YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వంశీ గాయబ్....

వంశీ గాయబ్....

విజయవాడ, ఫిబ్రవరి 12, 
కృష్ణ జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. నోటి దూకుడుతో అత్యంత వివాదాస్పదమైన నేతగా పాపులార్టీ సొంతం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే. టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రి ఇచ్చి విజయవాడ ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. తర్వాత గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేగా వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. 2019లో రెండో సారి గెలిచాక టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో… తన దారి తాను చూసుకుని వైసీపీ పంచకు చేరారు. మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందన్న ధీమాతో టీడీపీ ముఖ్య నేతలపై ఇష్టానుసారం నోరు పారేసుకుంటూ చెలరేగిపోయారు.గత ఎన్నికల ఓట్ల కౌంటింగ్ రోజు పోలింగ్ సరళిని గమనించి కౌంటింగ్ కేంద్రం నుంచి మధ్యలోనే మాయమయ్యారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కూడా ఘోర పరాజయం పాలవ్వడంతో నియోజకవర్గానికి దూరంగా, కేడర్ కే అందుబాటులోకి లేకుండా పోయారు. ఎంతలా అంటే ఆయన ఎక్కడున్నారా? అని అధికార పార్టీ నేతలు ఆరా తీసినా కూడా ఆచూకీ దొరకలేదంట. మధ్యలో ఒకసారి తాడేపల్లిలో జిల్లా వైసీపీ సమీక్షా సమావేశానికి హాజరైన ఆ మాజీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలతో కలిసి మీడియా ముందుకు వచ్చినప్పటికీ.. మాట్లాడకుండానే గాయబ్ అయిపోయారు.వల్లభనేని వంశీ కోసం 7 నెలలుగా ఇటు సొంత పార్టీ నేతలు, అటు అధికార పార్టీ నేతలు ఎంత అచూకీ తీసినా ఎక్కడ ఉన్నారో కూడా కనిపెట్టలేకపోయారు. టీడీపీ ముఖ్య నేతలతో పాటు, చంద్రబాబు ఫ్యామిలీపై ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్న వల్లభనేని వంశీపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే విజయవాడలోని ఆయన ఇంటిపై దాడికి కూడా ప్రయత్నించడంతో పోలీసులు ఎంటరై పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది. గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులో ఏ 71 గా వంశీని ఎలాగైనా అరెస్టు చేయాలని పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసినా ఆయన దొరకలేదు. ఆ కేసులో వంశీ మినహా అందరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే వంశీ మాత్రం ఎక్కడ ఉన్నారో అటు పోలీసులకు ఇటు టీడీపీ నేతలకు అంతు చిక్కలేదు.ఆ క్రమంలో వంశీ రాష్ట్రాన్ని దాటి విదేశాలకు వెళ్లారని ప్రచారం జరిగితే మరి కొంత మంది మాత్రం పక్క రాష్ట్రాల్లో తలదాచుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అటు చూస్తే 2019 ఎన్నికల్లో వంశీపై వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఘన విజయం సొంతం చేసుకున్నారు. ఇటు వంశీ కనిపించకుండా పోవడంతో గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అనాధలా తయారైంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలకు సంబంధించి వంశీ అనుచరులు అరెస్ట్ అవుతున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది.