ్లవచ్చనే ఆలోచనతో పరివారులు స్కెచ్ వేస్తున్నారట. సంస్థాగత ఎన్నికల తరువాత లోకల్ బాడీ ఎన్నికల కమిటీలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. గెలిచిన ప్రతినిధులతో పాటు, కొత్తగా ఎన్నిక కాబోతున్న రాష్ట్ర కమిటీ సమన్వయంతో.. స్థానిక ఎన్నికల్లో ఓటు బ్యాంకును గణనీయంగా పెంచాలని కాషాయదళం యోచిస్తోందట. తద్వారా కాంగ్రెస్ దూకుడును ముకుతాడు వేయాలని పరివారులు ప్లాన్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.రానున్న స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్‌ను.. ఎదుర్కొనేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోందట. మేం గెలిచాం.. ఇక మిమ్మల్ని గెలిపించుకుంటామనే నినాదంతో.. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఇటీవల రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనూ అధికార పార్టీపై భవిష్యత్ పోరాటాలకు.. 15 అంశాలతో కూడిన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారట. గత లోక్ సభ ఎన్నికల ఫలితాల గణాంకాల్ని.. రిపీట్ చేసి అధికార కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలని తీవ్ర యత్నాలు చేస్తున్నారట. అందులో భాగంగానే .. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్లాలని కాషాయదళం భావిస్తోందట. రుణమాఫీ, రైతు భరోసా, ఇతర అంశాలపై ప్రజలకు వివరించేలా యాక్షన్ ప్లాన్ రూపొందించుకునే పనిలో శ్రేణులు ఉన్నట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఎంపీ స్థానాలు సాధించిన కమలం పార్టీ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు బ్యాంకును మరింత పెంచుకునేందుకు తీవ్రయత్నాలు చేస్తోందట. ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసిన కమలదళం.. ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న వారిని అక్కున చేర్చుకునే యోచనలో ఉందట. బీజేపీకి అదే ఆయుధంగా మారనుందని.. కాషాయ పరివారులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం బీజేపీదేనని పదేపదే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారట. అందుకు యువతను టార్గెట్ చేస్తూ.. వారి ద్వారానే పార్టీని బలోపేతం చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారట.బీజేపీకి.. కాస్తో, కూస్తో యువత ఆకర్షితులు కాగా.. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆ సంఖ్యను పెంచుకునేలా చూసి.. గెలుపు అవకాశాలపై నేతలు దృష్టి సారిస్తున్నారట. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల నిరసనలు, వారి సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు నానాపాట్లూ పడుతున్నారనే టాక్ నడుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఏ అంశాన్ని అయినా.. తమ పార్టీ డెవలప్‌మెంట్ కోసం వాడుకునే యోచనలో కమలనాథులు ఉన్నారనే టాక్ బలంగా వినపిస్తోంది.కాషాయపార్టీలో నయా జోష్ తీసుకొచ్చేందుకు కమలనాథులు ప్లాన్ చేస్తున్నారట. అందుకు మహిళలు, యువతకు పెద్ద పీట వేసేందుకు సిద్ధపడుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకుంటున్న నేపథ్యంలో.. మండల, జిల్లా అధ్యక్ష పదవుల్లో యువతకు అవకాశం కల్పిస్తూ…తమది అందరి పార్టీ అనే చెప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం నియమితులవుతున్న వారే.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకూ కొనసాగే అవకాశం ఉందనే విధంగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. త్వరలో స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. గ్రేటర్ పరిధిలో బీజేపీ.. యువతకు పెద్దపేట వేస్తోందట.బల్దియా పీఠంపై కన్నేసిన కాషాయ పార్టీ.. గ్రేటర్ పరిధిలోని ఆరు జిల్లాల్లో 150 డివిజన్లకు ఇప్పటికే అధ్యక్షుల ఎంపిక పూర్తి చేయగా.. మెజారీటీగా యువతకు అవకాశం కల్పించేలా ప్రణాళికలు చేసుకున్నారట. అంతేకాదు మహిళలకు 33 పర్సెంట్ రిజర్వేషన్ ప్రకారం రాష్ట్రంలో 8 నుంచి 10 జిల్లాలకు.. మహిళలను అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచనలో పార్టీ వర్గాలున్నట్టుగా తెలుస్తోంది. గత గ్రేటర్ ఎన్నికల్లో 48 డివిజన్లు కైవసం చేసుకున్న పరివారులు.. ఈసారి మెజారిటీ స్థానాలే లక్ష్యంగా పాచికలు కదిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.గత అసెంబ్లీ ఎన్నికల్లో నగర పరిధిలో గోషామహల్ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి, చేవెళ్ల స్థానాల్లో గెలుపొందడంతో పాటు ఊహించని విధంగా ఓట్ల శాతం పెరగడంతో గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేస్తోంది. ఆరు జిల్లాలుగా ఉన్న గ్రేటర్ పరిధిలో జిల్లా అధ్యక్షులు కీలకం కావడంతో కమలం పార్టీ అధ్యక్షుల ఎంపిక అంశంలో ఎలాంటి ఈక్వేషన్స్‌తో… ఎవరికి అధ్యక్ష పదవులు కట్టబెడుతోందనేది ఆసక్తిగా మారింది.