
న్యూ యార్క్
గుండెల నిండా దేశభక్తిని నింపుకున్న ప్రవాస తెలుగువారు న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో 76వ గణతంత్ర వేడుకలు జరుపుకున్నారు. స్థానిక హిక్స్ విల్లే హిందూ టెంపుల్ లో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా న్యూయార్క్ కాన్సులేట్ జనరల్ నుంచి పబ్లిక్ ఎఫైర్స్ కాన్సుల్ శ్రీమతి ప్రజ్ఞా సింగ్ హాజరయ్యారు.
ఉత్సవాల్లో పాల్గొని నైటా కుటుంబ సభ్యుల సమక్షంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.
పెద్ద సంఖ్యలో హాజరైన తెలుగువారి మధ్య రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని, అమెరికాలో స్థిరపడినా ప్రతీ భారతీయుడి గుండెల్లో దేశభక్తి అణువణువునా ఉంటుందని ఆమె అన్నారు.
కార్యక్రమానికి హాజరైన చిన్నారులు దేశభక్తితో కూడిన పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి అలరించారు. అందరు చిన్నారులకు నైటా అధ్యక్షురాలు వాణి ఏనుగు ప్రశంసా పత్రాలను అందించారు.
న్యూయార్క్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రొఫెసర్ రాజశేఖర్ వంగపాటి ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. అమెరికాలో ఎదుగుతున్న భారతీయ చిన్నారులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, దేశ ప్రతిష్టను ఇనుమడించటంలో వీరి పాత్ర రానున్న రోజుల్లో మరింతగా పెరగాలని ఆకాంక్షించారు.
నైటా కార్యవర్గ సభ్యులు, వారి కుటుంబాలు, న్యూయార్క్, న్యూజెర్సీ తదితర ప్రాంతాల్లో ఉన్న తెలుగువారు, తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై రిపబ్లిక్ డే వేడుకలను విజయవంతం చేశారు. నైటా వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ ఏనుగు సమన్వయకర్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరించారు.