ఆంధ్ర ప్రదేశ్ భవన్ లో ఘనంగా జరిగిన సూర్య ఆరాధన.
సకల ప్రాణికోటికి శక్తినిచ్చే సూర్యునికి నమస్కరించడం, యోగాభ్యాసం వలన మానవునికి నూతన ఉత్తేజాన్ని, శక్తిని ప్రసాదిస్తుందని ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఉద్ఘాటించారు. ఆంధ్ర ప్రదేశ్ భవన్ లో ఆదివారం ఉదయం నిర్వహించిన “సూర్యారాధన” కార్యక్రమంలో సూర్య నమస్కారాలు, సూర్యస్త్రోత్రం, అర్ఘ్యం, యోగా మొదలైన కార్యక్రమాలు ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహభరితంగా జరిగాయి.
ఈ సందర్భంగా రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ‘ఉషోదయ రాష్ట్రం’గా నిలపాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సూర్య శక్తిని ఒడిసిపట్టి రాష్ట్రమంతా నిరంతరం వెలుగులు నింపాలనే తలంపుతో సౌర విద్యుశ్చక్తి ప్రాజెక్టుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాదాన్యతనిస్తున్నదని చెప్పారు. ఈ నేపద్యంలో సూర్యభగవానుని ఆరాధించేందుకు, మానవ శక్తిని ద్విగుణీకృతం చేసుకొనేందుకు కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి ఏటా రధసప్తమి అనంతరం వచ్చే ఆదివారం రోజున సూర్య నమస్కారాలు, సూర్య ఆరాధన, యోగా, అర్ఘ్యం, హోమం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
సూర్య నమస్కారంలతోపాటు యోగాభ్యాసం వల్ల ఆయుః ప్రమాణం పెరుగుతుందని, క్రమం తప్పకుండా ప్రతి ఉదయం ప్రతి ఒక్కరూ నడక, యోగాసనాలు ఆచరించడంవల్ల నూతన ఉత్తేజాన్ని పొందగలమని రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ సూచించారు. నేడు ఇక్కడ జరిగిన సూర్య ఆరాధన, సూర్యునికి వందనం, హోమం వంటి ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనడం ఎంతో ముదావహం అని ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ భవన్ ఓ.ఎస్.డి., మెట్టా రామారావు, డిప్యూటి కమీషనర్ టి. సూర్యనారాయణ, పి.ఎ.ఓ., వెంకట్రామి రెడ్డి, భవన్ అధికారులు, సిబ్బంది, ఢిల్లీ లోని తెలుగు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.