YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

క్యాడర్ కు అండగా పార్టీ

క్యాడర్ కు అండగా పార్టీ

అనంతపురం, జనవరి 30, 
టీడీపీ అధినేత చంద్రబాబుకు, జగన్ కు మధ్య తేడా చాలా ఉంది. చంద్రబాబుకు ఎన్నికల్లో గట్టెక్కడం ఎలాగో తెలుసు. అలాగే జనాలను ఎన్నికల సమయంలో వాగ్దానాల ద్వారా తనకు అనుకూలంగా మలచుకునేందుకు అవకాశముంది. అదే క్యాడర్ విషయంలో మాత్రం అది కుదరని పని. తమ పార్టీ అధికారంలోకి వస్తే చాలు అని భావించి అన్నింటికీ తెగించి పార్టీ కార్యకర్తలు గెలుపు కోసం కృషి చేస్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టిగా నిలబడేది వాళ్లే. ఓటర్లను పోలింగ్ కేంద్రాలను తరలించేది వాళ్లే. అలాగే ప్రజలను చైతన్యవంతుల్ని చేయడంతో పాటు ప్రభుత్వంపై విమర్శలను తిప్పికొట్టడంలో క్యాడర్ ముందుంటుంది. అందుకే ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా అందుకు క్యాడర్ పాత్రను ఎవరూ కాదనలేరు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు క్యాడర్ ను పట్టించుకోలేదు. పూర్తిగా సంక్షేమ పథకాలను మాత్రమే ఆయన అమలు చేయగలిగారు. అంతేకాదు వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో క్యాడర్ కనుమరుగై పోయింది. ప్రజలు కూడా పార్టీ క్యాడర్ ను పట్టించుకోలేదు. వారి మాటలకు గ్రామ స్థాయిలో విలువ లేకుండా పోయింది. గ్రామంలో జెండా పట్టుకుని తిరిగిన వాళ్లను జనం లెక్క చేయకపోవడం సహజంగా ఇగో దెబ్బతింటుంది. ప్రజలు పట్టించుకుంటే, నాయకత్వం తమకు బాధ్యతలు అప్పగిస్తే ఎప్పటికైనా లీడర్లుగా ఎదుగుతామని క్యాడర్ తెగించి పోరాడుతుంది. కానీ జగన్ చేసిన తప్పుతోనే మొన్నటి ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ క్యాడర్ దూరంగా ఉంది. వాలంటీర్లు ఉద్యోగులు కాబట్టి వారు సహజంగా పట్టించుకోలేదు కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇప్పటి వరకూ వాలంటీర్లను అస్సలు పట్టించుకోలేదు. ఎన్నికలకు ముందు పదివేల రూపాయలు నెలకు గౌరవ వేతనం ఇస్తామని చెప్పిన చంద్రబాబు అసలు వారిని కొనసాగించే ఉద్దేశ్యంలో కూడా లేరు. ఆ వ్యవస్థ వల్ల ఉపయోగం లేదన్న భావనకు చంద్రబాబు వచ్చారు. అందించే పింఛన్లు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా నెల మొదటి రోజే పంపిణీ చేస్తుండటంతో వాలంటరీ వ్యవస్థ గురించి కూడా జనం పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా టీడీపీ క్యాడర్ కు గ్రామ స్థాయి నుంచి పలుకుబడి పెరిగింది. వారి వద్దకు సిఫార్సుల కోసం వచ్చే వారి సంఖ్య పెరిగింది. దీంతో పాటు కోటి మంది సభ్యత్వాన్ని చేర్పించడంలోనూ క్యాడర్ సక్సెస్ అయిందనే చెప్పాలి.ఇక చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అలాగే ఉచిత ఇసుక ద్వారా క్యాడర్ లబ్దిపొందుతుంది. మద్యం దుకాణాలను కైవసం చేసుకుని ఆర్థికంగా టీడీపీ క్యాడర్ ప్రయోజనం పొందుతుంది. మరొక వైపు రహదారి మరమ్మతు పనుల విషయంలోనూ క్యాడర్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి తోడు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ వస్తుున్నారు. ఇలా జగన్ చేసిన తప్పులను చంద్రబాబు మాత్రం చేయడం లేదు. క్యాడర్ తనకు రక్షణ అని ఆయనకు తెలుసు. రేపటి ఎన్నికల్లోనూ గెలుపు సాధ్యంకావాలంటే వారిని కాపాడుకోవడమే మంచిదన్న చంద్రబాబుఆలోచన ఆయన అనుభవం నుంచి వచ్చిందే. అందుకే జగన్ అలా అయిపోయారు.. చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారు.

Related Posts