
విజయవాడ, ఫిబ్రవరి 11,
లండన్ ట్రిప్ నుంచి రాగానే ఎన్నికల్లో విజయంపై బోల్డు ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్.. వచ్చే ఎన్నికల్లో గెలిచి ఏకంగా 30 ఏళ్లు అధికారంలో కొనసాగుతానని తన జోస్యం తానే చెప్పేసుకుంటున్నారు. పవర్ పోయి 8 నెలలు కాకుండానే మళ్లీ గెలుస్తాం.. 30 ఏళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని పాత పాట అందుకున్నారు. వైసీపీ రాష్ట్రాన్ని ఏలుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్కడితో ఆగితే బాగుండేదేమో.. కాని ఆ సెల్ఫ్ జాతకం చెప్పుకుంటున్న క్రమంలో ఆయన పార్టీని వీడిన కీలక నేతలు, రాజీనామా చేసిన మాజీ రాజ్యసభ సభ్యుల విశ్వసనీయత గురించి మాట్లాడారు. జగన్ ఆ ప్రెస్‌మీట్లో ముందు తాను చెప్పాలనుకుంది చెప్పేశారు. తర్వాత ఎవరో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు రియాక్ట్ అయిన ఆయన క్రెడిబిలిటీ గురించి లెక్చర్ ఇచ్చారు. అది ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడారో? లేకపోతే ఆ ఫ్లోలో అనాలోచితంగా నోరు జారారో కాని అది ఇప్పుడు ఆయనకు బూమరాంగ్ అవుతుంది. జగన్ వ్యాఖ్యలపై అక్రమ ఆస్తుల కేసుల్లో జగన్ సహ నిందితులు, మాజీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణలు వెంటనే రియాక్ట్ అయి కౌంటర్ ఇవ్వడంతో.. జగన్ క్రెడిబిలిటీ గురించి మాట్లాడి సెల్ఫ్‌గోల్ చేసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి వైసీపీ స్థాపన దగ్గర నుంచి జగన్ వెన్నంటే ఉన్నారు.. అంతకు ముందు జగన్ తండ్రి, తాతల హయాం నుంచి ఆడిటర్ అయిన సాయిరెడ్డికి ఆ కుటుంబంతో అనుబంధం ఉంది. జగన్ లోటుపాట్లు, ఆర్థిక మూలాలు, లావాదేవీల లెక్కలు ఒక ఆడిటర్‌గా సాయిరెడ్డి వేళ్ల మీద ఉంటాయి. వైఎస్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధంతో ఆయన మొదటి నుంచి జగన్‌కు వీరవిధేయుడిగానే వ్యవహరిస్తూ వచ్చారు. అక్రమాస్తుల కేసులో జగన్‌తో కలిసి 16 నెలలు రిమాండ్ ఖైదీగా గడిపారు . పార్టీ పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు కూడా సాయి రెడ్డి ఆయన్ని పల్లెత్తు మాట అనలేదు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి, రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన సాయిరెడ్డి లోటస్‌పాండ్‌లోని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇంటికి వెళ్లడం, దాదాపు 3 గంటల పాటు భేటీ అవ్వడం రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించింది. జగన్, షర్మిలల మధ్య కుటుంబ, రాజకీయ విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్న నేపధ్యంలో విజయసాయిరెడ్డి స్వయంగా వెళ్లి షర్మిలను కలవడం రకరకాల చర్చలకు తావిచ్చింది. విజయసాయిరెడ్డిపై అనేక సందర్భాల్లో షర్మిల ఘాటైన విమర్శలు చేశారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారని విజయసాయి ప్రకటించడంపైనా ఆమె అభ్యంతరం తెలిపారు. అలాంటి షర్మిలతో భేటీ సందర్భంగా విజయసాయి ఏం మాట్లాడి ఉంటారా అన్న ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలో షర్మిలే ఆ సస్పెన్స్‌కు తెర దించారు .. విశ్వసనీయత గురించి మాట్లాడిన జగన్‌కు సాయిరెడ్డి కౌంటర్ ఇచ్చిన తర్వాత షర్మిల మీడియా ముందుకొచ్చి ఆయనతో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వెల్లడించారు. ఈ సందర్భంగా జగన్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఫోకస్ అయిన విజయసాయి.. వాస్తవానికి జగన్‌తో ఎన్నో ఇబ్బందులు పడ్డారంట. క్యారెక్టర్ అంటే ఏంటో జగన్ మరిచిపోయారని.. అలాంటి జగన్ క్యారెక్టర్ గురించి పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్నారని షర్మిల యద్దేవా చేశారు.. వైఎస్ కోరికకు భిన్నంగా అబద్ధం చెప్పాలని విజయసాయిపై ఒత్తిడి తెచ్చినప్పుడు జగన్ క్యారెక్టర్ అర్థమైందని దెప్పిపొడిచారు. సొంత మేనకోడలు, మేనల్లుడు ఆస్తులు కాజేయాలని జగన్ ఎన్నో కుట్రలు చేస్తున్నారని… తన పిల్లలకు ముఖం చూపించే ధైర్యం జగన్‌కి ఉందా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నంత కాలం జగన్ అపాయింట్‌మెంట్ దొరకడమే గగనంగా ఉండేది. మంత్రులు, ఎమ్మెల్యేలనే తన ప్యాలెస్ బయట నిలబెట్టేసిన ఆయన.. పరదాల మాటున పనిపాలన సాగించి.. కార్యకర్తలను ఎప్పుడూ పట్టించుకోలేదు. అలా రాచరిక పాలన సాగించిన జగన్ ఓటమి తర్వాత ఇంత కాలానికి వాస్తవ లోకంలోకి వస్తున్నారు. పార్టీ నుంచి పెరిగిపోతున్న వలసలతో బెంబేలెత్తిపోతూ.. వారికి నేనున్నానని భరోసా ఇచ్చేప్రయత్నం చేస్తున్నారు. దానిపై షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్, షర్మిల లెక్కలు ఎలా ఉన్నా.. ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఎపిసోడ్ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జగన్ లెక్కలు, బొక్కలు అన్నీ తెలిసిన విజయసాయిరెడ్డి ట్వీట్‌తో జగన్‌కు కౌంటర్ ఇచ్చినప్పుడే అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. అంతకు ముందే ఆయన షర్మిల నివాసానికి వెళ్లి జగన్ నిర్వాకాలపై ఓపెన్ అయ్యారని తెలిసి ఇప్పుడు వైసీపీ వర్గాలు ఉలిక్కిపడుతున్నాయి. సాయిరెడ్డి రాజీనామా తర్వాత ఒకటొకటిగా వెలుగు చూస్తున్న ఉదంతాలతో ఆయన ఎప్పటి నుంచో జగన్‌పై అసంతృప్తితో ఉన్నారని స్పష్టమవుతుంది. ఇక జగన్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి ఆడిటర్ రెడీ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.