
హైదరాబాద్, ఫిబ్రవరి 10,
తెలంగాణ ఇచ్చిన పార్టీగా పదేళ్ల తర్వాత రాకరాక అధికారం వచ్చింది. మరి దాన్ని నిలుపుకోవాలంటే ఏం చేయాలి.. మార్పు కావాలి కాంగ్రెస్ రావాలన్నారు. మరి కాంగ్రెస్ వచ్చింది.. కానీ పార్టీలో ఏం జరుగుతోంది? ఏడాదికే జనంలో పలచన అయిపోయేంతగా లుకలుకలు బయటపడాలా? బలహీనంగా ఉన్నా.. బలంగా ఉన్నామనే చెప్పుకోవాలి.. లోపాలుంటే అంతర్గతంగా సరిదిద్దుకోవాలి.. కానీ బహిరంగ విమర్శలు దేనికి? అందరికీ నచ్చే.. అందరూ మెచ్చే నిర్ణయాలే కదా ఇప్పుడు జరుగుతున్నాయి. అంతిమంగా ప్రజలకు మేలు జరిగేవే చేస్తున్నారు కదా.. ఒక్క లైన్ పై ఉండాల్సిన పరిస్థితుల్లో లైన్ దాటితే ఏమవుతుంది అనుకోవచ్చు. కానీ జరిగేది జరుగుతుంది. అందుకే అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు నిర్వహించిన సీఎల్పీ సమావేశం చాలా ప్రశ్నలకు సమాధానమిచ్చింది. ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత పెరిగేలా వాతావరణం కల్పించింది.రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు, సూచనలు ఇస్తే తప్పకుండా తీసుకోవాలి. ఎదుటివారు చెప్పేది సీఎం సావధానంగా వింటున్నారు. అందరికీ అందుబాటులో ఉన్నారు. ఎవరు వచ్చినా కాదనకుండా కలుస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు కదా. తమ నియోజకవర్గానికి ఇది కావాలి అని వెళ్తే కాదనకుండా చేస్తున్న పరిస్థితి చూడడం లేదా? ప్రస్తుతం కాంగ్రెస్ లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా మంది రిలాక్స్ మోడ్ లో కనిపిస్తున్నారు. అందుకే లేటెస్ట్ గా పెట్టిన సీఎల్పీ మీటింగ్ ఒక అలర్ట్ అయితే ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 21 వేల కోట్ల రుణమాఫీ చేసినా.. 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా దాన్ని అందిపుచ్చకోవడం లేదన్న చర్చ అయితే నడుస్తోంది. పైరవీలు, పరేషాన్లు ఎందుకన్న టాక్ కూడా నడుస్తోంది.జనంలో ఉండకుండా.. చేసింది గొప్పగా ప్రచారం చేసుకోకుండా తిప్పలెందుకన్న టాక్ కూడా వచ్చింది. పార్టీ లీడర్ షిప్ లైన్ లో పని చేయాల్సిన బాధ్యత లేదా? పార్టీ ఫస్ట్ పర్సన్ సెకండ్ అని పీసీసీ చీఫ్ ఎందుకు అనాల్సి వస్తోందన్నది హస్తం పార్టీలో ఇప్పుడు అందరూ ఆలోచించుకోవాల్సిన టైమ్. నాకేమిస్తారు.. నాకేం కావాలి.. బదులు పార్టీకి ఏం కావాలి.. జనంలో ఇంకా బలం పెంచుకోవడం ఎలా అన్న యాంగిల్ లో ఆలోచిస్తే పదవులు వాటంతట అవే వస్తాయన్న చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా? అందుకే ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన టైం వచ్చేసిందన్నది ఇప్పుడు వస్తున్న మాట. సమస్య ఉంది.. పరిష్కారం కావాలి.. అంత మాత్రానికే సీక్రెట్ మీటింగ్స్ డిన్నర్ మీటింగ్స్ ఎందుకన్నది పార్టీ మాట.తెలివితో పాటు నిజాయితీ, నమ్మకం కూడా ముఖ్యమే.. లోపల ఒకలా.. బయట ఒకలా ఉంటే కుదురుతుందా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ వైపు ఎడ్జ్ పెరిగినా.. రేవంత్ రెడ్డి దూకుడుతో అంతా కాంగ్రెస్ వైపు టర్న్ అయింది. అప్పుడున్న టీమ్ వర్క్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కంటిన్యూ అయితే ఇంకా బలం పుంజుకుంటారని తెలియదా..? ఇది పోటీ యుగం. కళ్లు మూసి తెరిచేలోపు చాలా జరిగిపోతుంటాయి. సహజంగానే అధికారంలో ఉన్న వారిపై అన్ని వైపుల నుంచి ఫోకస్ ఉంటుంది. విమర్శలు వచ్చి పడుతూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోకుండా.. విమర్శలు పెరిగేలా వాతావరణం సృష్టిస్తే నష్టం జరిగేదెవరికన్నది చర్చకు పెట్టిన మ్యాటర్.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తూనే ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ఫోకస్ పెట్టింది. మహిళలకు ఫ్రీ బస్సు వచ్చింది. 