ఆ ఎఫెక్ట్‌తో సొంత పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న విమర్శలకు ఇప్పుడు తెర వెనక ఉండే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారంట వంశీ.. కూటమీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గన్నవరం నియోజకవర్గంలో పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. వరుస అరెస్టులతో వైసీపీ శ్రేణులు బెంబేలెత్తిపోతున్నాయి. వంశీ కూడా అరెస్ట్ భయంతోనే పలాయనం చిత్తగించారన్న ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రచారానికి సైలెంట్ గా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్న వంశీ.. గన్నవరం నియోజకవర్గం వైసీపీలో జరుగుతున్న, మారుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని ఆయన అనచరులు అంటున్నారు.ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో వైసిపి ముఖ్య నేతలే టార్గెట్‌గా గత 7 నెలల వ్యవధిలో నమోదైన కేసులు, అరెస్టులు, దాడులు లాంటి అంశాల విషయంలో వంశీ పార్టీ వారికి నేనున్నాను అనే భరోసాను ఇస్తున్నారట. గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో 89మంది నిందితులను చేర్చగా .. తాను కూడా ఒక నిందితుడైన వంశీ మిగిలిన వారికి ఏ రకమైన సహాయసహకారాలు అందించలేదని వైసీపీ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత కేసులు మొత్తం తిరగదోడుతుండటంతో గన్నవరం నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు, నేతలపై నమోదైన కేసులను మాజీ ఎమ్మెల్యే సీరియస్‌గా తీసుకున్నారంట.అందులో భాగంగా కేసులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారంట. జిల్లా స్థాయిలో స్పెషల్ కోర్టులో బెయిల్ వ్యవహారాలు చూడటానికి ఒక టీమ్‌ని.. అవసరమైతే సుప్రీంకోర్టు, హై కోర్టు మెట్లు ఎక్కడానికి ఒక టీమ్‌ని ప్రత్యేకంగా నియమించి కేసుల బాధ్యతను భుజానికెత్తుకున్నారంట. అనేక కేసుల్లో ఇటీవల వంశీ ప్రధాన అనుచరులతో పాటు కీలక నేతల అందరి పైన కేసు నమోదు అయ్యాయి. పలువుర్ని అరెస్టు చేశారు. దాంతో వారికి భరోసా కల్పించడానికి.. వారి కుటుంబాలకు ఆర్థికంగా సహాయం అందించడంతో పాటు.. న్యాయపరమైన వ్యవహారాలను తెర వెనుక ఉండి సూపర్‌వైజ్ చేస్తున్నారంటనోరు జారి వంశీ చేసిన విమర్శలు అప్పట్లో పెద్ద కలకలమే రేపాయి. వంశీ ప్రోద్భలంతో గన్నవరం నియోజకవర్గంలో జరిగిన దాడులకు ప్రస్తుతం వైసీపీ శ్రేణులు మూల్యం చెల్లించుకుంటున్నాయి. వంశీ సైతం కేసులు చట్రంలో ఇరుక్కున్నారు. దాంతో ఆయన నియోజక వర్గానికి ముఖం చాటేస్తున్నారు. అయితే దీర్ఘ కాలం కేడర్‌కు అందుబాటులో లేకుండా పోతే.. రాజకీయంగా అసలుకే ఎసరు వస్తుందనుకున్నారో ఏమో? వంశీ తిరిగి యాక్టివ్ అవ్వడానికి గ్రౌండ్ ప్రిపేర్చేసుకుంటున్నారంట. తనతో పాటు వైసీపీ వారిపై పెట్టిన కేసులకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తూ వాటి నుంచి బయట పడే పనిలో ఉన్నారంటున్నారు.వైసీపీ వారికి ఆర్థికంగా అండగా నిలబడుతూ.. కేసుల చిక్కులు తొలగిపోగానే నియోజకవర్గానికి వచ్చి అందర్నీ కలుస్తానని తన వారితో చెప్పిస్తున్నారంట. తాను ఎక్కడున్నాననేది ఇప్పుడు అప్రస్తుతమని, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుంచి అందరూ బయట పడ్డాక పార్టీ యాక్టివిటీస్ మొదలుపెడతామని సూచిస్తున్నారంట. కేసులు దాడులు, అరెస్టులపై ఆందోళన చెంద వద్దని, తన కేసుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చాక నియోజకవర్గంలోనే త్వరలో సమావేశాన్ని నిర్వహించి నేతలందరినీ కలుస్తానని రాయబారాలు పంపుతున్నారంట. తన రాజకీయ భవిష్యత్తు కోసం వంశీ పడుతున్న పాట్లు ప్రస్తుతం గన్నవరం సెగ్మెంట్లో హాట్ టాపిక్‌గా మారాయి. వంశీ ప్రయత్నాలు ఫలించి తమ వారు బెయిలుపై బయటకు వస్తే చాలని నిందితుల ఫ్యామిలీలు ఎదురు చూస్తున్నాయి. చూడాలి మరి వంశీ అన్నీ చక్క పెట్టుకుని ఎప్పుడు వస్తారో?

Related Posts