YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎవరీ రాఘవ రెడ్డి....

ఎవరీ రాఘవ రెడ్డి....

హైదరాబాద్, ఫిబ్రవరి 11, 
తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచి న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చ కుడు రంగరాజన్‌పై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని కొప్పవరానికి  చెందిన వీరరాఘవరెడ్డి తాను స్థాపించిన రామరాజ్యం సంస్థలో సభ్యులను చేర్పించాలని, తమకు ఆర్థిక సాయం చేయాలని రంగ రాజన్‌ను డిమాండ్ చేయగా, దానికి ఆయన నిరాకరించారు. దీంతో వీరరాఘవరెడ్డి తదితరులు రంగరాజన్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఉదయం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ప్రధాన నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకొన్నా మని, అరెస్ట్ అయిన వారిలో ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారిని గుర్తించా మన్నారు. తాము స్థాపించిన రామరాజ్యంలో సభ్యుల్ని చేర్పించడంతో పాటు తమకు ఆర్థిక సాయం అందించాలని పలుమార్లు వీరరాఘవరెడ్డి రంగరాజన్‌ను సంప్రదించగా ఆయన నిరాకరించడంతో దాడికి పాల్పడినట్లు డీసీపీ పేర్కొన్నారు. దాడి ఘటనలో పోలీసులు మొత్తం 22 మందిని గుర్తించారు.17 మంది నిందితుల ఆచూకీ తెలిసినట్లు అందులో తెలంగాణకు చెందిన ఏడుగురు, ఏపీకి చెందిన 17 మంది ఉన్నారని చెప్పారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఏపీకి చెందిన వీరరాఘవరెడ్డి 2022లో రామరాజ్యం స్థాపించారు. తాను స్థాపించిన రామరాజ్యం సంస్థను బలోపేతం చేసేందుకు  సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. రామరాజ్యంలో చేరిన వారికి కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టారు. ఇందులో చేరిన వారికి నెలవారీగా రూ.20వేల జీతం ఇస్తానని సభ్యులకు వివరించి వారికి నియమనిబంధనల గురించి వివరించారు. ఇటీవల తణుకు, కోటప్పకొండలో వీరరాఘవరెడ్డి  పర్యటించి రామ రాజ్యం విధివిధానాల గురించి సభ్యులకు హితబోధ చేశారు. ప్రత్యేకంగా రామరాజ్యంలో చేరిన వారికి డ్రెస్‌కోడ్ ఉండాలని ఈ నెల 6వ తేదీన యాప్రాల్ రామరాజ్యం సభ్యులంతా సమావేశమయ్యారు. రామరాజ్యం సభ్యులంతా బ్యానర్‌ను పెట్టుకొని ఫొటోలు, వీడియోలు దిగి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీన రామరాజ్యం సభ్యులంతా వీరరాఘవరెడ్డి నాయకత్వంలో 25 మంది  బృందం ప్రత్యేకంగా నల్లదుస్తులు ధరించి  చిలుకూరు ఆలయ సమీపంలో అర్చకుడు రంగరాజన్ నివాసానికి చేరుకొని ఆయనపై దాడికి పాల్పడ్డారు. గత కొంత కాలంగా వీరరాఘవరెడ్డి మణికొండలో నివాసం ఉంటున్నట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఉదయం రంగరాజన్ ఇంటికి వెళ్లిన వీరరాఘవరెడ్డి తదితరులు ఆలయ బాధ్యతలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దానికి రంగరాజన్ నిరాకరించడంతో దాడికి దిగారు. దాడిని అడ్డుకో బోయిన రంగరాజన్ కుమారుడిని సైతం కొట్టారు. తాము ఇక్ష్వాకు వంశస్థులమని, ఆలయ పరిధిలో ఈ గోత్రం ఉన్నవారిని, శాస్త్రం నేర్చేవారిని ఎందుకు గుర్తించడం లేద ని రంగరాజన్‌ను ప్రశ్నించారు. ఊరికే కోర్టు లో కేసులు వేస్తే ఏం లాభమని, తాము చెప్పినట్టు వినాలన్నారు. ఉగాది వరకు టైం ఇస్తున్నామని, రామరాజ్య స్థాపనకు సహకరించకపోతే తాము రామని, వచ్చేవారు వచ్చి పనిచేసుకుని వెళ్తారని హెచ్చరించారు. 2040 నాటికి రామరాజ్యం ఏర్పాటు చేస్తానని వీరరాఘవరెడ్డి ‘రామరాజ్యం’ పేరి ట ఓ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేశాడు. అదే పేరుతో వెబ్‌సైట్ సైతం ప్రారంభించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు తిరుగుతూ రామరాజ్య స్థాపనపై ప్రచారం చేస్తున్నాడు. తనకు 5వేల మంది సైన్యం కావాలని ప్రకటన జారీ చేశాడు. భగవద్గీత వచ్చి ఉండాలని, ఐదు కిలోమీటర్లు నడవడం, రెండు కిలోమీటర్లు పరుగెత్తడం చేయ గలగాలని నియమాలు పెట్టాడు. అంతకుముందు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర సెటిలర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. జైహింద్, జై విశ్వమానవ వేదిక పేరుతో 2016లో ఓ గ్రూపును సైతం ఏర్పాటు చేశాడు. తర్వాత దాన్ని మూసివేసి గోరక్షణ పేరుతో కార్యక్రమాలు ప్రారంభించాడు. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకునేందుకు సైన్యాన్ని వాడుకున్నాడు. 2015లో అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో వీరరాఘవరెడ్డిపై ఓ కేసు కూడా నమోదైంది.

Related Posts