ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు ఉద్భోదించారు. ఎవరు ఏం చేస్తున్నారో తన వద్ద నివేదికలు ఉన్నాయన్న చంద్రబాబు, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని చెప్పారు. తాను నిర్ణయం తీసుకుంటే అందుకు నేతలే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.ఇక ధర్మపోరాట సభలను ఏపీలో విస్తృతంగా జరపాలని చంద్రబాబు ఈ సమావేశంలో నిర్ణయించారు.అలాగే యువతను ఆకట్టుకునేందుకు, మేధావుల మద్దతును సంపాదించేందుకు చంద్రబాబు వారితో ప్రత్యేకంగా సమావేశం అవ్వాలని నిర్ణయించారు. ఈమేరకు రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో పది సభలను ఏర్పాటు చేయాలని నేతలను ఆదేశించారు. ఈ సభలకు మేధావులు, విద్యార్థులను మాత్రమే ఆహ్వానించాలని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఎంత అవసరమో వారికి వివరించాలని భావిస్తున్నారు. ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే ఏపీ అభివృద్ధి ఆగిపోతుందని, గడిచిన నాలుగేళ్లలో ఏపీ సాధించిన ప్రగతి ఏంటో వారికి సవివరంగా చెప్పి తమవైపుకు తిప్పుకోవాలని బాబు ఈ సమావేశాలను ఏర్పాటు చేయనున్నారు. రాబోయే తొమ్మిది నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 75 సభలను ఏర్పాటు చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ సభల ద్వారా ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం చేసిన నమ్మకద్రోహాన్ని ఎండగట్టాలని, ఏపీ లో జరుగుతున్న కుట్ర రాజకీయాలను బహిర్గతం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు బీజేపీ చేతిలో పావులుగా మారారన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు ధర్మపోరాట సభ రాజమండ్రిలో నిర్వహించాలని చంద్రబాబు సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటి వరకూ విజయవాడ, తిరుపతి, విశాఖల్లో సభలను నిర్వహించారు. తదుపరి సభను రాజమండ్రిలో నిర్వహించాలన్న నిర్ణయాన్ని ఈ సమావేశంలో తీసుకున్నారు. ఇక గ్రామ దర్శిని కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొనసాగించాలని చంద్రబాబు సమావేశంలో ఆదేశించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రతిగ్రామానికి వెళ్లి ప్రస్తుత పరిస్థితులను వివరించాలన్నారు.ఇక పోలింగ్ కేంద్రాల వారీగా దాదాపు నలభై వేల మంది కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని, ఈ శిక్షణ ఆగస్టు లోగా పూర్తి చేయాలని నేతలను బాబు ఆదేశించారు. మొత్తం మీద చంద్రబాబు తొమ్మిది నెలల ప్రణాళిక ను ఈ సమావేశంలో సిద్ధం చేశారు.