ఏపీకి కేంద్ర పెద్దలు, రాష్ట్ర బీజేపీ నేతలు తీరని అన్యాయం చేశారంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రచారం ప్రజల్లోకి తీవ్రంగా వెళ్లిన నేపథ్యంలో కమలనాథుల భవిష్యత్ వ్యూహాలేమిటి? ఏపీ ప్రజల్లో బీజేపీపై వ్యక్తమవుతున్న తీవ్ర ఆగ్రహజ్వాలలు చల్లార్చి.. ఏపీ అభివృద్ధికి నాలుగేళ్లలో ఏం చేశామో చెప్పేం దుకు రాష్ట్ర నేతలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?హోదా విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీజేపీ.. రాబోయే ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. వ్యతిరేక భావనను అధిగమించి పార్టీని ఎలా ముందుకు తీసుకు వెళ్లాలనే దానిపై నేతలు కసరత్తు ప్రారంభించారు. ఇంతటి వ్యతిరేకత నుంచి పార్టీని బయటపడేసి రాష్ట్రంలో బలోపేతం చేయటంపైనా చర్యలు తీసుకోబోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా బాధ్యతలు తీసుకున్న త ర్వాత ఆ పార్టీ నేతలంతా తొలిసారి సమావేశయ్యారు. విభజన హామీల విషయంలో అధికార పార్టీతో పాటు మిగిలిన పార్టీల నుంచి వస్తున్న విమర్శలను ఎలా తిప్పికొట్టాలనే అంశంపై చర్చించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమ లుపై వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించిన బీజేపీ.. త్వరలోనే రాష్ట్రంలో బస్సు యాత్రకు సిద్ధం అవుతోంది.కొత్త సారథి కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో సమావేశమైన నేతలు.. భారీ యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. ఏపీకి అభివృద్ధికి తామేం చేశామో.. ప్రభుత్వం వాటిని ఎలా దుర్వినియోగం చేసిందో ప్రజలకు వివరించేందుకు త్వరలో బస్సు యాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. విభజన హామీలు అమలు చేయడంలో బీజేపీ, కేంద్రం మోసం చేశాయనే భావన రాష్ట్ర ప్రజల్లోకి తీవ్రంగా వెళ్లిపోయింది. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన తర్వాత.. సీఎం చంద్రబాబు ఇదే అంశాన్ని పదేపదే చెబుతుండటంతో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది.కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తే.. బీజేపీ హోదా ఇవ్వకుండా మోసం చేసిందనే భావన చాలామందిలో నెలకొంది. మరోపక్క హోదా ఇస్తామని చెప్పి.. తర్వాత మాట మార్చిన తీరుపైనా ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ప్యాకేజీ, ఇతర అంశాలకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అంగీకరించినా.. తర్వాత బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. ఏపీలో బీజేపీకి భవిష్యత్ లేకుండా చేయడానికి తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో బాబు దూకుడికి కళ్లెం వేసి ప్రజల్లో తిరిగి నమ్మకాన్నిచూరగొనేందుకు కమలనాథులు వ్యూహాన్నిసిద్ధం చేశారు.బస్సుయాత్రతో పాటు కరపత్రాలతో రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని కూడా ప్రజలకు వివరించాలని బీజేపీ నేతలు డిసైడ్ అయ్యారు. 2019లో పార్టీకి మంచి ఫలితాలను అందించమే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపైనా నేతలు అభి ప్రాయాలను పంచుకున్నారు. పొత్తులపై మాత్రం పార్టీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభావం ఉండబోదని మిగతా పార్టీలు వ్యక్తం చేసిన అభిప్రాయలను బీజేపీ కొట్టి పారేసింది. తమ పార్టీ బూత్ లెవల్లో బలంగా పుంజుకుంటోందని.. వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభావం తప్పక కనిపిస్తుంద ని ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ. మరి బీజేపీ నేతల వ్యూహాలు ఎంత వరకూ ఫలిస్తాయో వేచిచూడాల్సిందే!