
హైదరాబాద్ , ఫిబ్రవరి 10,
తెలంగాణలో ప్రముఖ ఆలయమైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు, టెంపుల్ ప్రొటెక్షన్ మూమెంట్ ఫౌండర్ రంగరాజన్ అతని తండ్రి సౌందర్య రాజన్ లపై దాడి జరిగింది. శుక్రవారం జరిగిన దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హిందూ ధర్మం, ఆలయాల వ్యవస్థపై జరుగే దాడులను నిత్యం ప్రశ్నిస్తూ.. రంగరాజన్ ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటారు. విదేశాల్లో ఉన్నత ఉద్యోగం మారేసి.. తరాలుగా వారి ఆధీనంలోని చిలుకూరు ఆలయంలో ప్రధానార్చకులుగా పూజాక్రతువులు నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రంగరాజన్ సుపరిచితులు.. అలాంటి వ్యక్తిపై దాడి జరగడం సంచలనంగా మారింది. వివిధ వర్గాలు, సంఘాలు.. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఆలయ ప్రాంగణంలోని రంగరాజన్ ఇంట్లోకి రాత్రివేళ చొరబడిన దుండగులు.. ఆయన, వృద్ధులైన ఆయన తండ్రి పై విచక్షణారహితంగా దాడి చేసి, గాయపరిచారు. ఈ ఘటనకు సంబంధించి.. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో.. ఈ దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ఇేద ఘటనకు సంబంధించిన ఓ వీడియో సైతం బయటకు వచ్చింది. దాంతో.. అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన రంగరాజన్ గారిపై దాడిని రెండు రోజులు అవుతున్న బయటకు రాకుండా గోప్యంగా ఉంచడంపైనా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రంగరాజన్ సైతం ఈ విషయంపై పూర్తి వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. తమపై దాడి జరిగిందని, పోలీసులకు ఫిర్యాదు చేశామని మాత్రమే వెల్లడించారు. అంతకు మించి తాను ఇంకేమి మాట్లాడను అంటూ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయంపై విచారణ చేపట్టిన పోలీసులు దాడి కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిసింది. దాడికి పాల్పడిన వారిలో వీరరాఘవ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుపుతామని, నిందితులను అదుపులోకి తీసుకుంటామని ప్రకటించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు బాలాజీ ఆలయం సమీపంలోని రంగరాజన్ నివాసానికి వచ్చిన కొందరు.. రామ రాజ్యాం స్థాపనకు మద్ధతివ్వాలని కోరారు. అందుకు ఆయన నిరాకరించడంతో వారు వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆయన కుమారుడిపైనా దాడికి పాల్పడ్డారు అని తెలిపారు.రంగరాజన్, సౌందర్య రాజన్ లపై దాడి విషయమై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాాయి. దాడికిి పాల్పడిన వాళ్లు, అందుకు సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సున్నితమైన వ్యవహారం కావడం, హిందూ సంఘాలు, కార్యకర్తలు.. నిరసనలకు దిగే అవకాశం ఉండడంతో పోలీసులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దాడులకు కారణమైన వాళ్లును పట్టుకునే పనిలో ఉన్నారు.హిందూ సమాజాన్ని భక్తి మార్గం వైపు నడిపించడంలో, వివిధ సమస్యలపై తనదైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో చిలుకూరు ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ ముందుంటారు. రాష్ట్రంలో ఎక్కడ సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగినా తాను ముందుంటానని చెబుతుంటారు. అలాంటి వ్యక్తిపై దాడితో.. ఆయా వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.