వచ్చే ఎన్నికలకు రజనీకాంత్, కమల్ హాసన్ లు కూటమిగా ఏర్పడే అవకాశముందని ఎక్కువ మంది విశ్లేషిస్తున్నారు. తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉంది. అధికార అన్నాడీఎంకే నాలుగు ముక్కలుగా చీలిపోయింది. ఆ పార్టీని నడిపించే నాయకుడే లేరు. ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి ఆ మాత్రమైనా పన్నీర్, పళనిస్వామిలకు కొంత ఫాలోయింగ్ ఉంది. పదవిలో లేకుంటే వారి ఇమేజ్ పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడదు. అమ్మ జయలలిత బొమ్మ పెట్టుకుని ముందుకు వెళ్లినా పెద్దగా ఓట్లు రాలవన్నది విశ్లేషకుల అంచనా.ఇక డీఎంకే పార్టీ పరిస్థితి కూడా అలానే ఉంది. డీఎంకే అధినేత కరుణానిధి ఇంటికే పరిమితమవ్వడంతో పార్టీ వ్యవహారాలను మొత్తం స్టాలిన్ చూస్తున్నారు. స్టాలిన్ కు పార్టీని ఎన్నికల్లో నడిపించే స్టామినా లేదనేది ఆ పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో గుబులు రేపుతుంది. డీఎంకే రజనీకి దగ్గరవ్వాలని చూస్తుంది. రజనీ అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయడానికి స్టాలిన్ రెడీ అవుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లా కాకుండా ముందుగానే కూటమిగా ఏర్పడాలన్నది స్టాలిన్ ఆలోచన.రజనీకాంత్ ఒంటరిగా పోటీ చేస్తే అన్నాడీఎంకే మాత్రమే కాకుండా డీఎంకే ఓట్లకు కూడా భారీగా గండి పడే అవకాశముంది. దీంతో స్టాలిన్ ఇటీవల రజనీకాంత్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కమల్ హాసన్, రజనీకాంత్, డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా ఏర్పడితే అధికారం సునాయాసంగా చేజిక్కించుకోవవచ్చన్నది వారి వ్యూహం. ప్రతి ఎన్నికే డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకే ల మధ్యనే జరుగుతుంది. అయితే ఈసారి ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ ఉన్నా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. మరి రజనీకాంత్ కూటమికి అంగీకరిస్తే మాత్రం ఖచ్చితంగా విజయం ఆ కూటమిదేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తం మీద తమిళనాడులో రాజకీయాలు ఎన్నికల నాటికి ఏ టర్న్ అయినా తీసుకోవచ్చన్నది విశ్లేషకుల అంచనా.