
తిరుపతి, ఫిబ్రవరి 11,
వైఎస్ఆర్‌సీపీ పరిస్థితిని మళ్లీ గాడిన పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా చేరికల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇటీవలే శైలజానాథ్ ను చేర్చుకున్న ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్లను ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ఖాళీగా ఉన్న ఇతర నేతల్ని కూడా చేర్చుకునే ఆలోచనలు చేస్తున్నారు. నగరి నియోజకవర్గంలో తాజాగా మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి జగదీష్ ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల్లో ఆయనకు పార్టీ కండువా కప్పే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గాలి భాను ప్రకాష్ .. ముద్దుకృష్ణమనాయుడు మొదటి కుమారుడు. ఆయన రెండో కుమారుడు జగదీష్. ఆయన కూడా నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకుని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. గాలి జగదీష్ కు.. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సోదరుడు గాలి భానుప్రకాష్ కు సరిపడటం లేదు. తండ్రి చనిపోయాక ఎవరి దారి వారిదయింది. ఓ సందర్భంలో ఇద్దరూ టీడీపీ టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. కానీ చంద్రబాబు భాను ప్రకాష్ వైపే మొగ్గారు. తల్లి మద్దతు జగదీష్ కే ఉంది. అయితే జగదీష్ మామ కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నేత. ఆయన సాయంతో ఇప్పుడు వైసీపీలో టిక్కెట్ హామీతో చేరేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం నగరిలో జరుగుతోంది. అయితే నగరి నియోజకవర్గంలో కీలక నేతగా రోజా ఉన్నారు. అక్కడ్నుంచి రెండు సార్లు గెలిచారు. మంత్రిగా చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇటీవల మళ్లీ తన నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో ఆమెకు పోటీగా మరో నేతను చేర్చుకుంటే రోజా మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంది. గాలి జగదీష్ చేరిక అంశంపై రోజాకు సమాచారం ఇవ్వలేదు కానీ.. విషయం మాత్రం ఆమెకు తెలిసిందని అంటున్నారు. జగదీష్ ను చేర్చుకోవద్దని పార్టీ హైకమాండ్ కు ఆమె చెప్పినట్లుగా వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. జగన్ మాత్రం ఇప్పుడు నియోజకవర్గాల్లో సామ్రాజ్యాలేమీ లేవని.. పార్టీ బలోపేతం కోసం కలసి వచ్చే నేతలందర్నీ చేర్చుకుంటామని చెబుతున్నారు. అందరూ కలిసి పార్టీని బలోపేతం చేస్తే ఎన్నికలప్పుడు టిక్కెట్ల గురించి ఆలోచిద్దామని అంటున్నట్లుగా చెబుతున్నారు. గాలి జగదీష్ ను చేర్చుకోవడం వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని అనుకుంటున్నారు. పెద్దిరెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఆయనను తప్పించారు. పెద్దిరెడ్డి అనుచరులుగా ఉన్న నగరి కీలక నేతల్ని సస్పెండ్ చేశారు. నగరి నియోజకవర్గంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు తెలుగు దేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోగా.. ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే ఆయన అకాల మరణం తర్వాత అక్కడ పరిస్థితులు మారిపోయాయి.. ఎమ్మెల్సీ సీటు కోసం ఇద్దరు కుమారులు (భాను ప్రకాష్, జగదీష్ ప్రకాష్)లు పోటీపడ్డారు. రాజకీయవారసత్వంపై ఇద్దరి మధ్య కొద్దిరోజులు వార్ నడిచింది.. చివరికి ముద్దుకృష్ణమనాయుడు సతీమణి సరస్వతికి ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఆ తర్వాత ఇద్దరు కుమారుల మధ్య విభేదాలు అలాగే కొనసాగాయి.. ఇద్దరు నగరి టీడీపీ ఇంఛార్జ్ పదవిని ఆశించారు. కానీ భాను ప్రకాష్‌కు ఇంఛార్జ్ పదవి దక్కడంతో జగదీష్ సొంతంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టారు.ఈ క్రమంలో 2019 ఎన్నికల్లోల భాను ప్రకాష్‌కు టీడీపీ టికెట్ కేటాయించింది.. ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో జగదీష్ తనకు మళ్లీ అవకాశం వస్తుందని భావించారు.. నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు. భాను ప్రకాష్, జగదీష్‌లు టికెట్ కోసం పోటీపడ్డారు.. 2024 ఎన్నికల సమయంలో కూడా టీడీపీ భాను ప్రకాష్‌కు సీటు కేటాయించగా రోజాపై విజయం సాధించారు. జగదీష్ నగరిలో ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు జగదీష్ వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే నగరిలో అన్నదమ్ముల సవాల్ అన్న రేంజ్‌లో రాజకీయాలు నడుస్తాయి.. అలాగే మాజీ మంత్రి రోజా జగదీష్‌తో కలిసి రాజకీయాలు చేస్తారా అన్నది చూడాలి. అయితే జగదీష్ మామకు కూడా రాజకీయ నేపథ్యం ఉందంట.. ఆయన కర్ణాటకలో మంత్రి కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. దాంతో నగరిలో అంతా సద్దుమణిగిపోయిందని అనుకున్నారు కానీ.. అలాంటి పరిస్థితి లేదని.. తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. గాలి జగదీష్ ను వైసీపీలో చేర్చుకుంటే రోజా ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.