YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సమస్యలు తీరాలి..చదువు అందాలి..

సమస్యలు తీరాలి..చదువు అందాలి..
కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సందడి మొదలైంది. వేసవి సెలవలు సరదాగా గడిపిన పిల్లలు ఇక ఆటలకు సెలవిచ్చి చదువుల కోసం సంచి భుజాన వేసుకుని మళ్లీ బడిబాట పట్టారు. ఇప్పటికే తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపేందుకు అవసరమైనవి కొని సిద్ధం చేశారు. జిల్లా విద్యాశాఖ, అధికార యంత్రాంగం పూర్తిగా పాఠశాలల పున:ప్రారంభంపైనే దృష్టి పెట్టింది. విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చర్యలు ప్రారంభించింది. ఇదిలాఉంటే కర్నూలు వ్యాప్తంగా 1914 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలలు 470 ఉండగా ఉన్నత పాఠశాలలు 551 ఉన్నాయి. ఈ బడుల్లో 4 లక్షల మందికి పైగా విద్యనభ్యసిస్తున్నారు. 15 వేలకు మందికి పైగా ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాలలే గాక 53 కేజీబివి పాఠశాలలు, 33 మోడల్‌ స్కూళ్లు, ఎయిడెడ్‌ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా కొత్త విద్యా సంవత్సరం కూడా అనేక సమస్యలతోనే ప్రారంభమైంది. వేసవికి ముందే పాఠశాలల్లో పిల్లల సంఖ్యకు తగ్గట్లు మౌళిక వసతులు కల్పించాలని విద్యాశాఖ భావించినా లక్ష్యం చేరుకోలేకపోయినట్లు విద్యార్ధి సంఘాలు నేతలు అంటున్నారు.
 
ఈ ఏడాది వేసవిలో ప్రతి పాఠశాలలకు ఒకే రంగు ఉండేలా సున్నాలు వేయించారు. అయితే మరుగుదొడ్లు పనులు, పాఠశాలల మరమ్మతులు పూర్తి కాలేదు. మరుదుదొడ్లు ఉన్నచోట నీటి వసతి లేదు. కిటికీలకు ఉన్న పాత చెక్కలకే ఇనుప డోర్లు బిగించారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికీ పైకప్పులు ఊడి ప్రమాదరకంగా ఉన్న పాఠశాలలు జిల్లాలో 165 ఉన్నాయని వాటి మరమ్మతులపై తక్షణమే దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే వానలు కురుస్తున్నాయి. రాబోయే రోజుల్లో వానల జోరు పెరుగుతుంది. దీంతో భవనాలు మరింతగా కృంగిపోకుండా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. మరోవైపు మంచినీటి సౌకర్యం లేని బడులు 1200 వరకూ ఉన్నాయని విద్యార్ధి సంఘం నేతలు చెప్తున్నారు. ప్రహరీలు లేనివి 985, విద్యుత్‌ సౌకర్యం లేనివి 125 ఉన్నాయి. దాదాపు 3వేల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ సమస్యలకు తోడు ఈ విద్యా సంవత్సరం నుంచి 625 ప్రాథమిక పాఠశాలల్లో అంగ్ల బోధన జరుగనుంది. అయితే ఇంత వరకు ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. జిల్లాలో 60శాతం మాత్రమే పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. యూనిఫామ్ దుస్తులు కూడా పూర్తి స్థాయిలో లేనట్లు వినికిడి. ఈ సమస్యలన్నీ పరిష్కరించి విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. 

Related Posts