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ వస్తోంది. 500 రూపాయలకే సిలిండర్లు ఇస్తున్నారు. తాలు తప్ప తేమ ఇలా కొర్రీలు లేకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి రైతుల అకౌంట్లలో వేశారు. గత పదేళ్లతో పోలిస్తే వచ్చిన మార్పు ఇది కాదా.. రోజుల తరబడి కల్లాల్లో ధాన్యం అమ్మేందుకు ఎదురు చూసిన ఇదే రైతులు త్వరత్వరగా ఇప్పుడు అమ్మేయలేదా.. అంతెందుకు సన్నాలు పండించిన వాళ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా?25 లక్షల రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది వాస్తవం కాదా? అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 31 వేల మందికి ఉద్యోగ నియామకపత్రాలు ఇవ్వడం, ఏడాది తిరగక ముందే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ఇవే కాదు.. గత పదేళ్లు తొక్కిపెట్టిన రేషన్ కార్డులకు మోక్షం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. రైతు భరోసా ఎకరానికి 6 వేలు వరుసగా అందుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకం షురువైంది. ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షలకు పెరిగింది. ఇంత జరుగుతున్నా.. ఇంత చేసినా చెప్పుకోవడంలో వెనుకబడుతున్నది ఎవరు? ఈ పథకాలన్నీ అర్హులకు ఇప్పించుకోవడం ఎమ్మెల్యేల బాధ్యత కాదా? అక్రమార్కులు చెరబట్టిన చెరువులకు హైడ్రాతో విముక్తి కల్పిస్తున్నారు. జనంతో పాటు పర్యావరణం కూడా ముఖ్యమే కదా. మంచిని జనం ఆహ్వానిస్తారు. దాన్నే చెప్పుకోవడం ముఖ్యం.
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసి పంపడం, అలాగే కులగణన చేసి బీసీలకు మేలు చేయాలన్న ఆలోచనతో దాన్ని పట్టాలెక్కించడాన్ని ఆహ్వానించాల్సిన బాధ్యత కాంగ్రెస్ సభ్యులదే. మరి జనానికి వాటిని వివరించడం కష్టమవుతోందా.. ఓవైపు లక్ష మంది ఎన్యుమరేటర్లను పెట్టి.. వారిలో ఒక్కొక్కరికి 150 ఇండ్లు ఇచ్చి 60 రోజుల్లో పకడ్బందీగా సర్వే చేయిస్తే దాన్ని రాంగ్ డైవర్షన్ లో తీసుకెళ్లడం కరెక్టేనా? అసలు ఇన్నాళ్లు బీసీలకు మేలు జరగాలన్న ఆలోచనే జరగలేదు. కనీసం ఇప్పుడైనా ఓ ముందడుగు పడిందని గుర్తించలేకపోతున్నారెందుకు? అది కూడా లేకపోతే ఏదీ రాదు అన్నది గ్రహించలేకపోతున్నారా.. విపక్షాల లైన్ లో కాంగ్రెస్ చేసిన గొప్పపనిని తక్కువ చేసి చూపించుకుంటే నష్టపోయేది ఎవరు? ఆలోచించుకోవాలి.
మరో ముఖ్యమైన సమస్య. మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్యాప్ ఎందుకు వస్తోంది.. ఎమ్మెల్యేలు కార్యకర్తలకు మధ్య గ్యాప్ ఇలాగే ఉంటే కష్టం కాదా.. అన్నది ఇంకో పాయింట్. ఇదే విషయంపై మున్షి ఘాటుగా వార్నింగ్ ఇచ్చారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విపక్షంలో ఉన్నప్పుడే కార్యకర్తలను గుర్తు పెట్టుకోవడం కాదు.. అధికారంలో ఉన్నప్పుడు కూడా వారి సాదకబాధకాలు వినాలన్న పాయింట్ తెరపైకి వస్తోంది. ఇవన్నీ వదిలేసి పైరవీలు, పదవులు అంటూ తిరిగితే ఐదేళ్ల తర్వాత ఏం జరుగుతుందో గ్రహించలేరా? అన్నది సమీక్షించుకోవాల్సిన టైమ్ వచ్చేసింది.గ్రామీణ రోడ్లన్నీ బాగు చేస్తున్నారు. ఆపకుండా నిధులు ఇస్తున్నారు. ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు దగ్గరుండి నియోజకవర్గం బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తోంది నాయకత్వం. గతంలో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే ప్రయారిటీ ఇచ్చి మిగితా ప్రాజెక్టులను అడ్డంగా బుక్ చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక అన్ని ప్రాంతాలకూ బెనిఫిట్ జరగాలన్న ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రయారిటీ ఇస్తున్నారు. ఇవన్నీ చెప్పుకోకపోతే ఎలా.. దగ్గరుండి చూసుకోకపోతే ఎలా.. అన్నది చర్చకు వస్తోంది.