YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఒక్కొక్కరి ఒక్కో కథ

ఒక్కొక్కరి ఒక్కో కథ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7 
ఇండియా చేరుకున్న ఈ వలసదారుల జీవితాలు ఛిద్రమయ్యాయి. అమెరికా కలలు కంటూ, తమ కుటుంబాలకు మంచి జీవితం ఇద్దామనుకుని అక్కడికి వెళ్లిన వీరి ఆశలు అడియాశలయ్యాయి. భవిష్యత్తు అంతా అస్పష్టంగా మారిపోయింది. ఈ క్రమంలో వారి దీనగాథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.అమెరికాలో వర్క్ వీసా ఇప్పిస్తానని నమ్మించిన ఏజెంట్‌కు రూ. 42 లక్షలు ఇచ్చి హర్వీందర్ సింగ్ దారుణంగా మోసపోయాడు. ఆయన పంజాబ్‌లోని హోషియాపుర్‌కు చెందిన తహ్లీ గ్రామం నివాసి. తర్వాత వీసా రాలేదని చెప్పడంతో, ఢిల్లీ నుంచి ఖతర్‌, అక్కడి నుంచి బ్రెజిల్ వెళ్లి, నానాయాతన పడుతూ అమెరికా చేరుకున్నాడు. ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్‌తో ఉన్న డబ్బు పోయి, ఎక్కడ మొదలుపెట్టాడో అక్కడికే తిరిగి వచ్చి నిల్చున్నాడు.హర్వీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎలాగోలా బ్రెజిల్ చేరితే, తర్వాత పెరూలో విమానం ఎక్కిస్తామని చెప్పారు. కానీ అలాంటి ఏర్పాటు ఏదీ చేయలేదు. తర్వాత ట్యాక్సీల్లో కొలంబియా, పనామా తీసుకెళ్లారు. అక్కడి నుంచి నౌక ఎక్కిస్తామన్నారు. అదీ లేదు. రెండు రోజుల పాటు అక్రమ మార్గంలో ప్రయాణించాం. తర్వాత పర్వతమార్గంలో ముందుకెళ్లాం. మెక్సికో సరిహద్దుకు వెళ్లడం కోసం మమ్మల్నందరినీ ఒక చిన్న బోటులో కుక్కేశారు. అందులో నాలుగు గంటలు ప్రయాణించిన తర్వాత బోటు తిరగబడింది. దానివల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పనామా అడవిలో మరొకరు చనిపోయారు’’ అని విలపించాడు.దారాపుర్‌ గ్రామానికి చెందిన సుఖ్‌పాల్‌ సింగ్‌ కూడా ఇలాంటి దుస్థితినే ఎదుర్కొన్నాడు. 15 గంటల పాటు సముద్ర ప్రయాణం చేసి, దాదాపు 45 కి.మీ. పర్వతమార్గంలో ముందుకెళ్లాడు. ‘‘ఎవరైనా గాయపడితే, వారి పరిస్థితి అంతే. మిగిలేది మరణమే. దారివెంట ఎన్నో మృతదేహాలను చూశాం. ఇక కొద్దిసేపట్లో మెక్సికో సరిహద్దు దాటి అమెరికాలో అడుగుపెడతామనగా, జలంధర్‌కు చెందిన ఓ వ్యక్తి అరెస్టు కావడంతో మా ప్రయాణం అంతా వృథా అయింది. దాంతో మమ్మల్ని 14 రోజులపాటు చీకటి గదుల్లో బంధించారు. సూర్యుడు జాడే లేకుండా పోయింది. అక్కడ వేలాది మంది పంజాబీ కుటుంబాలకు చెందిన యువకులు, పిల్లలు కనిపించారు. అందరిదీ ఒక్కటే దుస్థితి. ఇలా అక్రమ మార్గంలో విదేశాలకు వెళ్లొద్దని కోరుతున్నాను’’ అని సుఖ్‌పాల్ ఆవేదన వ్యక్తం చేశాడు.భారత్‌కు చెందిన 104 మంది అక్రమ వలసదారులతో అమెరికా నుంచి బయలుదేరిన సైనిక విమానం బుధవారం అమృత్‌సర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇందులో అమెరికా నుంచి తిరిగి పంపిన వారిలో 33 మంది హరియాణా, గుజరాత్‌ల నుంచి, 30 మంది పంజాబ్‌ నుంచి, ముగ్దురేసి మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌ల నుంచి, ఇద్దరు చండీగఢ్‌ నుంచి ఉన్నారు. అమృత్‌సర్‌కు తీసుకొచ్చిన వారిలో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు ఉన్నారు. పంజాబ్‌ మంత్రి కుల్దీప్‌ వలసదారులతో మాట్లాడి, వారికి ఎలాంటి కేసులు లేకుండా స్వస్థలాలకు పంపిస్తామని భరోసా ఇచ్చారు. అక్రమ వలసదారులను అమృత్‌సర్‌ పోలీసులు తనిఖీ చేసి, వారి వివరాలను పరిశీలించాక ఇళ్లకు పంపారు.అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం, 20,407 మంది భారతీయులకు సరైన పత్రాలు లేవని గుర్తించి, 17,940 మందిని స్వదేశానికి పంపేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధంగా.. రానున్న రోజుల్లో మరిన్ని భారతీయులు అమెరికా నుంచి తిరిగి రావడం సాధ్యమే.

Related Posts